
సాదత్ అహ్మద్‌పై పీడీయాక్ట్
శాంతి భద్రతల విషయంలో పోలీసులకు తలనొప్పి పుట్టిస్తున్న సాదత్ అహ్మద్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
కుత్బుల్లాపూర్: శాంతి భద్రతల విషయంలో పోలీసులకు తలనొప్పి పుట్టిస్తున్న సాదత్ అహ్మద్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాదత్‌ను జీడిమెట్ల పోలీసులు ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సైబరాబాద్ సీపీ ఆనంద్ ఆదేశాల మేరకు సాదత్‌పై పీడీ యాక్ట్ తెరిచారు. సూరారం కాలనీ షిర్డీ సాయిబాబానగర్‌కు చెందిన సాదత్ అహ్మద్ గతంలో హ్యుమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఎస్‌ఏ ఆర్గనైజేషన్ పేరుతో తన ఇంటినే అడ్డాగా చేసుకుని కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్‌నగర్, జీడిమెట్ల ప్రాంతవాసులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమార్జనకు తెర లేపాడు.
ఫోర్జరీ, చీటింగ్, మహిళలపై అఘాయిత్యాలు, దాడులు వంటి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. 2015, నవంబర్ 25న జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన సాదత్ తన పంథా మార్చుకోకుండా మళ్లీ రోడామిస్త్రీనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని బెదిరించాడు. ఈ కేసులో తాజాగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. సాదత్ అతిప్రమాదకరమైన వ్యక్తిగా భావించిన పోలీసులు చివరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు.