
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగుపరచడానికి.. పోలీసు బలగాలను ఆధునీకరించడానికి.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత భద్రతా పథకానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.25 వేల కోట్ల విలువైన ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) సమావేశం బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగింది.
పోలీసు బలగాలను ఆధునీకరించేందుకుగానూ ‘మాడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్(ఎంపీఎఫ్)’పేరిట 2017–18 నుంచి 2019–20 వరకు మూడేళ్ల పాటు రూ.25,060 కోట్ల మేర వెచ్చించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.18,636 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.6,424 కోట్లుగా ఉంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు తెలిపారు.
ఇంతకుముందు ఎన్నడూ చేపట్టని అతిపెద్ద పథకం ఇదని చెప్పారు. ఎంపీఎఫ్ పథకం కింద దేశ అంతర్గత భద్రతకు ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. అలాగే శాంతిభద్రతలు, మహిళల భద్రత, అత్యాధునిక ఆయుధాల లభ్యత, పోలీసు బలగాల రవాణా, సరుకు రవాణా, హెలికాప్టర్లను అందుబాటులో ఉంచడం, పోలీసు వైర్‌లెస్ వ్యవస్థ, జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, క్రైం, క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్, సిస్టమ్స్, ఈ–జైళ్లు మొదలైన వాటిని కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఎంపీఎఫ్ పథకంలో భాగంగా అంతర్గత భద్రత కోసం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.10,132 కోట్లు వ్యయం చేయనున్నట్టు రాజ్‌నాథ్ చెప్పారు. 35 నక్సల్ ప్రభావిత జిల్లాల్లోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.3వేల కోట్లను వ్యయం చేస్తామన్నారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సదుపాయా ల నిమిత్తం రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎంపీఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తామని, జైపూర్ లోని సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజమ్‌ను, అలాగే గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని ఆధునీకరిస్తామని చెప్పారు.
ఏఏఐ భూమి ఏపీ ప్రభుత్వానికి
రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన 10.25 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంతే విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూమిని ఇస్తుంది. రాజమండ్రి విమానాశ్రయం చుట్టూ గల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ఈ భూమిని వినియోగిస్తారు.
ప్రభుత్వ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపు
కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వారికీ ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర వైద్యుల రిటైర్మెం ట్ వయసు కొన్ని విభాగాల్లో 60 ఏళ్లుగా, మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. దీంతో వివిధ విభాగాల్లోని 1,445 మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు మొబైల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది.