
న్యూఢిల్లీ: ప్రజలు నిరసన తెలిపే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు కొన్ని మార్గదర్శకాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతాల్లో నిరసనలు తెలపకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని అక్రమంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం...కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసు విభాగానికి నోటీసులు జారీచేసింది. నిరసన తెలపడం ప్రజల ప్రాథమిక హక్కనీ, దానికి భంగం కలగకుండా, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మధ్యే మార్గంలో నిరసనలు తెలిపేందుకు కొన్ని మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.