లా అండ్ ఆర్డర్ లేదంటే రాజీనామా చేస్తా : నాయిని
హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ శాసనమండలిలో మంగళవారం కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.
మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయని... ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేని నగరాన్ని విశ్వనగరం అంటే ఎలా? అని నిలదీశారు. దీంతో సభలోనే ఉన్న హోంమంత్రి నాయిని వెంటనే లేచి ‘ శాంతి భద్రతలు క్షీణించాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని... శాంతిభద్రతలు సరిగ్గా ఉన్నాయని తేలితే నీవు రాజీనామా చేస్తావా’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. పలువురు కాంగ్రెస్ సభ్యులు లేచి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను నిలదీశారు. ‘నాయిని పెద్దమనిషి. అలాగే మాట్లాడుతాడు’ అంటూ సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.