MS prabhakar
-
ఎమ్మెల్సీగా ఎంఎస్ ప్రభాకర్ ఎన్నిక
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంఎస్ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తప్ప మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఉపసంహరణ గడువు ముగిశాక శుక్రవారం సాయంత్రం ప్రభాకర్‌రావుకు ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ గెలుపు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, తదితరులు హాజరయ్యారు. అనంతరం జీహెచ్ఎంసీలోని పలువురు కార్పొరేటర్లు ప్రభాకర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని ఇదంతా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చలవేనన్నారు. ఆయన చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తదితరులందరి సహకారం వల్లనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్ర మంత్రులుగా పనిచేసిన నాయకులు సైతం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీచేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డి పేరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. నగర మేయర్‌గా పనిచేసిన తొలి దళితుడు తన తండ్రి శామ్రావని గుర్తుచేశారు. -
నకిలీ వైద్యులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పనితీరును తప్పుపడుతూ గురువారం శాసనమండలిలో అధికారపక్ష సభ్యులే మంత్రి లక్ష్మారెడ్డిపై విమర్శలు చేశారు. నకిలీ వైద్యులకు సంబంధించిన ప్రశ్న సందర్భంగా ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లు అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరిన మహిళకు పరీక్షలేవీ చేయకుండానే 15 రోజుల వ్యవధిలో మూడు సర్జరీలు చేసి ఆమె మృతికి కారణమైన వైద్యులు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, మంత్రి పేషీకి ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించలేదని మరో సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి విమర్శించారు. అలాగే సరైన వైద్యం అందించక పోవడంతో అదే ఆస్పత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన ఘటనపైనా ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. దీనిపై లక్ష్మారెడ్డి స్పందిస్తూ మహిళ మృతి కేసులో చట్ట ప్రకారం ఆస్పత్రిపె చర్యలు తీసుకుంటామని, మాజీ ఎమ్మెల్యే మృతి అంశంపై విచారణ జరుగుతోందన్నారు. ఇంకా పలువురు సభ్యులు విమర్శలు కురిపించడంతో మంత్రి లక్ష్మారెడ్డి కొంత అసహనానికి గురవగా ఆర్థిక మంత్రి ఈటల కల్పించుకొని మాట్లాడుతూ రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలంటూ అందరినీ సమాధాన పరిచారు. 1.83 లక్షల కేసీఆర్ కిట్ల పంపిణీ రాష్ట్రంలో స్వల్పకాలంలోనే 1.83 లక్షల కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 శాతం ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. -
లా అండ్ ఆర్డర్ లేదంటే రాజీనామా చేస్తా : నాయిని
హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు సరిగా లేవని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ శాసనమండలిలో మంగళవారం కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయని... ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేని నగరాన్ని విశ్వనగరం అంటే ఎలా? అని నిలదీశారు. దీంతో సభలోనే ఉన్న హోంమంత్రి నాయిని వెంటనే లేచి ‘ శాంతి భద్రతలు క్షీణించాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని... శాంతిభద్రతలు సరిగ్గా ఉన్నాయని తేలితే నీవు రాజీనామా చేస్తావా’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. పలువురు కాంగ్రెస్ సభ్యులు లేచి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను నిలదీశారు. ‘నాయిని పెద్దమనిషి. అలాగే మాట్లాడుతాడు’ అంటూ సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.