
యూపీలో మెరుగైన శాంతిభద్రతలు ఆశించొద్దు: ములాయం
ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పాలనలో శాంతిభద్రతలు దిగజారాయన్న విమర్శల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పాలనలో శాంతిభద్రతలు దిగజారాయన్న విమర్శల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభా 21 కోట్లకుపైగా ఉన్నప్పుడు శాంతిభద్రతలు మెరుగ్గా ఎలా ఉంటాయని శుక్రవారం లక్నోలో ఆయన ప్రశ్నించారు. ‘ఢిల్లీతో యూపీని పోల్చకండి. దేశ రాజధానికన్నా యూపీ 10 రెట్లు పెద్దది. కానీ యూపీతో పోలిస్తే ఢిల్లీలో నేరాలు 10 రెట్లు ఎక్కువ నమోదవుతున్నాయి.
21 కోట్లకుపైగా జనాభా ఉన్న రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతలను ఎలా ఆశిస్తారు?’ అని ఈ అంశంపై తన అభిప్రాయం అడిగిన విలేకరులను ములాయం ఎదురు ప్రశ్నించారు. యూపీలో ఇటీవల జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను అదుపు చేయడంలో అఖిలేశ్ సర్కారు ఘోరంగా విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో ములాయం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2013లో దేశంలోకెల్లా అత్యధికంగా యూపీలో 247 మతహింస సంబంధిత ఘటనలు జరిగినట్లు కేంద్రం ఈ నెల 5న రాజ్యసభలో తెలిపింది.