సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, మిగతా జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి ప్రసాదరావు తెలిపారు. హింసకు పాల్పడితే సహించబోమని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీమాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 45 కంపెనీల పారా మిలటరీ దళాలకు అదనంగా 34 కంపెనీలను మోహరిస్తున్నట్లు వివరించారు.
రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ప్రజలు దాడులుచేస్తున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భ ద్రతను పెంచామన్నారు. విజయనగరంలో పరిస్థితి చేయిదాటడంతో ఆంధ్రా రీజియన్ ఐజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులొచ్చాయనే కోణంలో పరిశీలన జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు.
జగన్ దీక్షకు భద్రత కల్పిస్తున్నాం: సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరశనకు భద్రత కల్పిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దే జగన్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినందున పోలీసుల అనుమతి అవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
హింసకు పాల్పడితే సహించం: డీజీపీ
Published Sun, Oct 6 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement