కిక్కురు చాలెంజ్‌! | Funday Laughing story | Sakshi
Sakshi News home page

కిక్కురు చాలెంజ్‌!

Published Sun, Aug 19 2018 12:07 AM | Last Updated on Sun, Aug 19 2018 12:08 AM

Funday Laughing story - Sakshi

అనగనగా ఒక దిబ్బరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు డబ్బరాజు. ఆ రాజ్యంలో రోడ్లు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో బస్సులు లేవు. బార్లు ఉన్నాయి. ఆ రాజ్యంలో ఉద్యోగాలు లేవు. బార్లు ఉన్నాయి.ఆ రాజ్యంలో సంతోషాలు  లేవు బార్లు ఉన్నాయి. సౌకర్యాలు లేవు....బార్లు  ఉన్నాయి!‘యథారాజా తథాప్రజా’ అంటారు మాటవరుసకి.కానీ ఇక్కడ అది అక్షరాల నిజం. దిబ్బరాజ్యం రాజు డబ్బరాజు గజతాగుబోతు. ఆయన బాటలోనే ప్రజలు మత్తుగా నడుస్తున్నారు. తూలుతూ నడుస్తున్నారు. అకారణంగా ఎవరినో తిడుతూ నడుస్తున్నారు.రోజు రోజుకూ తాగుబోతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడంతో రాజ్యంలో వాంతిభద్రతల సమస్యతో పాటు శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తింది.అలాంటిలోజుల్లో ఒకరోజు మహామంత్రి మల్లయ్య రాజుగారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చి సీరియస్‌గా ఇలా అన్నాడు...‘‘అయ్యా! మీకు మందుచూపు తప్పా... ముందుచూపు బొత్తిగా లోపించింది. ఇలా అయితే మన దిబ్బరాజ్యంలో రాజ్యం మిగలదు. దిబ్బ మాత్రమే మిగులుతుంది. సోషల్‌మీడియా రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో మనకేమవుతుందిలే అనుకుంటే  మన్ను మాత్రమే మిగులుతుంది. ఆ తరువాత తమ ఇష్టం’’‘‘ఇప్పుడేం చేయమంటారు?’’ ఆరో పెగ్గు అవలీలగా గుటుక్కుమనిపించి అడిగాడు రాజు.‘‘మీరు మందు మానేయండి... ప్రజలు కూడా మానేస్తారు’’ టీవీ యాంకర్‌లా  వంకర్లు తిరుగుతూ సలహా ఇచ్చాడు మంత్రి.‘‘ఓస్‌... అంతేనా. ఇదే నా ఆన. ఈ ఫుల్‌బాటిల్‌ కంప్లీట్‌ చేసి.... ఇక ఈ జన్మలో మందు ముట్టను’’ అని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా...‘‘ఈరోజు నుంచే రాజ్యంలో మందును నిషేధిస్తున్నాను’’ అని గట్టిగా అరిచాడు.‘‘నిషేధం విధించడం కంటే ప్రజలే స్వచ్ఛందంగా మందు మానేసేలా చేస్తే మంచిది మహారాజా’’ అన్నాడు మంత్రి.‘‘అలాగే’’ అంటూ చివరి పెగ్గు పూర్తి చేశాడు రాజు.

‘మందు మానేసిన వారికి లక్షరూపాయల క్యాష్‌ అవార్డ్‌’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ముగ్గురు కూడా  మానలేదు.‘మందు మానేసిన వారికి అయిదు ఎకరాల పొలం’ ప్రకటించింది ప్రభుత్వం.కనీసం ఇద్దరు కూడా మానలేదు.చివరిగా...‘మందుమానేసిన వారికి పది ఎకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, అంబాసిడర్‌ కారు, ఫ్రిజ్జు,  ఒనిడా కలర్‌టీవీ....’  ఒకటా రెండా...ఇలా ఎన్నో ప్రకటించింది ప్రభుత్వం.అయినా సరే....కనీసం ఒక్కరు కూడా మానలేదు!రాజుగారు జుట్టు పీక్కుందామని ట్రై చేశారుగానీ... తనది బట్టతల అని గుర్తుకొచ్చి నిరాశగా  సైలెంటైపోయారు. రాజుగారికి ఏంచేయాలో పాలు పోవడం లేదు.సరే. పాలు తాగి ఆలోచిద్దాం అనుకున్నాడు.వేడి వేడి పాలుతాగుతున్న  రాజుగారి దగ్గరికి కూల్‌గా నడిచి వచ్చాడు మంత్రి.‘‘మంత్రివర్యా! ఒక్కడు కూడా రాజ్యంలో మందుమానలేదయ్య...ఏంచేయాలో పాలు పోక ఇలా పాలు తాగున్నాను. నువ్వు కూడా తాగుతావా? పంచదార వేయమంటావా వద్దా?’’ అడుగుతున్నాడు రాజు.‘‘పాలు–పంచదార–తొక్క–తోటకూర...ఇది కాదు మహారాజా ఈ టైమ్‌లో  మనం ఆలోచించాల్సింది. మన రాజ్యంలో ఇకముందు ఒక్కడు కూడా మందు తాగవద్దు. మందు అనే మాట  వినబడగానే ముందు వెనక చూడకుండా పరుగెత్తాలి...దీనికి బ్రహ్మాండమైన ఐడియా ఆలోచించాను’’ ఉత్సాహంగా చెప్పాడు  మంత్రి.‘ఏమిటా ఐడియా?’’ మరింత ఉత్సాహంగా అడిగాడు రాజు.రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు మంత్రి.రాజుగారి ముఖం మున్సిపాలిటీ వారి స్ట్రీటులైటులా వెలిగిపోయింది!రెండు నెలలు తిరక్కుండానే మంత్రిగారు అన్నంత పనీ అయింది. రాజ్యంలో అందరూ మద్యం మానేశారు!

‘‘రాజా! ఇప్పుడు చెప్పు...ఏ ఐడియా ద్వారా మంత్రిగారు మందుబాబులు మందు అంటేనే జడుసుకునేలా చేశారు?’’  విక్రమార్కుడిని అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు  ఏమన్నాడంటే...‘‘భేతాళా! టైమ్లీ ఐడియా అని  కొన్ని ఐడియాలు ఉంటాయి. ప్రతి కాలంలోనూ ఒక వేవ్‌లాంటిది, ట్రెండ్‌లాంటిది, పిచ్చిలాంటిది ఒకటి వస్తుంది. ఆ సమయంలోనే  ఆ పిచ్చిలాంటి ట్రెండ్‌లోకి జంపైపోయి ఒక ఐడియా ప్లాన్‌ చేస్తే తిరిగే ఉండదు’’‘‘విక్రమార్కా! నువ్వు ఏంచెబుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’’ అయోమయంగా అన్నాడు భేతాళుడు.‘‘ఇప్పుడు అందరినీ కిక్‌ ఎక్కిస్తున్నది ఏమిటి?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘కికి’’ అన్నాడు భేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు...‘‘ఒక కికి చాలెంజ్‌  అనే ఏమిటి! ప్లాంకింగ్‌ చాలెంజ్, చోకింగ్‌ చాలెంజ్, ఫైర్‌ చాలేంజ్, కట్టింగ్‌ చాలెంజ్‌...ఒక్కటా రెండా! ఇలా ఎన్నో చాలేంజ్‌లు  ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిబ్బరాజ్యం ‘కిక్కురు’ అనే చాలెంజిని విసిరింది. మందులో కాస్త  నీళ్లు పోసుకొని ఎవరైనా తాగుతారు. కానీ అయిదు లీటర్ల  నీళ్లలో అర క్వార్టరు మందుతో పాటు, చింతపండు పులుసు, కాస్త ఆముదం కలుపుకొని తాగాలి. ఇదే ‘కిక్కురు చాలెంజి’. ఊహించినట్లుగానే మందుబాబుల నుంచి  పెద్ద ఎత్తున  స్పందన వచ్చింది. కిక్కురు చాలెంజిని స్వీకరించని వారిని లెక్కలోకి  తీసుకోని పరిస్థితి వచ్చింది. వేలంవెర్రి మొదలైంది. ఎంతో వాటర్‌+ కొంతమందు+ చింతపండు పులుసు+ కొంత ఆముదం= విరేచనాలు. ఈ ఫార్ములా ప్రకారం రాజ్యంలో  ఎటుచూసినా విరేచనాలే. ఈ దెబ్బతో మందుబాబులకు మందు మీద విరక్తి పుట్టడమే కాదు ఒకలాంటి భయం ఏర్పడింది. అలా కేవలం మూడు నెలలలో కాలంలోనే మందుబాబులంతా కిక్కురుమనకుండా మందు మానేశారు. కిక్కురు చాలెంజా మజాకా!’’
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement