మూడు రోజులుగా మూసి ఉన్న బార్ అండ్ రెస్టారెంట్
యజమానులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీస్, ఎక్సైజ్ శాఖలు
జిల్లా ఎస్పీని కలుస్తామంటున్న బాధితులు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో నూతన సంస్కృతికి తెరలేచింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే నరసరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు దర్శి వచ్చి ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. మూడు రోజులుగా బార్ అండ్ రెస్టారెంట్ తాళాలు ఇవ్వకుండా నిర్వాహకులను ఇబ్బందిపెడుతున్నారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఈ కొత్తసంస్కృతి ఏమిటని జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు దర్శి వచ్చి పట్టణంలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. ఆ తర్వాత ‘పోలీస్ స్టేషన్‌లో తేల్చుకుందాం రండి..’ అని చెప్పి వెళ్లారని బార్‌లో పని చేసేవారు చెబుతున్నారు.
నిర్వాహకులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వారు తమకు సంబంధంలేదని, ఎక్సైజ్‌వారిని సంప్రదించండని చేతులు దులిపేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులను నిర్వాహకులు కలవగా.. ‘బార్ మూసేస్తే పోలీసులను కలవండి. మాకు ఎలాంటి సంబంధం ఉండదు’ అని బదులిచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు.దీంతో మూడు రోజులుగా కేబీ బార్ అండ్ రెస్టారెంట్ తెరవలేదు.
ఈ విషయంపై బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ‘నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు తమ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళతాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment