* గవర్నర్‌కు అధికారాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు
* ప్రత్యేక సందర్భాల్లోనే ఆయన జోక్యం చేసుకుంటారు
* కేంద్ర హోంశాఖ వర్గాల స్పష్టీకరణ
* బదిలీల ప్రక్రియ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చూస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడంపై వచ్చిన అభ్యంతరాలు కేవలం అపోహలేనని కేంద్ర హోంశాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధానిలో పాలనా వ్యవహారాల నిమిత్తం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంది. సెక్షన్ 8(2) ప్రకారం గవర్నర్‌కు శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ఆస్తుల పరిరక్షణ, ముఖ్యమైన సంస్థల భద్రత, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ, కేటాయింపు విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. సెక్షన్ 8(3)ప్రకారం తెలంగాణ ప్రభుత్వ మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ తుది నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అయితే ఆగస్టు 8వ తేదీన కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసిన సర్క్యులర్ ఈ వివాదానికి కారణమైంది. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ స్థాయి బదిలీకి సైతం గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఇది సహేతుకం కాదని టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యమంత్రి అధికారాలను పలుచన చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన వారికి సర్దిచెప్పారు. ఈ విషయమై శుక్రవారం హోంశాఖ అధికారులను సంప్రదించగా.. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని స్పష్టంచేశారు. ‘తెలంగాణకు పంపిన సర్క్యులర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. బదిలీలనేవి పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చూసుకుంటుంది. ఇది సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ బోర్డు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదే అయి ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ జోక్యం ఉండదు. అలాగే గవర్నర్ సైతం రోజువారీ వ్యవహారాల్లో కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జోక్యం చేసుకుంటారు.. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని హోంశాఖకు చెందిన ముఖ్యఅధికారి పేర్కొన్నారు.
ఆ అభ్యంతరాలు అపోహ మాత్రమే!
Published Sat, Aug 23 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM
Advertisement