- అకాల వర్షాలతో తెలంగాణ తీవ్రంగా దెబ్బతింది
- కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను కోరిన దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న తెలంగాణను అందుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమై తెలంగాణలో వర్షాల వల్ల కలిగిన నష్టంపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం రూ. 1,189 కోట్ల నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక బృందాలను పంపి వర్షాల వల్ల కలిగిన నష్టాలపై అంచనా వేయాలన్నారు. ఈ బృందాన్ని వెంటనే పంపి హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని దత్తాత్రేయ కోరారు. అనంతరం సమావేశ వివరాలను దత్తాత్రేయ మీడియాకు వివరించారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలతో పంటలు దెబ్బతినడంతో రైతులను ఆదుకోవాలని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాల వినియోగంపై చర్చించడానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి త్వరలో హైదరాబాద్ వచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపనున్నట్టు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్, భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు.
నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపండి
Published Sat, Oct 1 2016 4:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
Advertisement
Advertisement