ఆస్తులు, రుణాల పంపిణీ పూర్తి చేయాలి
కేంద్ర హోంమంత్రిని కోరిన దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తు లు, రుణాల పంపిణీని సత్వరమే పూర్తిచేయాలని కేంద్రాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, రుణాల పంపిణీ పూర్తి కాకపోవడం, ఆలిండియా సర్వీస్ అధికారుల కొరత వల్ల కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో పాలన, సేవల అమలు ప్రభావితమవుతున్నాయని దత్తాత్రేయ వివరించారు.
సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని 77, 78 నిబంధనల మేరకు రాష్ట్రానికి జ్యుడిషియల్ అధికారుల కేటాయింపు విషయంలో రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని దత్తాత్రేయ కోరారు.