
కేంద్రం చేతిలో హైదరాబాద్ పోలీస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం నేపథ్యంలో హైదరాబాద్ శాంతిభద్రతలు ఎవరి పరిధిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. పదేళ్లపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని నోట్‌లో స్పష్టంచేశారు. దీంతో హైదరాబాద్ శాంతి భద్రతల అంశం ఆ పదేళ్లూ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్న ప్రకారం... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నియామకం, పోలీసుశాఖపై పర్యవేక్షణ మొత్తం కేంద్ర హోంమంత్రి పర్యవేక్షిస్తారు.
హైదరాబాద్ నగర పోలీస్‌లు రెండు రాష్ట్రాల పరిధిలోకి రారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమైనందున ఆ గవర్నర్‌కు హైదరాబాద్ పోలీసు శాఖపై అజమాయిషీ ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హైదరాబాద్‌లోనే ఉంటారు కాబట్టి వారిద్దరి భద్రత వ్యవహారాలను కూడా గవర్నర్ అధీనంలోని పోలీసు శాఖే చూస్తుంది.
రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, హోంమంత్రులకు హైదరాబాద్ పోలీసులపై అజమాయిషీ ఉండబోదు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే పోలీసు సిబ్బందిలో ఇరు ప్రాంతాలకు చెందినవారూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సచివాలయం, శాసనసభలు హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఉండనున్నందున ఇరు రాష్ట్రాల డీజీపీలు కూడా హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆపరేషనల్ కార్యాలయం మాత్రం సీమాంధ్రలో ఏర్పాటు చేసుకుని వారంలో కొన్ని రోజులు అక్కడ్నుంచే కార్యకలాపాలు నిర్వహించవచ్చని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వెల్లడించారు. ఇరు రాష్ట్రాల డీజీపీలు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఇక్కడి పోలీసు కమిషనరేట్‌పై వారికి ఎలాంటి అజమాయిషీ ఉండబోదు.
ఢిల్లీలో పోలీసుశాఖ ఎలా పనిచేస్తోందంటే...
ప్రత్యేక రాష్ట్ర హోదా ఉన్న ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉన్నా.. పోలీసు శాఖ మాత్రం సీఎం పరిధిలో పనిచేయడం లేదు. కేంద్ర హోంశాఖ అధీనంలో ఢిల్లీ పోలీసు శాఖ పనిచేస్తోంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పోలీసు శాఖకు బాస్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతిభద్రతల వ్యవహారాలన్నీ లెఫ్ట్‌నెంట్ గవర్నరే చూస్తారు. ఢిల్లీ పోలీసు సిబ్బందిలో అన్ని రాష్ట్రాలకు చెందినవారూ ఉండేలా నియామకం జరుగుతోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లు నిర్ణీత కాలం మాత్రమే అయినందున నియామక సమస్య ఎదురుకాకపోవచ్చని వాదనగా ఉంది. హైదరాబాద్ ఫ్రీజోన్‌గా ఉన్న సమయంలో ఎంపికైన సిబ్బందిలో కొందరు ఇక్కడేపనిచేస్తూ ఉన్నారు. వారిని యథాతథంగా కొనసాగించడంతోపాటు అవసరానికి అనుగుణంగా సీమాంధ్ర జోన్‌లకు చెందిన వారిని కూడా కొందర్ని డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు తీసుకోవచ్చని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.