వారధిగా వ్యవహరిస్తా: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, తెలుగు రాష్ట్రాలకు మధ్య వారధిగా ఉంటానని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. ఇక్కడి ఏపీభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేశాను. నేడు మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం లభించడం జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తున్నా. సుపరిపాలన, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా చేపట్టిన ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామి కావడం సంతోషం. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలు రెండు రాష్ట్రాలకు అమలయ్యేలా చూస్తా..’’ అని దత్తాత్రేయ చెప్పారు.
తెలంగాణలో పార్టీని పటిష్టం చేస్తా..
అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని, తెలంగాణలో గ్రామగ్రామాన తిరిగి బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా నిర్మించేందుకు కృషి చేస్తానని దత్తాత్రేయ వెల్లడించారు. ‘‘తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను, సీఎంలను సంప్రదించి వారికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా. తెలంగాణ అభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తా. ఏపీ అభివృద్ధిపైనా దృష్టి సారిస్తాను’’ అని చెప్పారు.
‘కేబినెట్’ హోదాపై ఏమీ చెప్పలేను..
గతంలో స్వతంత్ర హోదాలో పనిచేసిన మీకు ఈ సారైనా కేబినెట్ ర్యాంకు ఎందుకివ్వలేదని దత్తాత్రేయను ప్రశ్నించగా.. ‘‘ఇదంతా సమష్టి బాధ్యత. ప్రధానికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో నెరవేర్చాలి గానీ డిమాండ్లు చేయరాదు.. ఇంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రానికి కేబినెట్ ర్యాంకు దక్కకపోవడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా.. ‘‘అదంతా మా పార్టీ చూసుకుంటుంది. నావంతు బాధ్యత నేను తప్పకుండా నిర్వర్తిస్తా..’’ అని దత్తాత్రేయ పేర్కొన్నారు.
బండారు దత్తాత్రేయ నేపథ్యం..
పుట్టిన తేదీ: జూన్ 12 1947
చదువు: బీఎస్సీ
రాజకీయ ప్రస్థానం...
1965లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిక
1980లో బీజేపీలో చేరిక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం
1997-98, 2006లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ తమిళనాడు ఇన్‌చార్జిగా బాధ్యతలు
2010లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియామకం. కేరళ ఇన్‌చార్జిగా బాధ్యతలు
ముఖ్య పదవులు..
1991-1996 మధ్య సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.
1998లో మరోసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి.. 1998-1999 మధ్య వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.
1999 సికింద్రాబాద్ ఎంపీగా మూడోసారి విజయం.. 1999-2001 మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు
2001-2003 రైల్వే శాఖ సహాయ మంత్రి, 2003-04 పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)
2014లో సికింద్రాబాద్ ఎంపీగా మరోసారి విజయం.. తాజాగా కేంద్ర మంత్రి పదవి
దత్తన్నకు త్వరలో సన్మానం
కేంద్రమంత్రి కావడం సంతోషం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేత బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కడం సంతోషించదగ్గ పరిణామమని, త్వరలోనే ఆయనకు ప్రభుత్వం పక్షాన పౌరసన్మానం నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దత్తాత్రేయ వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సమస్యలను పరిష్కరించడంలో కేంద్రమంత్రిగా దత్తాత్రేయ సేవలు ఉపయోగపడతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.