ముంపు గ్రామాలన్నీ సీమాంధ్రకే: జైరాం
న్యూఢిల్లీ: పోలవరం ముంపు గ్రామాలన్నిటినీ సీమాంధ్రకు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో పాల్వంచ రెవిన్యూ డివిజన్‌లో 7 మండలాలు సీమాంధ్రలో కలపాలని తేల్చింది. భద్రాచలం పట్టణం మినహా ఈ మండలంలోని మిగతా గ్రామాలు సీమాంధ్రలో చేర్చాలని నిర్ణయించింది. 12 గ్రామాలు మినహా బూర్గుంపాడు మండలం సీమాంధ్రకు చెందుతుంది. బూర్గుంపాడులోని పినపాక, మోరంపల్లి బంజర్, బూర్గుంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెంద్రి, మోతేపట్టినగర్, ఉప్పుశాఖ, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు తెలంగాణలో కొనసాగుతాయి. రెండు గంటలపాటు సాగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు.
2 రాష్ట్రాల విద్యుత్ పంపిణీపైనా కేంద్ర కేబినెట్ స్పష్టత ఇచ్చింది. 5 ఏళ్లలో రెండు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం ఆధారంగా 15 శాతం కరెంటు కేటాయింపు జరపాలని నిర్ణయించినట్టు జైరాం రమేష్ తెలిపారు. మిగతా 85శాతం కరెంట్ గాడ్జిల్ ఫార్ములా ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రాతిపదికగానే 2014 ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని బిల్లు స్పష్టంగా చెప్పిందని చెప్పారు.