చండీగఢ్: హర్యానాలోని సోన్‌పేట జిల్లాలో ఫిబ్రవరి నెలలో జాట్ల రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా విచ్చల విడిగా కొనసాగిన లూటీలు, దహనకాండ, హింస, అత్యాచారాలకు పౌర, పోలీసు అధికారులే ప్రధాన బాధ్యులని ఈ దారుణాలపై విచారణకు నియమించిన ప్రకాష్ కమిటీ నిగ్గు తేల్చింది. అల్లరి మూకలు రోడ్లపై స్వైర విహారం చేయడానికి, దాబాలను, దుకాణాలను దోచుకోవడానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడానికి స్వచ్ఛందంగా పోలీసులు అనుమతించారని ప్రకాష్ కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదికను హర్యానా ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.
ముఖ్యంగా సోన్‌పేట జిల్లాలోని ముర్తాలో ఎక్కువ విధ్వంసం చెలరేగడానికి అక్కడి డీఎస్పీ సతీష్ కుమార్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ధన్‌కర్ బాధ్యులని నివేదిక పేర్కొంది. అల్లరి మూకలను అదుపు చేయడానికి, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకాష్ కమిటీ ఆరోపించింది. బాధ్యులను శాఖాపరంగా, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సిఫార్సు చేసింది.
ఫిబ్రవరి 21, 22 తేదీల మధ్య రాత్రి సుఖ్‌దేవ్ దాబా సమీపంలో అల్లరి మూకలు విచ్చలవిడిగా లూటీలు, దహనాలకు పాల్పడ్డారని కమిటీ తెలిపింది. దాడులకు గురైన బాధితులు ఇరుగు పొరుగు ఇళ్లలో తలదాచుకున్నారని పేర్కొంది. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చి లూటీలకు పాల్పడిన యువకులు దాదాపు 50 వాహనాలను దగ్ఢం చేశారని వెల్లడించింది. అదే రాత్రి పలువురు మహిళలపై సామూహిక అత్యాచారాలు కూడా జరిగినట్లు పోలీసు కేసులు నమోదయ్యాయి. అల్లర్లను అదుపు చేసేందుకు పౌర అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోలేదని, వారు కూడా ప్రేక్షక పాత్ర వహించారని ప్రకాష్ కమిటీ ఆరోపించింది. ఈ నివేదికపై ఇంకా ప్రభుత్వ స్పందనలు వెలువడాల్సి ఉంది.
పోలీసుల కనుసన్నలలోనే లూటీలు, దహనాలు
Published Wed, Jun 1 2016 6:43 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement