haryana govt
-
సైకిల్ రిక్షా తొక్కుతూ అసెంబ్లీకి సీఎం
చండీగఢ్: అసెంబ్లీలో జైన దిగంబర సన్యాసితో ప్రవచన కార్యక్రమం నిర్వహించిన హరియాణా ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగం చేసింది. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, మంత్రులు,అధికార బీజేపీ శాసనసభ సభ్యులు వర్షాకాల సమావేశాల చివరి రోజైన బుధవారం సభకు సైకిళ్లు, రిక్షాలపై వచ్చారు. కార్లు, ఇతర వాహనాలను ఒకరోజు పక్కనపెట్టిన శాసనకర్తలు సాధారణ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారు. కుర్తా, పైజామా ధరించిన ఖట్టర్ సెక్టర్-3లోని అధికార నివాసం నుంచి కిలోమీటర్ దూరంలోని అసెంబ్లీ సముదాయానికి సైకిలుపై వచ్చారు. ఇది పర్యావరణానికి మంచిదని, ప్రజలంతా కనీసం ఒక్క రోజైనా సైకిలు తొక్కాలని అన్నారు. చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శి శ్యాంసింగ్... సీపీఎస్ సీమా త్రిఖా, సీఎం సలహాదారు జగదీశ్ చోప్రాను ఎక్కించుకొని సైకిలు రిక్షా తొక్కుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొందరు శాసనసభ్యులు ఈ-రిక్షాల్లో వచ్చారు. ఒకరోజు ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అడిగినపుడు ఇది స్ఫూర్తిమంత అడుగు. రాష్ట్ర సీఎం, రాజకీయ నాయకులే చేసినపుడు తమ వల్ల కాదా? అని సాధారణ ప్రజలు భావిస్తారు’ అని వ్యవసాయ మంత్రి ఓపీ ధన్కర్ చెప్పారు. -
సీఎం ఆస్తుల వివరాలు వెల్లడించలేం
చండీగఢ్: సమాచార హక్కు చట్టం కింద ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తుల వివరాలు ఇచ్చేందుకు హర్యానా ప్రభుత్వం నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారం కిందకు వస్తుందని పేర్కొంది. గతంలో భూపేందర్ హుడా ప్రభుత్వం ఈ వివరాలు ఇచ్చినా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. సీఎం, మంత్రుల ఆస్తుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు కార్యకర్త పీపీ కపూర్ మార్చిలో సమాచార కమిషన్ ను కోరారు. దీంతో సంబంధిత అధికారులకు సమాచార కమిషన్ నోటీసు జారీ చేసింది. అయితే సమాచారం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ఆన్లైన్ పెట్టినప్పటికీ హర్యానా సర్కారు మాత్రం తమ మంత్రుల వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడకపోవడం విశేషం. మంత్రులు ప్రజా ప్రతినిధులని, వారి ఆస్తుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించాల్సిందేనని కపూర్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్రజా ప్రతినిధుల ఆస్తుల వివరాలు వెల్లడించడం లేదని అధికారులు చెప్పడం సమంజసం కాదన్నారు. -
పోలీసుల కనుసన్నలలోనే లూటీలు, దహనాలు
చండీగఢ్: హర్యానాలోని సోన్‌పేట జిల్లాలో ఫిబ్రవరి నెలలో జాట్ల రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా విచ్చల విడిగా కొనసాగిన లూటీలు, దహనకాండ, హింస, అత్యాచారాలకు పౌర, పోలీసు అధికారులే ప్రధాన బాధ్యులని ఈ దారుణాలపై విచారణకు నియమించిన ప్రకాష్ కమిటీ నిగ్గు తేల్చింది. అల్లరి మూకలు రోడ్లపై స్వైర విహారం చేయడానికి, దాబాలను, దుకాణాలను దోచుకోవడానికి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడానికి స్వచ్ఛందంగా పోలీసులు అనుమతించారని ప్రకాష్ కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదికను హర్యానా ప్రభుత్వం మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ముఖ్యంగా సోన్‌పేట జిల్లాలోని ముర్తాలో ఎక్కువ విధ్వంసం చెలరేగడానికి అక్కడి డీఎస్పీ సతీష్ కుమార్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ధన్కర్ బాధ్యులని నివేదిక పేర్కొంది. అల్లరి మూకలను అదుపు చేయడానికి, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు వీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకాష్ కమిటీ ఆరోపించింది. బాధ్యులను శాఖాపరంగా, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 21, 22 తేదీల మధ్య రాత్రి సుఖ్‌దేవ్ దాబా సమీపంలో అల్లరి మూకలు విచ్చలవిడిగా లూటీలు, దహనాలకు పాల్పడ్డారని కమిటీ తెలిపింది. దాడులకు గురైన బాధితులు ఇరుగు పొరుగు ఇళ్లలో తలదాచుకున్నారని పేర్కొంది. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చి లూటీలకు పాల్పడిన యువకులు దాదాపు 50 వాహనాలను దగ్ఢం చేశారని వెల్లడించింది. అదే రాత్రి పలువురు మహిళలపై సామూహిక అత్యాచారాలు కూడా జరిగినట్లు పోలీసు కేసులు నమోదయ్యాయి. అల్లర్లను అదుపు చేసేందుకు పౌర అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోలేదని, వారు కూడా ప్రేక్షక పాత్ర వహించారని ప్రకాష్ కమిటీ ఆరోపించింది. ఈ నివేదికపై ఇంకా ప్రభుత్వ స్పందనలు వెలువడాల్సి ఉంది. -
రాందేవ్‌బాబాకు క్యాబినెట్ మంత్రి హోదా
వివాదాస్పద యోగా గురు రాందేవ్ బాబాకు హర్యానా ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి హోదాను కల్పించింది. ఇప్పటికే హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగున్న ఆయనకు మంత్రి హోదా కల్పిస్తున్న విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాందేవ్ పర్యవేక్షణలో యోగా, ఆయుర్వేద విద్యను అభివృద్ధి చేయనున్నట్లు, ఈ మేరకు పాఠ్యాంశాల్లో యోగా పాఠాలను చేర్చడంతోపాటు స్కూళ్లు, గ్రామాల్లో యోగశాలలు నిర్మించనున్నట్లు విజ్ పేర్కొన్నారు. మరోవైపు మత సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
హరియానా ఏఏజీగా ఉదయ్‌కుమార్ సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్‌కుమార్‌సాగర్‌ను హరియానా ప్రభుత్వం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ ఆన్ రికార్డుగా సుప్రీం కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయ్‌కుమార్ సాగర్, హరియానా ప్రభుత్వానికి సైతం సేవలు అందించనున్నారు. గత 25 ఏళ్లుగా సాగర్ హస్తినలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణలోని మెదక్‌జిల్లా వాసి అయిన ఉదయ్‌కుమార్ సాగర్ హరియానా ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం.