సైకిల్ రిక్షా తొక్కుతూ అసెంబ్లీకి సీఎం
చండీగఢ్: అసెంబ్లీలో జైన దిగంబర సన్యాసితో ప్రవచన కార్యక్రమం నిర్వహించిన హరియాణా ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగం చేసింది. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, మంత్రులు,అధికార బీజేపీ శాసనసభ సభ్యులు వర్షాకాల సమావేశాల చివరి రోజైన బుధవారం సభకు సైకిళ్లు, రిక్షాలపై వచ్చారు. కార్లు, ఇతర వాహనాలను ఒకరోజు పక్కనపెట్టిన శాసనకర్తలు సాధారణ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచారు. కుర్తా, పైజామా ధరించిన ఖట్టర్ సెక్టర్-3లోని అధికార నివాసం నుంచి కిలోమీటర్ దూరంలోని అసెంబ్లీ సముదాయానికి సైకిలుపై వచ్చారు.
ఇది పర్యావరణానికి మంచిదని, ప్రజలంతా కనీసం ఒక్క రోజైనా సైకిలు తొక్కాలని అన్నారు. చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శి శ్యాంసింగ్... సీపీఎస్ సీమా త్రిఖా, సీఎం సలహాదారు జగదీశ్ చోప్రాను ఎక్కించుకొని సైకిలు రిక్షా తొక్కుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొందరు శాసనసభ్యులు ఈ-రిక్షాల్లో వచ్చారు. ఒకరోజు ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని అడిగినపుడు ఇది స్ఫూర్తిమంత అడుగు. రాష్ట్ర సీఎం, రాజకీయ నాయకులే చేసినపుడు తమ వల్ల కాదా? అని సాధారణ ప్రజలు భావిస్తారు’ అని వ్యవసాయ మంత్రి ఓపీ ధన్‌కర్ చెప్పారు.