నగర రక్షణకు ప్రణాళిక | Police system to be fixed for control of six police sub control centers | Sakshi
Sakshi News home page

నగర రక్షణకు ప్రణాళిక

Published Tue, Nov 26 2013 6:06 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

Police system to be fixed for control of six police sub control centers

=    ఆరు ప్రధాన సెంటర్లలో పోలీసు సబ్‌కంట్రోల్స్
 =    ఆర్టీసీ బస్టాండ్‌లో నాలుగు సీసీ కెమెరాల ఏర్పాటు
 =    సీసీఎస్, ట్రాఫిక్ విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ
 =    జిల్లాలో ఎస్సైల  బదిలీలకూ రంగం సిద్ధం

 
 సాక్షి, ఒంగోలు: రానున్నది ఎన్నికల సీజన్.. శాంతిభద్రల పర్యవేక్షణలో ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగిస్తోంది. దీనిలో భాగంగా ముందుగా పోలీసు అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఎస్పీ కసరత్తు పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో జిల్లా స్థాయిలో రెండేళ్ల కాలపరిమితి పూర్తై అధికారులను, పూర్తి కాకపోయినా.. పనితీరులో వెనుకబడి ఉన్న వారిని బదిలీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఒంగోలు నగరంలో శాంతిభద్రతలు, నేర పరిశోధన, ట్రాఫిక్, రక్షక్, బ్లూకోల్ట్స్ తదితర అన్ని విభాగాల్లో సమూల మార్పులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.   
 
 రెస్ట్‌హౌస్‌లా ‘రక్షక్’
 నగరంలో ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో మరొక రక్షక్ వాహన సిబ్బంది విధి నిర్వహణలో మందకొడిగా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. నిత్యం గస్తీ తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, నేరం జరిగిన చోటుకు తక్షణమే వెళ్లడం, రెస్క్యూ చేయడం, ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలు చేపడుతూ ప్రజల రక్షణ బాధ్యత చూడాల్సిన వీరు రక్షక్ అంటే ఒక రెస్ట్‌హౌస్‌లా భావిస్తున్నారు. చేయాల్సిన పనులను వదిలి కోర్టు విధులకు, నిందితులను కోర్టుకు, రిమాండ్‌కు తరలించడం వంటి పనులకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో కేవలం రెండు మూడుసార్లు మాత్రమే తిరుగుతున్నట్లు తెలిసింది.
 
 బ్లూ కోల్ట్స్‌లోనూ మార్పు..
 పోలీస్‌స్టేషన్ పరిధిలో మోటార్‌బైక్‌లపై తిరుగుతూ నిత్యం అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన బ్లూకోల్ట్స్ పరిస్థితీ అదేవిధంగా తయారైంది. ఇకపై చురుగ్గా వ్యవహరించే యువకులైన పోలీసు సిబ్బందిని ఈ బ్లూకోల్ట్స్ విభాగంలో నియమించనున్నారు.
 
 నగరంలో ఆరు పోలీసు సబ్ కంట్రోల్స్ ఏర్పాటు
 ఒంగోలు నగరంలో రద్దీ అధికంగా ఉండే ఆరు ప్రాంతాల ను గుర్తించి అక్కడ పోలీసు సబ్ కంట్రోల్‌లను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నిత్యం ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటూ ఆయా ప్రాంతాల్లో పోలీసు పరంగా చేపట్టాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఏదైనా నేరం జరిగినట్లు సమాచారం అందితే వెంటనే ఈ ఆరు సెంటర్లను దిగ్బంధిస్తే నేరస్తుడు ఎటూ తప్పించుకు పోయే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్‌లో కొత్తగా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకులు, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో పోలీసు నిఘాను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై శిక్షణ పూర్తిచేసుకున్న 300 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ 12 బృందాలుగా ఏర్పాటు చేశారు. వారికి ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉండేలా అన్ని విధాలుగా సిద్ధం చేశారు. నగర డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరు పోలీసు సబ్ కంట్రోల్స్, రెండు రక్షక్‌లు పనిచేస్తాయి.
 
 భారీగా ఎస్సైల బదిలీలు
 జిల్లావ్యాప్తంగా పలు స్టేషన్లకు సంబంధించి మరో వారం రోజుల్లో ఎస్సైల బదిలీలు జరగనున్నాయి. వీరిలో పలువురికి రెండేళ్లు పూర్తై సందర్భంగా స్థాన చలనం కలగనుండగా.. అనేక మందిని పనితీరు, సమర్ధత కొలమానంగా బదిలీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. ఇక ప్రతి స్టేషన్‌లోనూ తప్పనిసరిగా ఒక సమర్ధుడైన యువ ఎస్సైను నియమించనున్నారు. ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రస్తుతం నలుగురు ఎస్సైలుండగా వారిలో ముగ్గురికి స్థాన చలనం తప్పేలా లేదు. టూ టౌన్‌లో ఉన్న ఇద్దరిలో ఒకరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బదిలీ వేటు తప్పనిసరి. తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ముగ్గురు ఎస్సైలలో ఇద్దరు యథాస్థానంలో కొనసాగనుండగా మరొకరికి బదిలీ జరగనున్నట్లు సమాచారం. ఇక సీసీఎస్ విభాగంలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయనున్నారు. సీఐల విషయంలో కూడా ప్రస్తుతం ముగ్గురు ఉండగా వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి నేర పరిశోధనలో సమూల మార్పులు తేనున్నారు.

 సీసీఎస్‌లో పనిచేసే ఒక సీఐ నాయకత్వంలో ఇకపై కొద్దిమంది యువకులైన పోలీసు సిబ్బంది పగటి పూట మఫ్టీలో మోటార్ సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించనున్నారు. నగర ట్రాఫిక్‌లో ప్రస్తుతం కేవలం ఇద్దరు ఎస్సైలు మాత్రమే ఉండగా మరో ఇద్దరు లేక ముగ్గురు ఎస్సైలను ట్రాఫిక్‌కు అటాచ్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. నాగులుప్పలపాడు, సింగరాయకొండలకు కొత్తగా ఎస్సైలు రానున్నారు. సంతనూతలపాడులో ఎస్సైగా ఉన్న ఆరోగ్యరాజుకు ఇప్పటికే రెండేళ్లు పూర్తి కావడంతో ఆయన్ను బదిలీ చేయనున్నారు. ఆయనను అద్దంకి పోలీస్‌స్టేషన్‌కు, కొండపి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న సోమశేఖర్‌ను దర్శికి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జరుగుమల్లి స్టేషన్ ఎస్సై వచ్చే నెలాఖరున పదవీ విరమణ చేయనుండడంతో జనవరి మొదటి వారంలో ఆ స్టేషన్‌కు కొత్త ఎస్సైను నియమించనున్నారు. మద్దిపాడు ఎస్సై పదోన్నతి జాబితాలో ఉండడంతో ఆ స్థానం ఖాళీ అయిన తరువాత కొత్తగా ఎస్సైను నియమించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement