సమైక్య సభకు పటిష్ట బందోబస్తు: అనురాగ్ శర్మ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించనున్న బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సిటీ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. అదనపు పోలీసు కమిషనర్(శాంతిభద్రతలు) అంజనీకుమార్, సంయుక్త పోలీసు కమిషనర్ (స్పెషల్‌బ్రాంచ్) బి.మల్లారెడ్డిలతో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. భద్రత ఏర్పాట్ల కోసం నగర పోలీసు సిబ్బందితో పాటు 34 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 16 కంపెనీల కేంద్రసాయుధ బలగాలు, 1800 మంది సివిల్ పోలీసుల్ని మోహరిస్తున్నామని అనురాగ్ శర్మ వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక రూట్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘ఈ సభను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చాం.
ఏపీఎన్జీవోల సభ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నాం. ఏపీఎన్జీవోల సభకు హాజరయ్యేవారు గుర్తింపుకార్డుల్ని కచ్చితంగా చూపాల్సి ఉండటంతో స్టేడియం లోపలికి కేవలం రెండు గేట్ల ద్వారానే అనుమతించాం. అయితే వైఎస్సార్సీపీది పబ్లిక్ మీటింగ్ కావడంతో దాదాపు అన్ని గేట్లనూ తెరిచి అనుమతిస్తాం. సభకు లక్షల్లో జనం వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేపడుతున్నాం. ఓయూజాక్ సహా మరే ఇతర సంఘాలు సభను అడ్డుకునే విషయంపై మావద్ద ప్రత్యేకంగా ఏ సమాచారం లేదు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిన్న చిన్న ఘటనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం’ అన్నారు.