జగన్ వెంటే నడుద్దాం
జగన్ వెంటే నడుద్దాం
Published Mon, Feb 10 2014 4:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా పెద్ద దిక్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డేనని, ఆయన వెనుకనే నడుద్దామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీను వీడి వైఎస్సార్‌సీపీలోకి రావాల్సిన పరిస్థితులను వివరించారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరించిన తీరు దారుణమని, రాష్ట్రాన్ని స్వార్థం కోసం ముక్కలు చేయడాన్ని సహించలేకపోయూనని వాపోయూరు. ఈ మేరకు నిర్వహించిన సమాలోచన సభలో వైఎస్సార్ సీపీలో చేరాలంటూ నాయకులు, కార్యకర్తలు కోరారని గుర్తు చేశారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమైక్య రాష్ట్ర సాధన కోసం పోరాడుతూ, ఉద్యమిస్తున్న ఏకై క నాయకుడిగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు. 2010 సంవత్సరంలో పార్లమెంట్‌లోనే తన వైఖరిని స్పష్టం చేసిన నిజమైన నాయకుడు జగన్ అని కొనియాడారు. దీంతో సభాప్రాంగణమంతా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసలు ప్రతిపక్ష నేత పాత్ర పోషించడంలో విఫలమయ్యారని విమర్శించారు. సమైక్యమా...కాదా..అనే విషయాన్ని ప్రజలతో పాటు టీడీపీ నాయకులకు కూడా స్పష్టంగా చెప్పలేక వ్యాపారస్థుడిలా ఆలోచిస్తూ ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం అతనికి చెందిన ఓ రెండు ప్రచారసాధనాల సాయంతో ఎంత నీచానికైనా దిగజారే స్థితి చంద్రబాబుది అని దుయ్యబట్టారు.
ఆకలికి, కన్నీరుకు రాజకీయాలతో ముడిపెట్టే సంసృ్కతి చంద్రబాబుది అని, సామాన్యుల ఆకలిని తీర్చి, కన్నీరు తుడిచే పథకాలు పెట్టి ఆదుకున్న పాలన వైఎస్సార్‌ది అని వివరించారు. 2001-03 మధ్య కాలంలో తీవ్ర కరువొస్తే, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏఒక్క రైతుకైనా ఒక్క రూపాయి సాయంచేశారా అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్సార్ ఆధ్వర్యంలో పార్టీల కతీతం గా సంక్షేమ ఫలాలిచ్చిన సంగతి అందరి మనస్సులోనూ ఉందని గుర్తు చేశారు. అదే చంద్ర బాబుకాలంలో పచ్చ చొక్కాల వారికే పథకాలు అందజేశారని విమర్శించారు. తను ఏవో కోరికలతో పార్టీ మారలేదని, ఇక ప్రతి ప్రయోజనం పార్టీ పటిష్టత కోసమేనని తెలిపారు. జిల్లాలో రైతాంగం కోసం వంశధార వంటి సమస్యల సాధన కోసం రానున్న ఎన్నికల్లో జిల్లాలో 10 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను తప్పనిసరిగా గెలిపించుకునేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో ఇంతవరకు వైఎస్సార్‌సీపీని నడిపిన శ్రేణుల కృషిని ధర్మాన అభినందించారు.
విశాఖ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే తైలాన విజయ్‌కుమార్ మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి మృతితో రాష్ట్రంలో దీపం ఆరిపోయిందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో సమైక్య రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, దీనికి కారణమైన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఉద్యమంలో పాల్గొనడం ఇష్టంలేక పార్టీను వీడినట్టు తెలియజేశారు. తను మాత్రం కేవలం పార్టీ కార్యకర్తలాగానే పార్టీలో చేరానని, జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌లో ఎవరూ ఉండొద్దని పిలుపునిచ్చారు. పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మత్స్యకారుడిని ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత మహానేత రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు. మళ్లీ రాజన్న రాజ్యం కోసం, సమైక్య రాష్ట్ర సాధన కోసం జగనన్న సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరానని వివరించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం ప్రజలందరి తరఫున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా వైఎస్సార్‌సీపీలో విలీనం చేసి, తన పార్టీలో చేరానని తెలిపారు. ఇదే జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో కలిసి చివరి అధికారిక పర్యటన చేసినట్టు గుర్తుతెచ్చారు. ఆ పర్యటనలో తమ వెంటే ఉన్న దొంగల్లుడు చంద్రబాబు, కొద్ది నెలల తర్వాతే మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కాజేశాడని, ఆ పదవి కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేశాడని చెమర్చిన కళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌కు చెప్పులు వేయించి మానసికంగా చంపేసిన చంద్రబాబు నయవంచకుడని దుయ్యబట్టారు. తండ్రిని అవమానపర్చిన బావకు వత్తాసు పలికిన ఎన్టీఆర్ కుమారుల కంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తున్న కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డే ఎంతో గొప్పవాడని కొనియాడారు. ఇదే సందర్భంలో చంద్రబాబు అబద్దాలపై వ్యంగ కథను చెబుతూ... ఓరాక్షసుడికి దేవుడి వరం ఇచ్చేందుకు మూడు ప్రశ్నలు వేశాడని, మొదటి ప్రశ్నగా భూమిమీద చెట్లు ఎన్ని...? అన్నదానికి మూడు రోజుల్లో సమాధానం చేప్పేశాడని, ఆకాశంలో చుక్కలెన్ని..? సముద్రంలో ఇసుక రేణువుల సంఖ్య ఎంత..? అనే ప్రశ్నలకు తక్కువ రోజుల్లోనే సమాధానాలిచ్చిన రాక్షసుడికి ఇక ఆఖరిగా చంద్రబాబు ఇంత వరకు ఎన్ని అబద్దాలు ఆడారో చెప్పాలని దేవుడు ప్రశ్నించగా, ఆ రాక్షసుడు ఇంకా లెక్కపెడుతూనే ఉన్నాడని, దీంతో దేవుడు ఏ వరం ఇవ్వకుండా వెళ్లిపోయాడని చెప్పడంతో సభికులంతా నవ్వుకున్నారు.
Advertisement
Advertisement