
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోకుండా ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆయన శనివారం మంగళగిరిలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా వేడుకలు ప్రశాంతంగా, అత్యంత వైభవోపేతంగా జరిగాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన అంత పెద్ద వేడుకల్లో చిన్నపాటి ఘటన కూడా జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అందుకోసం ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామన్నారు.
సైబర్ సెక్యూరిటీపై పోలీసులకు శిక్షణ
రాష్ట్రంలోని మొత్తం పోలీస్ బృందం బాగా పని చేస్తోందని డీజీపీ కితాబిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లపై దృష్టి పెట్టామని చెప్పారు. దాదాపు రూ.42 కోట్లతో గతంలో కొనుగోలు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలు సరైన నిపుణులు లేని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సైబర్ క్రైమ్ విషయంలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లకు సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్‌లపై ఇటీవల ఫిర్యాదులు పెరిగాయని, వాటికి కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు గౌతమ్ సవాంగ్ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డీఎస్పీల పాసింగ్‌ఔట్ పెరేడ్‌కు సీఎం రాక
శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది డీఎస్పీల పాసింగ్‌ఔట్ పెరేడ్ నిర్వహిస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 8 గంటలకు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో డీఎస్పీల పాసింగ్‌ఔట్ పెరేడ్ నిర్వహిస్తుండడం విశేషమని చెప్పారు. 25 మంది కొత్త డీఎస్పీల్లో 11 మంది మహిళలు ఉండటం మరో విశేషమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment