ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్‌స్టేషన్
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన 94 పోలీస్‌స్టేషన్లకు పక్కా భవనాలు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నూతన జిల్లాల్లో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పునాది రాళ్లు వేస్తుండడంతో నూతన పోలీస్‌స్టేషన్ల నిర్మాణ అంశంపై పోలీస్ శాఖలో చర్చ సాగుతోంది. కొత్త పోలీస్‌స్టేషన్లలో కొన్ని ప్రైవేట్‌భవనాల్లో, మరికొన్ని ప్రభుత్వ పురాతన భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాత పాఠశాలల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అసలే వర్షాకాలం.. ఆపై పాతబడ్డ భవనాలు... ఎప్పుడు కూలుతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
నిధుల లేమితో సందిగ్ధం
నూతనంగా ఏర్పడిన ఏ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి కూడా ఈ ఏడాది బడ్జెట్ కేటాయించలేదు. గత ఆర్థిక సంవత్సరం కేటాయించిన ఆధునీకరణ నిధులు, కేంద్రం నుంచి వచ్చే ఎంఓపీఎఫ్(మాడ్రనైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పథకం నిధులతో ఠాణాల ఆధునీకరణ, నూతన భవనాల నిర్మాణం చేపట్టింది. అయితే, కొత్త పోలీస్‌స్టేషన్ల నిర్మాణానికి కనీసం రూ.2 కోట్ల చొప్పున ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు 94 పోలీస్‌స్టేషన్ల నిర్మాణానికి కనీసం రూ.200 కోట్లు కావాల్సి ఉంది.
ఠాణాలు, క్వార్టర్ల నిర్మాణాలకు మొత్తంగా రూ.500 కోట్లకు పైగా అవసరమని అంచనా. ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదనలు పంపే ఆలోచనలో ఉన్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మరో ఐదు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది మొత్తం నిధులు కేటాయిస్తారా? లేదా అన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment