
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖలో కొనసాగుతున్న ఆర్డర్ టు సర్వ్, సాధారణ బదిలీలపై ఉత్కంఠకు తెరపడింది. కానిస్టేబుళ్లు ఎదుర్కొంటున్న బదిలీల సమస్యలపై చర్చించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అధికారుల సంఘంతో భేటీ అయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలను అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి మీడియాకు వివరించారు.
బదిలీలకు ఇవీ మార్గదర్శకాలు..
సిబ్బందిని ఉమ్మడి జిల్లాల పరిధిలోనే బదిలీ చేస్తారు. ఆర్డర్ టు సర్వ్‌లో బదిలీ అయిన వాళ్ల (ఆర్మ్‌డ్/సివిల్) విజ్ఞప్తిని పరిశీలించి అడిగిన చోటికి, అడిగిన జిల్లా పరిధికి బదిలీ చేస్తారు. ఆర్డర్ టు సర్వ్ వారి స్థానంలోకి వెళ్లేందుకు ఎవరైనా సుముఖంగా లేకుంటే లాటరీ పద్ధతి అవలంబిస్తారు. వచ్చే ఏడాదిలోనూ స్థానికత ప్రకారం బదిలీల ఉత్తర్వులు రానట్లైతే మళ్లీ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే సాధారణ బదిలీలు చేపడతారు. కొత్త జిల్లాల పరిధిలోని వారు పూర్వ జిల్లాల్లో ఉన్నట్లుగానే భావించాలి. ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తియిన వారికి ఐదు ఆషన్లు (పాత జిల్లాల పరిధిలో) ఇచ్చి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేస్తారు. మారుమూల, నక్సల్స్ ప్రభావిత, రవాణా సౌకర్యాలు లేని స్టేషన్ల వారికి మూడేళ్లకే బదిలీలకు అవకాశం కల్పిస్తారు. వరంగల్ జిల్లాలో 2013 జూన్ 21న బదిలీ అయినవారి విజ్ఞప్తి ప్రకారం బదిలీలకు అవకాశం ఉంటుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి కొత్త జిల్లాల పరిధిలోనే బదిలీలు చేశారు. అలా బదిలీ అయిన వారి సర్వీసును ఉమ్మడి జిల్లాల్లో బదిలీ అయిన తేదీ నుంచి పరిగణించి ఇప్పుడు బదిలీకి అవకాశం ఇవ్వాలి. స్పౌజ్, మెడికల్ గ్రౌండ్, పదవీ విరమణకు రెండేళ్ల ముందు వారికి బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. వేరే జిల్లా పరిధిలోకి వెళ్లిన స్టేషన్ల సిబ్బందికి కూడా పాత జిల్లా పరిధిలోనే బదిలీలు అవుతాయి. ఈ నిబంధనలతో శనివారమే సర్క్యులర్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు గోపిరెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్లు ఎదుర్కొనే ఇతర సమస్యలపై యూనిట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని, బదిలీల అమల్లో తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించడానికి డీజీపీ సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీపీ జితేందర్, ఆర్గనైజేషన్స్ అదనపు డీజీపీ రాజీవ్ రతన్, పర్సనల్ విభాగం ఐజీ శివధర్‌రెడ్డి, కరీంనగర్ డీఐజీ ప్రమోద్ కుమార్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కమిషనర్లు, మహబూబ్‌నగర్, వనపర్తి, సంగారెడ్డి ఎస్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment