పటాన్‌చెరు : రామచంద్రాపురం కొల్లురూ శివారులో బిర్లా స్కూల్ వెనక ప్రాంతంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మహిళల మృతి చెంది పడి ఉన్నారని వారంతా అమీన్‌పూర్‌కు చెందిన వారని సమాచారం రావడంతో అమీన్‌పూర్ ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇటీవల చాందిని జైన్ అనే అమ్మాయి అమీన్‌పూర్ 343 గుట్టలో శవంగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం దొరికిన మృతదేహాలు ఎవరివి అనేది మిస్టరీగా మారింది.
అదృష్టవశాత్తు మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే పోలీసులకు సమాచారం రావడంతో వారంతా అమీన్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. అశోక్‌నగర్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి తన భార్య మాధవి (26), కుమారుడు వర్షిత్ (2)తో పాటు వరుసకు పిన్ని లక్ష్మి (46), ఆమె కూతురు సింధూజ (16) ఓఆర్‌ఆర్ సమీపంలో విగత జీవులుగా పడి ఉండడం అమీన్‌పూర్‌లో చర్చనీయాంశమైంది. ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీకి అధ్యక్షుడిగా ఉన్న రవీందర్‌రెడ్డి భార్య, కుమార్తె ఆ సంఘటనలో చనిపోయారనే వార్త దావానలంలా వ్యాపించింది. ఎలా చనిపోయారనే దానిపై ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.
విష ప్రయోగమే కారణమా?
ప్రభాకర్‌రెడ్డి కుటుంబంతో పాటు లక్ష్మి, సింధూజల మృతికి విష ప్రయోగమే కారణమని బంధువులు భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి మృతి చెంది ఉన్న కారులో విషం కలిపిన నీటి బాటిళ్లు లభించాయని బందువులు చెప్పారు. ఆ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులందరికీ ఆ విషం ఎవరు తాగించారనేది తేలాల్సి ఉంది. మృతులంతా కలిసే ఆ మందు తాగారా లేక వారికి తెలియకుండా ఆ విషాన్ని తాగించారా? లేదంటే ప్రభాకర్‌రెడ్డే మిగతా వారెవరికీ తెలియకుండా తాగించారా? అన్నది తెలియరాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
షేర్ వ్యాపారంలో నష్టాలా?
ప్రభాకర్‌రెడ్డి కొన్ని రోజులుగా అశోక్‌నగర్‌లో ఉంటున్నారు. స్థానికంగా ఆయన ఓ స్టాక్ బ్రోకర్ కంపెనీలో ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ చేస్తుంటారని బంధువులు చెబుతున్నారు. మొత్తం రూ.పది కోట్ల వరకు అప్పులు చేశారని అనుమానిస్తున్నారు. రవీందర్‌రెడ్డి కుటుంబానికి ప్రభాకర్‌రెడ్డిపై ఎంతో విశ్వాసం ఉండేది. ఆర్థిక లావాదేవీల్లో ప్రభాకర్‌రెడ్డికి నష్టం రావడమే వీరందరి మృతికి కారణమైందా అనేది అంతటా చర్చనీయాంశమైంది.
చంపడం.. తెచ్చిపడేయడం..
అమీన్‌పూర్ మాత్రమే కాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఏదో మూల జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లో దుండగులు తెచ్చిపడేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓఆర్‌ఆర్‌పై ఓ మహిళ శవం కనిపించింది. అది ప్రమాదమా, హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది తెలియరాలేదు. సుల్తాన్‌పూర్ గుట్టల్లో ఓ యువకుడిని హత్య చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మహానగరంలోని కొందరు తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో మృత దేహాలను తెచ్చి పడేస్తున్నారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment