పోలీసు బదిలీ(ల)లు! | Police Transfers in Guntur | Sakshi
Sakshi News home page

పోలీసు బదిలీ(ల)లు!

Published Mon, Jul 2 2018 11:59 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Police Transfers in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: పోస్టింగ్‌ల కోసం పోలీసు అధికారుల పైరవీలు ఊపందుకున్నాయి. నచ్చిన పోస్టింగ్‌ ఇప్పించే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యనేతలతో సన్నిహితంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలతో బేరాలు సైతం కుదుర్చుకుంటున్నారు. పోస్టును బట్టి ధర నిర్ణయిస్తున్నారు. డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణతో పోలీసు శాఖలో బదిలీల హడావుడి ఊపందుకుంది. పోస్టింగ్‌ పడాలంటే ముఖ్యనేతల సిఫార్సు ఉండాలనేది బహిరంగ రహస్యమే. నీతి, నిజాయితీ, అవార్డులు, రివార్డులతో సంబంధం లేకుండా పోస్టింగ్‌లు కేటాయిస్తున్న పరిస్థితి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రాధాన్యత గల పోస్టింగ్‌లు .. నిజాయతీగా పని చేసే ఆరికి లూప్‌లైన్‌ పోస్టింగ్‌లు కేటాయిస్తున్నట్లు సమాచారం. 

రాజధాని ప్రాంతంలో..
రాజధాని ప్రకటన నుంచి గుంటూరు జిల్లాలో పోలీసుల పోస్టింగ్‌లకు ప్రాధాన్యత పెరిగిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత సంప్రదాయాన్ని తుంగలో తొక్కి సిఫార్సులు ఉన్నవారికే పోస్టింగ్‌లు దక్కేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తోంది. గతంలో సీఐల బదిలీలు చేపట్టాలంటే రేంజ్‌ పరిధిలోని ఎస్పీలతో సమావేశం నిర్వహించి పని తీరు ఆధారంగా పోస్టింగ్‌లు కేటాయించే వారు. ప్రస్తుతం రాత్రికి రాత్రే రెండు, మూడు పోస్టింగ్‌లు చొప్పున వేసేస్తూ ఎస్పీలు ఇచ్చిన నివేదికలు పక్కన పడేసి అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్నికలు ముందస్తుగా వస్తాయనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సారి జరిగే తమకు అనుకూలమైన వారికి ఇష్టమొచ్చిన ప్రాంతాల్లోకి బదిలీ చేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాము చెప్పినట్లు వినే అధికారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.

నిజాయతీకి దక్కని గౌరవం
పోలీసు అధికారుల్లో నిజాయతీగా పని చేసే అనేక మందికి నాలుగేళ్లుగా ఒక్క లా అండ్‌ ఆర్డర్‌ పోస్టింగ్‌ కూడా దక్కని పరిస్థితి ఉండగా, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే పోలీసు అధికారులకు మాత్రం వరుస పోస్టింగ్‌లు ఇస్తూ ప్రాధాన్యత గల స్టేషన్లు అప్పగించారు.

ముఖ్యంగా గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పలనాయుడు బదిలీ అవుతారంటూ అధికార పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఎస్పీ బదిలీతో రూరల్‌ జిల్లా పరిధిలో పలువురు సీఐలను సైతం మార్చేందుకు అధికార పార్టీ నేతలు ఉన్నతాధికారులకు జాబితా పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంతత నెలకొనాలంటే సిఫార్సులను పక్కన బెట్టి సమర్థత గల పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

పోస్టును బట్టి ధర
పోలీసు స్టేషన్‌లను ప్రాధాన్యతను బట్టి ఏ,బీ,సీ గ్రేడ్‌లుగా విభజించినట్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ఉండే ద్వితీయ శ్రేణి నేతలు సైతం పోస్టింగ్‌ను బట్టి ధర నిర్ణయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేతలతో సరైన సంబంధాలులేని పోలీసు అధికారులు ద్వితీయ శ్రేణి నేతలకు ముడుపులు ఇచ్చి అయినా పోస్టింగ్‌ దక్కించుకోవాలని బేరసారాలు కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement