జిల్లా పోలీస్ కార్యాలయం
గుంటూరు: అర్బన్, రూరల్ జిల్లాల పోలీస్ సిబ్బందికి త్వరలో తీపి కబురు అందనుంది. ఎనిమిదేళ్లుగా నలుగుతున్న పోలీస్ సిబ్బంది విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూరల్ ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు పారదర్శకంగా జాబితాను సిద్ధం విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఓ వైపు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ ప్రక్రియను వేగవంతం చేశారు. జాబితాలో పొరపాట్లు, విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనెల 12న సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్వీకరించిన వినతులు, ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చారు. వాటి ఆధారంగా సమస్యలు లేకుండా జాబితాను సవరించే పనిలో ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. నేడో, రేపో తుది జాబితాను రూపొందించి ఉన్నతాధికారుల అనుమతితో విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొం దించారు.
కొనసా..గిన విభజన
2010 మేలో గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఎనిమిదేళ్ల నుంచి నలుగురు ఎస్పీలు సిబ్బందిని విభజన చేయాలని యత్నించారు. 2013లో డీజీపీ ఆదేశాల మేరకు అప్పట్లో తుది జాబితాను కూడా రూపొందించి ప్రకటించేలోగా కొందరు సిబ్బంది తమకు సీనియార్టీలో అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటి నుంచి సిబ్బంది విభజన ఎస్పీలకు సవాలుగానే మారింది. అనంతరం 2015లో పీహెచ్‌డీ రామకృష్ణ కూడా విభజన చేసేందుకు యత్నించారు. పూర్తిస్థాయిలో సీనియార్టీలను పరిశీలించి వాస్తవాలకు అనుగుణంగా రూపొందించాలని ఉద్యోగుల్ని ఆదేశించారు. ఈలోగా ఆయన బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి విభజన ప్రక్రియను పూర్తిచేసి దిశగా యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ప్రస్తుత ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు సమస్యను పరిష్కరించి సిబ్బంది, అధికారుల పదోన్నతుల్లో ఆటంకం తొలగించాలనే నిశ్చయంతో ముందుకు వెళుతున్నారు.
ఆచితూచి అడుగు
జిల్లావ్యాప్తంగా 4500 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు జరిగేతే పిల్లల చదువులకు ఆటంకం లేకుండా చేసుకోవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న ఎస్పీ ఈలోగానే పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విమర్శలు లేకుండా తుది జాబితాను రూపొందించి డీజీపీ అనుమతితో విడుదల చేసేందకు కృషి చేస్తున్నారు.
ఐపీఎస్‌ల తరహాలోనే విభజన
రాష్ట్రం విడిపోయే సమయంలో ఐపీఎస్‌ల విభజన జరిగిన తరహాలోనే ప్రక్రియ ఉంటుంది. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చాం. ఆరోపణలకు తావు లేకుండా విభజన పూర్తి చేయడమే నా లక్ష్యం. తుది జాబితా వెలువడిన అనంతరం ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లి న్యాయం కోరవచ్చు. త్వరలో జాబితా విడుదల చేస్తాం.– సీహెచ్ వెంకటప్పలనాయుడు, రూరల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment