అర్బన్ ఎస్పీ కార్యాలయం
గుంటూరు: అర్బన్ జిల్లా పరిధిలో సుదీర్ఘకాలంగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న పోలీసుల బదిలీకి రంగం సిద్ధం అయింది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు బదిలీ చేసేందుకు ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్లు ఒకే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలనే నిబంధనలు ఉండటంతో ఆ మేరకు జాబితాను రూపొందిస్తున్నారు. అయితే, ఇప్పటికే పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారీలో పాటు విజ్ఞప్తుల మేరకు వారం రోజుల కిందట 48 మందిని ఎస్పీ బదిలీ చేశారు. వీరిలో అధికంగా ట్రాఫిక్, జాతీయ రహదారుల వెంట నిఘా, వాహనాల క్రమబద్ధీకరణలో విధులు కేటాయించారు.
మూడు ఆప్షన్ల విధానంలో బదిలీలు
విమర్శలకు తావులేకుండా మూడు ఆప్షన్ల విధానంలో బదిలీలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బదిలీ జాబితాలో ఉన్నవారు గతంలో పనిచేయని పోలీస్ స్టేషన్లను కోరుకోవాలి. అలాకాకుండా గతంలో పని చేసిన స్టేషన్ల కోసం ఆప్షన్లలో నమోదు చేస్తే మాత్రం నిర్ణయం అధికారులు తీసుకుంటారు. రెండేళ్ల కాలం పూర్తయిన ఎస్‌ఐలను కూడా బదిలీ చేసేందుకు జాబితాను రూపొందిస్తున్నారు. వీరితో పాటు వీఆర్‌లో ఉన్న వారికి కూడా ఖాళీల వారీగా పోస్టింగ్‌లు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రజా ప్రతినిధుల ద్వారా పైరవీలు
కొందరు సిబ్బంది ఎలాగైనా తాము కోరుకుంటున్న స్టేషన్లలోనే ఉద్యోగం కావాలంటూ ప్రజా ప్రతినిధుల చేత సిఫార్సులు చేయిస్తున్నట్లు పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు కూడా వారికి అనుకూలమైన వారిని తమ పరిధిలోని స్టేషన్లకు వేయించుకుంటే భవిష్యత్‌లో ఉపయోగకరంగా వుంటారనే ఆలోచనలతో పావులు కదుపుతున్నారు. ప్రజా ప్రతినిధులతో కొందరు ఎస్‌ఐలు కూడా సిఫార్సులు చేయిస్తున్నారని చర్చించు కుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment