బాక్సులను పరిశీలిస్తున్న రూరల్ ఎస్పీ సీహెచ్. వెంకటప్పలనాయుడు
గుంటూరు: అర్బన్, రూరల్ జిల్లాల విభజన ప్రక్రియపై పోలీసు సిబ్బందిలో ఉత్కంఠ మొదలైంది. ఈనెల 21 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చని ఎస్పీ ప్రకటించడంతో ఆలోచనలో పడ్డారు. ఒకే బ్యాచ్‌లోని వారిని రోస్టర్‌లో కేటగిరీల వారీగా ఎలాంటి నష్టం లేకుండా మ్యూచ్‌వల్స్ చేసే అవకాశం ఉందని ఈనెల 12న ఎస్పీ ప్రకటించారు. సమస్యలు ఉన్నవారు, కోర్టును ఆశ్రయించిన వారు అభ్యంతరాలను తెలపాలని కోరుతూ ఐదు రకాల ఆప్షన్లను ఇస్తూ శుక్రవారం రూరల్ ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది విభజన విభాగాన్ని ప్రారంభించడంతో పాటు ఐదు బాక్సుల్ని ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. కొత్తగా మ్యూచ్‌వల్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు. వారి వినతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని తెలిపారు.
సిబ్బందిలో తర్జనభర్జన
పూర్తి వివరాలను ఎస్పీ అన్ని పోలీస్ స్టేషన్ల అధికారుల ద్వారా అందజేయడంతో పాటు శుక్రవారం ఉదయం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యంతరాలు, ఆప్షన్లు, మ్యూచ్‌వల్స్ కోరుకునే వారు తాను చెప్పిన విధానంలో సీనియార్టీ కోల్పోవడానికి సిద్ధపడితే అభ్యంతరం ఉండదని వివరించారు. దీంతో ఏం జరుగుతుందోనని సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. కొందరైతే ఎలా జరిగినా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఏళ్ల తరబడి గుంటూరులో ఉంటూ సొంత ఇళ్లు ఉన్నవారు విభజనలో రూరల్‌కు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. తోటి సిబ్బందికి ఫోన్ చేసి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ అభ్యంతరాలు తెలియజేస్తే ఎలా చేయాలి? అనే విషయాల గురించి సీనియర్ల సలహాలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగుల సూచనలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
నామమాత్రంగానే ఫిర్యాదులు
మొదటి రోజున సిబ్బంది ఎస్పీ కార్యాలయానికి నామమాత్రంగానే వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాక్స్‌లో అభ్యంతరాలు, వినతులు, ఆప్షన్లు, మ్యూచ్‌వల్స్‌కు సంబంధించినవి వేసే ముందుగా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి రశీదు పొందాల్సి ఉంది. ఈ క్రమంలో మొదటిరోజున 10లోపు ఫిర్యాదులు మాత్రమే అందాయి. మరో రెండు రోజుల సమయం ఉన్నందున వీటి సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment