గుంటూరు పోలీస్ శాఖలో సిబ్బంది విభజనకు రంగం సిద్ధమైంది. పూర్తి చేయడానికి ఇప్పటికే గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు సీహెచ్ విజయారావు, సీహెచ్ వెంకటప్పల నాయుడు పలుమార్లు రేంజి డీఐజీ కేవీవీ గోపాలరావుతో చర్చించారు. ఆయన సలహాల మేరకు జాబితా రూపొందిస్తున్నారు. ఎలాగైనా సిబ్బంది విభజనను పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో కొనసాగుతున్న విభజన ప్రక్రియ వేగవంతం అయింది. గతంలో డీజీపీ వద్ద ఆమోదం పొందిన జాబితా ప్రకారమే సిబ్బంది విభజన చేయాలని డీఐజీ, ఎస్పీలు నిర్ణయించారు. మరో రెండు నెలల్లో పూర్తి చేసి మార్చి చివరి నాటికి విభజన పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ఏడేళ్లుగా పెండింగ్....
అర్బన్, రూరల్ జిల్లా పోలీస్‌గా 2010లో విభజన జరిగింది. అప్పటి నుంచి పలుమార్లు సిబ్బంది విభజన చేపట్టాలని పలువురు ఎస్పీలు వారిదైనశైలిలో ప్రయత్నించారు. అయితే జాబితాలో పలు పొరపాట్లు వుండటం, సినీయార్టీ ప్రాధాన్యంలో వ్యత్యాసాలు రావడంతో కొందరు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలచింది. అప్పట్లో గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది విభజనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొందరైతే ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని ఎస్పీలు సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటి వరకూ ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రస్తుత అర్బన్, రూరల్ ఎస్పీలు అతి త్వరలో సిబ్బంది విభజన చేపట్టి ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
పెనుభారంగా బందోబస్తు విధులు...
గుంటూరు అర్బన్ జిల్లాలో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతున్న క్రమంలో బందోబస్తు నిర్వహణ సిబ్బందికి పెను సవాలుగా మారింది. తరచూ జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం, సాధారణ విధులు నిర్వహించడం కారణంగా తీవ్ర వత్తిళ్లకు లోనవుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరత తలనొప్పిగా మారింది. కొరత తీర్చాలంటే సిబ్బంది విభజన అనివార్యమని భావించి రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పల నాయుడు డీఐజీతో చర్చించి విభజనకు విదివిధానాలు సిద్ధం చేశారు. 2010 నుంచి పలు దఫాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్న అర్బన్ ఎస్పీ ఇదే విషయంపై ఇటీవల రూరల్‌ఎస్పీతో సమావేశమయ్యారు. డీజీపీ అనుమతి పొందిన జాబితా ప్రకారం విభజన చేయాలని, దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రూరల్ ఎస్పీకి సూచించినట్లు తెలిసింది. ఈనెలలో విధుల్లో చేరిన డీజీపీ మాలకొండయ్య కూడా విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈసారైనా అమలు జరిగితే సిబ్బందిలో ఉన్న ఆందోళనలు తొలగిపోయి నచ్చినచోట ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
సిబ్బందిలో ఆందోళన...
విభజన ప్రక్రియ విషయం తెరమీదకి వచ్చిన ప్రతిసారీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వారి పిల్లల చదువుల కోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే విభజన ప్రక్రియ మార్చి నాటికి పూర్తయితే ఎలాంటి సమస్యలు వుండవంటున్నారు. ఒకవేళ సమస్యలు తలెత్తి నిలిచిపోయి జాన్ తర్వాత జరిగితే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారు.
మార్చి చివరి నాటికి విభజన పూర్తి
పరిపాలనా సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాను. తప్పులు, సమస్యలు తలెత్తకుండా వుండేలా జాబితాను రూపొందించాలని ఆదేశించాను. గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తున్నాం. విమర్శలకు తావులేకుండా మార్చి చివరి నాటికి విభజన ప్రక్రియను పూర్తి చేస్తాం. సీహెచ్ వెంకటప్పల నాయుడు, రూరల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment