
మీడియా సమావేశంలో విగ్రహాన్ని పరిశీలిస్తున్న గుంటూరు అర్బన్ జల్లా ఎస్పీ అమ్మిరెడ్డి
నగరంపాలెం (గుంటూరు): దేవతా మూర్తుల విగ్రహాలను దొంగలించిన ఓ యువకుడిని గంటలోపే గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. జిన్నాటవర్ కూడలిలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవన సముదాయంలో శ్రీకుసుమ హరనాథ ఆలయం ఉంది. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఓ యువకుడు మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ యువకుడు వెళ్లిపోయాక ఆలయంలో కుసుమ, హరనాథ ఉత్సవ మూర్తుల ఇత్తడి విగ్రహాలు కనిపించలేదు. దీంతో ఆలయ వాచ్‌మన్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. బీఆర్ స్టేడియం కూడలిలోని కోడిగుడ్డు సత్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న.. పాతగుంటూరులోని కట్టావారివీధికి చెందిన పోలిశెట్టి దుర్గను అరెస్ట్ చేశారు. అతని వద్ద శ్రీకుసుమ, హరనాథ ఇత్తడి విగ్రహాలను స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 వేలు ఉంటుంది. దుర్గపై గతంలో పలు కేసులున్నాయి. చెడు వ్యసనాలకు బానిసగా మారిన దుర్గ దొంగతనాలు చేసేవాడని, దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. గంటలోపే కేసును ఛేదించిన ఎస్‌ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment