టీడీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో కొందరు దళారులు పెద్ద ఎత్తున పైరవీలు చేసి రూ.లక్షల్లో దండుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి ఎంతో మందిని అక్రమార్కులు మోసం చేశారు. కొందరు పోలీసు అధికారులు సైతం మోసపోయిన బాధితుల్లో ఉన్నారు. ప్రధానంగా విజయవాడకు చెందిన ఓ కేటుగాడు మాత్రం అప్పటి ప్రభుత్వంలోని మంత్రుల సహకారంతో పెద్ద సంఖ్యలో మోసాలకు పాల్పడ్డాడు. కానీ నేటి వరకు అతడిని అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, గుంటూరు : ‘పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం కావాలా.. సీఐ, ఎస్సైలపై ఉన్న ఆరోపణల విచారణ తొలగించాలా.. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం కావాలా.. కుటుంబ సమస్యలు.. ఆస్తుల వివాదాలు ఏవైనా సరే ఉన్నతాధికారుల సహకారంతో వెంటనే పరిష్కరిస్తాను.. అయితే నేను కోరినంత డబ్బు ఇవ్వాలి..’ అంటూ మాయమాటలు చెబుతూ తన పేరు పార్థు అని ఒకచోట మోషే అని మరోచోట ప్రభాకర్, లక్ష్మణ్ అని పేర్లు మార్చుకుంటూ ఓ వ్యక్తి ఘరానా మోసాలకు పాల్పడ్డాడు.
కొన్నేళ్ళుగా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామానికి చెందిన పావులూరి శ్రీనివాసరావు ని అడ్డుగా పెట్టుకున్న ఆ వ్యక్తి తెర వెనుక నుంచి మోసాలకు పాల్పడినట్లు గతేడాది సెప్టెంబరులో పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ వ్యక్తికి గతంలో టీడీపీ మంత్రుల అండదండలు ఉండటంతో పోలీసులు ముందడుగు వేసేందుకు సాçహసించలేకపోయారు. విజయవాడకు చెందిన అజ్ఞాత వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయడంలో అర్బన్ పోలీసులు మీనమేషాలు లెక్కించడంపై విమర్శలొస్తున్నాయి.
మోసాలకు పాల్పడిందిలా...
అజ్ఞాతవ్యక్తిగా తెరవెనుక ఉన్న అగంతకుడు పావులూరి శ్రీనివాసరావును తనతోపాటు కలుపుకొని ఇద్దరూ కలసి అప్పట్లో మోసాలకు పాల్పడ్డారు. అయితే సమస్యను పరిష్కరించేందుకు బాధితుడు వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు విజయవాడకు చెందిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిస్తాడు. సచివాలయంలో ఉన్న కీలక ఉన్నతాధికారి వద్ద సీసీగా పని చేస్తున్నట్లు ఫోన్‌లో మాట్లాడి నమ్మిస్తాడు కేటుగాడు. ఇలా గుంటూరుకు చెందిన ఓ హోంగార్డుకు కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రెండేళ్ల క్రితం విడతల వారీగా రూ.10 లక్షలకు పైగా తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలలో బాధితుడు ఎస్పీని కలసి ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.
విజయవాడకు చెందిన రిటైర్డ్ ఏఎస్సై నాగమల్లేశ్వరరావు కుమార్తెకు సర్వశిక్షఅభియాన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3 లక్షలు కాజేశారు. బాధితుడు ఫిర్యాదుతో విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుంటూరులోని అమరావతి రోడ్డుకు చెందిన నాగేశ్వరరావు వద్ద సివిల్ వివాదం పరిష్కరిస్తామని చెప్పి రూ.3 లక్షలు కాజేశారు. పాత గుంటూరుకు చెందిన రవీంద్రబాబుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రావాల్సిన కమీషన్ ఇప్పిస్తామని చెప్పి రూ.70 వేలు తీసుకున్నారు. కుటుంబ సమస్య పరిష్కరిస్తామని నమ్మించి బాపట్లకు చెందిన వివాహిత వసంత వద్ద రూ.70 వేలు వసూలు చేశారు. అనంతరం తాను మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులనూ వదల్లేదు...
శాఖాపరంగా అధికారులపై వచ్చే ఆరోపణలపై వచ్చే ఫిర్యాదులను ఉన్నతాధికారులు విచారించి నివేదికను రేంజ్ ఐజీకి అందజేస్తారు. నివేదిక ఆధారంగా ఆ వ్యక్తులపై ఐజీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ సీఐతో పాటుగా మరో కానిస్టేబుల్ వారిపై వచ్చిన ఫిర్యాదులను తొలగించుకునేందుకు కేటు గాడిని ఆశ్రయించి ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున ఇచ్చినట్లు పోలీస్‌శాఖలో ప్రచారం జరిగింది. అయితే వారు మోసపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయారు. అలాగని ఫిర్యాదు చేయలేక మౌనం వహించారు. ఇలా గడచిన ఐదేళ్లలో ఇలాంటి ఎన్ని మోసాలకు పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
టీడీపీ మంత్రుల అండదండలతోనే...
విజయవాడకు చెందిన ఓ మాజీ మంత్రితో పాటు గుంటూరుకు చెందిన మరో మాజీ మంత్రి అండదండలు ఆ కేటుగాడికి పుష్కలంగా ఉండటంతో ఇష్టానుసారం మోసాలకు పాల్పడ్డారు. హోంగార్డుకు కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో శ్రీనివాసరావుతో పాటు విజయవాడకు చెందిన శ్రావణ్‌కుమార్‌ను అప్పట్లో అరెస్టు చేశారు. అదే కేసులో ముద్దాయిగా గుర్తించిన పోలీసులు కేటుగాడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. అయితే పావులూరి శ్రీనివాసరావును అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదై ఉన్నప్పటికీ కేడీషీట్ తెరిచేందుకు సాహసించలేక పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విజయవాడకు చెందిన అజ్ఞాత వ్యక్తిగా ఉన్న మోసగాడి విషయంలో కఠినంగా వ్యవహరించి అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పోలీస్‌శాఖలో చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment