గుంటూరు క్రైం: పోలీస్ శాఖలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో సీఐల బదిలీ జరుగనున్నట్లు ఆ శాఖలో ప్రచారం మొదలైంది. రేంజ్ పరిధిలోని సుమారు 30కి పైగా బదిలీలు తొలివిడతలో జరిగే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. విడతల వారీగా నెలాఖరు వరకు బదిలీలు కొనసాగనున్నాయి. మరో రెండు రోజుల్లో సీఐల బదిలీల జాబితా వెలువడనుందని, తొలి విడతలో ఖద్దరు మార్క్ బదిలీలు మాత్రమే ఉంటాయని భావిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు అనుకూలంగా పనిచేయలేదని కొందరు, తాము సూచించిన వారు మాత్రమే తమ నియోజకవర్గంలో పనిచేయాలని మరికొందరు ప్రజాప్రతినిధులు బదిలీల పర్వానికి శ్రీకారం చుట్టారు.
దాదాపు అన్ని శాఖల్లో అధికారులను మార్పు చేయాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు స్వయంగా వారికి కావాల్సిన అధికారుల జాబితాలను రూపొందించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వం మారిన అనంతరం అధికారులను మార్చడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో అధికారులు కూడా ఇష్టం లేనప్పటికీ అధికార పార్టీకి జై కొట్టాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. విధి నిర్వహణలో చిన్నపాటి లోపాలను కూడా అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు సాకుగా చూపి ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేయడంతో విధులు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.
ఎవరి పనిలో వారు...
బదిలీలు తప్పవని భావించిన కొందరు అధికారులు తమకు ఉన్న పరిచయాలతో ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులను ఆశ్రయిస్తున్నారు. బదిలీల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమకు అవకాశం కల్పిస్తే పూర్తిగా సహకరిస్తామని హామీలు ఇచ్చినట్లు తెలిసింది.
మరికొందరైతే తాము కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తే రూ. 5 లక్షల నుంచి రూ.16 లక్షలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ముందుగా సగం, పోస్టింగ్ అనంతరం మిగిలిన సగం ఇచ్చేందుకు కొందరు అధికారులు సిద్ధపడటంతో తాము సూచించిన వ్యక్తులకే పోస్టింగ్ వేయాలని పోలీస్ ఉన్నతాధికారులపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన అధికారులకు మాత్రమే బదిలీల్లో పోస్టింగ్ దక్కే అవకాశం ఉందని పోలీస్‌శాఖలో చర్చించుకుంటున్నారు.
ఇస్టానుసారంగా...
ఇదిలా ఉంటే జిల్లాలో ఎన్నికలకు ముందు జరిగిన బదిలీలు మళ్పీ మార్పు జరుగుతాయని భావించిన కొందరు అధికారులు ఒక అడుగు ముందుకు వేశారు. ఎలాగైనా బదిలీలు అనివార్యమని భావించిన కొందరు అధికారులు శాంతిభద్రతల విషయాన్ని పక్కనబెట్టి, కింది స్థాయి సిబ్బంది ద్వారా అక్రమ వసూళ్లు, స్టేషన్‌లలో రాజీలు చేయుంచి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్‌లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలు ఎస్పీల దృష్టికి వెళ్ళకుండా అధికారులు జాగ్రత్తలు వహిస్తున్నారని తెలిసింది. స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్ళ దృష్టికి వెళ్ళినప్పటికీ, ఆయా ప్రాంతాల్లోని అధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయనే భయంతో నోరు మెదపడం లేదని సమాచారం. ఏదిఏమైనా ఈనెలలోనే సీఐల బదిలీలతో పాటు ఎస్సైల బదిలీలు కూడా పూర్తి చేసేందుకు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పోలీస్ బదిలీలకు రంగం సిద్ధం
Published Mon, Sep 8 2014 2:14 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement