షుమాకర్ సరసన హామిల్టన్
అత్యధిక ‘పోల్’ పొజిషన్స్ రికార్డు సమం
స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో ఐదో టైటిల్‌ను గెలిచేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆదివారం జరిగే బెల్జియం గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ఈ ప్రపంచ మాజీ చాంపియన్ తొలి స్థానంతో ప్రారంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.553 సెకన్లలో ల్యాప్‌ను ముగించి ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో 68 ‘పోల్స్’తో జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక ‘పోల్ పొజిషన్స్’ ప్రపంచ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి, బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి, ఒకాన్ పదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.