Louis Hamilton
-
వారెవ్వా... హామిల్టన్
సావోపాలో (బ్రెజిల్): ఫార్ములావన్ తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేసి చూపించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును పదో స్థానం నుంచి ఆరంభించిన అతడు చివరకు అగ్ర స్థానంతో ముగించాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 101వ విజయం. 10.496 సెకన్లు వెనుకగా రేసును పూర్తి చేసిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడు రేసును పదో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఏకంగా నాలుగు కార్లను ఓవర్టేక్ చేసి ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. మరో ఐదు ల్యాప్‌లు పూర్తయ్యాక మూడో స్థానానికి చేరాడు. మరికాసేపటికే రెడ్‌బుల్ మరో డ్రైవర్ పెరెజ్ కారును దాటేసిన అతడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి మరింత వేగం పెంచిన హామిల్టన్ తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌కు తనకు ఉన్న అంతరాన్ని తగ్గించాడు. మరోవైపు వెర్స్టాపెన్ కూడా తన డిఫెన్స్ డ్రైవింగ్‌తో హామిల్టన్‌కు పరీక్ష పెట్టాడు. 48వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి హామిల్టన్ విఫలమయ్యాడు. ఆ సమయంలో రెండు కార్లు కూడా ఒకదానితో మరొకటి ఢీకొనేవి. అయితే హామిల్టన్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. 59వ ల్యాప్‌లో మరోసారి వెర్స్టాపెన్ కారును అధిగమించేందుకు ప్రయత్నించిన హామిల్టన్ ఈసారి మాత్రం సఫలమయ్యాడు. అక్కడి నుంచి మిగిలిన ల్యాప్‌లను ఎటువంటి పొరపాటు చేయకుండా పూర్తి చేసిన అతడు విజేతగా నిలిచాడు. -
Lewis Hamilton: వరుసగా ఐదో విజయం!
బార్సిలోనా (స్పెయిన్): ఆరంభంలో ఆధిక్యం కోల్పోయినా... ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేస్తూ... చివరి దశలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి... ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసును సొంతం చేసుకున్నాడు. 66 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసులో ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి మలుపు వద్ద రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ దూకుడు కొనసాగించగా... మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేందుకు హామిల్టన్ పట్టువదలకుండా ప్రయత్నించాడు. రేసు మరో ఆరు ల్యాప్‌ల్లో తర్వాత ముగుస్తుందనగా హామిల్టన్ వేగాన్ని పెంచి వెర్స్టాపెన్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఆరు ల్యాప్‌ల్లో వెర్‌స్టాపెన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా హామిల్టన్ ట్రాక్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయి లక్ష్యాన్ని గంటా 33 నిమిషాల 07.680 సెకన్లలో అందుకొని విజేతగా నిలిచాడు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా ఓవరాల్‌గా ఆరోది. హామిల్టన్కంటే ముందు దివంగత దిగ్గజ డ్రైవర్ అయిర్టన్ సెనా (బ్రెజిల్) మాత్రమే ఒకే గ్రాండ్‌ప్రిలో (మొనాకో గ్రాండ్‌ప్రి 1989 నుంచి 1993 వరకు) వరుసగా ఐదేళ్లు విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 98వ విజయం. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. లెక్లెర్క్ (ఫెరారీ), 5. పెరెజ్ (రెడ్‌బుల్), 6. రికియార్డో (మెక్లారెన్), 7. సెయింజ్ (ఫెరారీ), 8. నోరిస్ (మెక్లారెన్), 9. ఒకాన్ (అల్పైన్), 10. గాస్లీ (అల్ఫా టౌరి). -
Lewis Hamilton: హామిల్టన్ ‘సెంచరీ’
బార్సిలోనా (స్పెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మరో రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ‘పోల్ పొజిషన్’ సాధించడంద్వారా ఎఫ్1 క్రీడా చరిత్రలో 100 పోల్ పొజిషన్స్ సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. చివరి క్వాలిఫయింగ్ సెషన్లో ల్యాప్‌ను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.741 సెకన్లలో ముగించిన హామిల్టన్ కెరీర్లో 100వ పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక పోల్ పొజిషన్స్ (68) రికార్డును 2017లోనే బద్దలు కొట్టిన హామిల్టన్ నాలుగేళ్ల తర్వాత ‘సెంచరీ’ మైలురాయిని చేరుకున్నాడు. ► 2007లో మాంట్రియల్లో జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్ కెరీర్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ► 2012 వరకు మెక్లారెన్ జట్టుతోనే కొనసాగిన హామిల్టన్ ఆ జట్టు తరఫున 26 పోల్ పొజిషన్స్ సాధించాడు. ► 2013 సీజన్ నుంచి మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగిన హామిల్టన్ ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. మెర్సిడెస్ తరఫున హామిల్టన్ 74 పోల్ పొజిషన్స్‌ను కైవసం చేసుకున్నాడు. తన 14 ఏళ్ల ఎఫ్1 కెరీర్లో హామిల్టన్ అత్యధికంగా ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ క్రీడలో అత్యధిక విజయాలు (97) సాధించిన డ్రైవర్‌గానూ గుర్తింపు పొందాడు. ► స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో భాగంగా జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ సహచరుడు వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని పొందాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్); 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్); 3. బొటాస్ (మెర్సిడెస్); 4. లెక్లెర్క్ (ఫెరారీ); 5. ఎస్తెబన్ ఒకాన్ (అలైన్); 6. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ); 7. రికియార్డో (మెక్లారెన్); 8. సెర్గియోపెరెజ్ (రెడ్‌బుల్); 9. లాండో నోరిస్ (మెక్లారెన్); 10. ఫెర్నాండో అలోన్సో (అలైన్); 11. లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్); 12. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి); 13. సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్); 14. జియోవినాజి (అల్ఫా రోమియో); 15. జార్జి రసెల్ (విలియమ్స్); 16. యుకీ సునోడా (అల్ఫా టౌరి); 17. కిమీ రైకోనెన్ (అల్ఫా రోమియో); 18. మిక్ షుమాకర్ (హాస్); 19. నికోలస్ లతీఫి (విలియమ్స్); 20. నికిటా మేజ్‌పిన్ (హాస్). -
క్వాలిఫయింగ్‌లో హామిల్టన్‌కు నిరాశ
పోర్టిమావో (పోర్చుగల్): కెరీర్లో 100వ పోల్ పొజిషన్ సాధించేందుకు డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ మాత్రం ఈ క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇది 17వ పోల్. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్ సెషన్లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌లో వెర్స్టాపెన్, ఇమోలా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌లు పోల్ పొజిషన్‌తో మెరిశారు. గ్రిడ్ పొజిషన్స్ 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. పెరెజ్ (రెడ్‌బుల్), 5. సెయింజ్ (ఫెరారీ), 6. ఒకాన్ (ఆల్పైన్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. లెక్లెర్క్ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్ (ఆస్టన్ మార్టిన్), 11. రసెల్ (విలియమ్స్), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్లారెన్) 17. స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్), 18. లతీఫ్ (విలియమ్స్), 19. మిక్ షుమాకర్ (హాస్), 20. మేజ్‌పిన్ (హాస్) -
హై హై హామిల్టన్...
ఇస్తాంబుల్: ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న మరో రికార్డును ఈ మెర్సిడెస్ డ్రైవర్ సమం చేశాడు. ఆదివారం జరిగిన టర్కీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల ఈ రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన హామిల్టన్ అందరికంటే వేగంగా గంటా 42 నిమిషాల 19.313 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది పదో విజయంకాగా... కెరీర్లో 94వ విజయం. తాజా గెలుపుతో ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే 35 ఏళ్ల హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌నూ సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది ఏడో ప్రపంచ టైటిల్. తద్వారా ఏడు ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. 2013లో మెర్సిడెస్ జట్టులో షుమాకర్ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్ అదే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆరుసార్లు ప్రపంచ టైటిల్‌ను దక్కించుకోగా... 2008లో మెక్లారెన్ తరఫున పోటీపడి హామిల్టన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్నాడు. ఇటీవలే అత్యధికసార్లు ఎఫ్1 రేసుల్లో విజేతగా నిలిచిన షుమాకర్ (91 సార్లు) రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మెర్సిడెస్‌కే చెందిన తన సహచరుడు వాల్తెరి బొటాస్ కంటే ముందుగా నిలిస్తే ప్రపంచ టైటిల్‌ను ఖాయం చేసుకునే పరిస్థితిలో ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ఇతర డ్రైవర్ల వ్యూహాత్మక తప్పిదాలు కలిసొచ్చాయి. ఆరంభంలో దూకుడు కనబర్చని హామిల్టన్ సగం ల్యాప్‌లు పూర్తయ్యాక జోరు పెంచాడు. 35వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు కాపాడుకొని ఏకంగా 31 సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్) రెండో స్థానంలో... సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 14వ స్థానంలో నిలిచాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో ముగ్గురు రేసును ముగించలేకపోయారు. మొత్తం 17 రేసుల ఈ సీజన్లో 14 రేసులు పూర్తయ్యాక... హామిల్టన్ 307 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. 197 పాయింట్లతో బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... 170 పాయింట్లతో వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. అత్యధిక ఎఫ్1 ప్రపంచ టైటిల్స్ నెగ్గిన డ్రైవర్లు హామిల్టన్ (బ్రిటన్–7): 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020 షుమాకర్ (జర్మనీ–7) : 1994, 1995, 2000, 2001, 2002, 2003, 2004 ఫాంగియో (అర్జెంటీనా–5): 1951, 1954, 1955, 1956, 1957 అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్–4) : 1985, 1986, 1989, 1993 సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ–4): 2010, 2011, 2012, 2013 ఏదీ అసాధ్యం కాదు. మీ కలలను సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తూ ఉండాలి. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ కాగలనని నేను అన్నప్పుడు అందరూ అసాధ్యమని అన్నారు. కానీ నేను సాధించి చూపించాను. రంగం ఏదైనా ఓటమి ఎదురైతే బాధపడకూడదు. అనుక్షణం పోరాడుతూనే ఉండాలి. చివరికి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. మైకేల్ షుమాకర్ ప్రపంచ రికార్డును సమం చేయడంతో అందరి దృష్టి నాపై పడింది. అయితే ఎల్లప్పుడూ నేను ఈ క్రీడలో ఉండనని గమనించాలి. ఈ క్షణంలో అందరితో నేను కోరేది ఒక్కటే... ప్రపంచంలో సమానత్వం కోసం మీ వంతుగా కృషి చేయండి. వర్ణం, హోదా, నేపథ్యం చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించండి. –హామిల్టన్ -
విజేత హామిల్టన్
ఇమోలా: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తాజా ఎఫ్1 సీజన్లో మరో రేసు విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 63 ల్యాప్‌ల ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్... గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కాగా... ఓవరాల్‌గా 93వది. రేసును ఆరంభించడంలో విఫలమైన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అయితే 21వ ల్యాప్‌లో సహచర మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ టైర్లు మార్చుకోవడానికి పిట్స్లోకి రావడంతో లీడ్‌లోకి వచ్చిన హామిల్టన్... తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో హామిల్టన్‌కు ‘వర్చువల్ సేఫ్టీ కారు’ రూపంలో అదృష్టం కూడా తోడవ్వడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. 33వ ల్యాపులో ఒకాన్ (రెనౌ) కారులో సమస్య తలెత్తడంతో... అతడు తన కారును ట్రాక్ పక్కన నిలిపేశాడు. దాంతో ఆ కారును తొలగించే వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా... ఎఫ్1 స్టీవర్డ్స్ ‘వర్చువల్ సేఫ్టీ కారు’ను డెప్లాయ్ చేశారు. అదే సమయంలో తన కారు టైర్లను మార్చుకున్న హామిల్టన్ తొలి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న అతడు విజేతగా నిలిచాడు. బొటాస్ రెండో స్థానంలో... రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. 51వ ల్యాప్‌లో టైరు పంక్చర్ కావడంతో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రేసు నుంచి వైదొలిగాడు. సీజన్లో 13 రేసులు ముగిశాక హామిల్టన్ 282 పాయింట్లతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ 197 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వరుసగా ఏడో ఏడాది (2014, 15, 16, 17, 18, 19, 20) కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గి ఈ రికార్డును సాధించిన తొలి ఎఫ్1 టీమ్‌గా నిలిచింది. -
ఒకే ఒక్కడు...
పోర్టిమావో (పోర్చుగల్): ఫార్ములావన్ (ఎఫ్1)లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తెరమరుగైంది. గత ఏడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 92వ విజయం నమోదు చేశాడు. ఈ క్రమంలో 91 విజయాలతో జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును 35 ఏళ్ల హామిల్టన్ బద్దలు కొట్టాడు. 2007లో తొలి ఎఫ్1 విజయం సాధించిన హామిల్టన్ 2013లో మెర్సిడెస్ జట్టులో చేరాడు. మెర్సిడెస్ జట్టులో షుమాకర్ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్ అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. షుమాకర్ ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ (సీజన్ ఓవరాల్ విన్నర్) ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండగా... ఈ ఏడాదీ హామిల్టన్‌కే ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా ఈ సీజన్లో మరో ఐదు రేసులు ముగిశాక షుమాకర్ పేరిట ఉన్న ఈ రికార్డునూ హామిల్టన్ సమం చేసే చాన్స్ ఉంది. 2006లో చైనా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత షుమాకర్ అదే ఏడాది ఎఫ్1కు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని ఎఫ్1లో పునరాగమనం చేసిన షుమాకర్ 2012 వరకు మెర్సిడెస్ జట్టుతో కొనసాగినా మరో రేసులో గెలుపొందలేకపోయాడు. ఆరంభంలో వెనుకబడ్డా... 24 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించాడు. అయితే రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మొదట్లోనే హామిల్టన్‌ను ఓవర్టేక్ చేశాడు. అయితే 20వ ల్యాప్‌లో హామిల్టన్ ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత అదే జోరును చివరిదైన 66వ ల్యాప్ వరకు కొనసాగించాడు. చివరకు గంటా 29 నిమిషాల 56.828 సెకన్లలో రేసును ముగించిన హామిల్టన్ కెరీర్లో 92వ విజయాన్ని దక్కించుకున్నాడు. బొటాస్‌కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొం దాడు. ప్రస్తుత సీజన్‌లోని 17 రేసుల్లో 12 పూర్తయ్యాయి. తదుపరి రేసు ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి ఇటలీలో నవంబర్ 1న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో హామిల్టన్ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బొటాస్ (179 పాయింట్లు), వెర్స్టాపెన్ (162 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ 435 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
షుమాకర్ సరసన లూయిస్ హామిల్టన్
నుర్బర్గ్రింగ్ (జర్మనీ): ఈసారి అందివచ్చిన అవకాశాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వదులుకోలేదు. ఫార్ములావన్ (ఎఫ్1)లో అత్యధిక విజయాలు సాధించిన దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఆదివారం జరిగిన జర్మనీ ఐఫెల్ గ్రాండ్‌ప్రి రేసులో 35 ఏళ్ల హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ నిర్ణీత 60 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఎఫ్1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్‌గా 2006 నుంచి మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేశాడు. షుమాకర్ కెరీర్లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా... హామిల్టన్ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధిం చాడు. ఈ సీజన్లో మరో ఆరు రేసులు మిగిలి ఉన్న నేపథ్యంలో షుమాకర్ రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టడం ఖాయం. సీజన్ లోని తదుపరి రేసు పోర్చుగల్ గ్రాండ్‌ప్రి ఈనెల 25న జరుగుతుంది. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ బొటాస్ 13వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్ 13వ ల్యాప్‌లో బొటాస్‌ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. బొటాస్ 18వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకోగా... అటునుంచి ఈ బ్రిటన్ డ్రైవర్ వెనుదిరిగి చూడలేదు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. తన తండ్రి రికార్డును సమం చేసిన హామిల్టన్‌కు షుమాకర్ తనయుడు మిక్ ఓ జ్ఞాపిక ఇచ్చాడు. షుమాకర్ తన కెరీర్ చివరి సీజన్ (2012)లో ఉపయోగించిన హెల్మెట్‌ను హామిల్టన్‌కు మిక్ బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు ఈ రేసులో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ (ఆల్ఫా రోమియో) అత్యధికంగా 323 ఎఫ్1 రేసుల్లో పాల్గొన్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. 322 రేసులతో బారికెల్లో (బ్రెజిల్) పేరిట ఉన్న రికార్డును రైకోనెన్ బద్దలు కొట్టాడు. -
విజయంతో ముగించాడు
అబుదాబి: పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించి... అదే జోరును చివరి ల్యాప్ వరకు కొనసాగించి... మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 2019 ఫార్ములావన్ సీజన్‌ను విజయంతో ముగించాడు. ఆదివారం జరిగిన సీజన్లో చివరిదైన 21వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో 34 ఏళ్ల హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 55 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 34 నిమిషాల 05.715 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో... లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కెరీర్లో 88వ సారి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్ ఈ సీజన్లో 11వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సీజన్లో రెండు రేసులు మిగిలి ఉండగానే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న హామిల్టన్ మొత్తం 413 పాయింట్లు సాధించాడు. బొటాస్ (మెర్సిడెస్–326 పాయింట్లు) రెండో స్థానంలో ... వెర్స్టాపెన్ (278 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. ►3 ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో పాల్గొన్న 10 జట్లలో మూడు జట్లు మాత్రమే టైటిల్స్ సాధించాయి. ►5 ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మొత్తం 21 రేసులు జరిగాయి. అయితే ఐదుగురు డ్రైవర్లు మాత్రమే కనీసం ఒక్కో టైటిల్ సాధించగలిగారు. హామిల్టన్ 11 టైటిల్స్ నెగ్గాడు. బొటాస్ 4 టైటిల్స్, వెర్స్టాపెన్ 3 టైటిల్స్, లెక్లెర్క్ 2 టైటిల్స్, వెటెల్ ఒక టైటిల్ గెలిచారు. -
హామిల్టన్ హవా
బుడాపెస్ట్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 70 ల్యాప్‌ల రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరుగుతుంది. -
హామిల్టన్‌కు 87వ ‘పోల్’
హాకెన్‌హీమ్ (జర్మనీ): ఈ సీజన్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.767 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఈ సీజన్లో పది రేసులు జరగ్గా... ఏడింటిలో హామిల్టనే విజేత. మరో రెండు రేసుల్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నెగ్గగా... మరోదాంట్లో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజయం సాధించాడు. ఫెరారీ డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ వెటెల్ తొలి క్వాలిఫయింగ్ సెషన్‌ను దాటలేకపోయాడు. ఆదివారం జరిగే రేసును అతను చివరిదైన 20వ స్థానం నుంచి మొదలు పెడతాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. పియరీ గాస్లీ (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (అల్ఫా రోమియో), 6. గ్రోస్యెన్ (హాస్), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 9. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 10. లెక్లెర్క్ (ఫెరారీ), 11. గియోవినాజి (అల్ఫా రోమియో), 12. మాగ్నుసెన్ (హాస్), 13. రికియార్డో (రెనౌ), 14. క్వియాట్ (ఎస్టీఆర్), 15. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 16. లాండో నోరిస్ (మెక్లారెన్), 17. అలెగ్జాండర్ ఆల్బోన్ (ఎస్టీఆర్), 18. జార్జి రసెల్ (విలియమ్స్), 19. రాబర్ట్ కుబికా (విలియమ్స్), 20. వెటెల్ (ఫెరారీ). సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
హామిల్టన్ హవా
మొనాకో: క్వాలిఫయింగ్‌లో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదరగొట్టాడు. ఫలితంగా ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో టైటిల్ కాగా... మెర్సిడెస్ జట్టుకు ఆరో విజయం కావడం విశేషం. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లే విజేతగా నిలిచారు. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ బొటాస్ రెండు రేసుల్లో గెలిచాడు. మొనాకో విజయాన్ని ఫార్ములావన్ దిగ్గజం నికీ లాడా (ఆస్ట్రియా)కు హామిల్టన్ అంకితం ఇచ్చాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా గత సోమవారం మృతి చెందారు. ఈ సీజన్లో ఆరు రేసులు ముగిశాక హామిల్టన్ 137 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 9న జరుగుతుంది. -
‘చైనా’ చాంప్ హామిల్టన్
షాంఘై: క్వాలిఫయింగ్‌లో వెనుకబడినా... ప్రధాన రేసులో అదరగొట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 32 నిమిషాల 06.350 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అలంకరించాడు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రధాన రేసు మొదలైన వెంటనే తొలి మలుపులోనే బొటాస్‌ను ఓవర్టేక్ చేసిన హామిల్టన్. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కొనసాగించి ఫార్ములావన్‌లో 1000వ రేసుగా జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో ఆరోసారి చాంపియన్ అయ్యాడు.ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ముగ్గురు డ్రైవర్లు లాండో నోరిస్ (మెక్లారెన్), డానిల్ క్వియాట్ (ఎస్టీఆర్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ) రేసు ముగించకుండానే మధ్యలో వైదొలిగారు. ఈ సీజన్లో మూడు రేసుల తర్వాత హామిల్టన్ (68 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ (62 పాయింట్లు) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్–39 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
భళా.. బొటాస్
మెల్బోర్న్: ఫార్ములావన్ 2019 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో బొటాస్ 58 ల్యాప్‌లను గంటా 25 నిమిషాల 27.325 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ చాంపియన్ , మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతను గంటా 25 నిమిషాల 48.211 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. గతేడాది పలు రేసుల్లో బొటాస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లినా హామిల్టన్ వరల్డ్ టైటిల్ అవకాశాలకు దెబ్బ పడకూడదనే ఉద్దేశంతో రేసు జరుగుతున్న సమయంలోనే మెర్సిడెస్ యాజమాన్యం వేగం తగ్గించాలని, హామిల్టన్‌కు సహకరించాలని బొటాస్‌కు సూచనలు ఇచ్చింది. ఈ అంశంపై బొటాస్ బహిరంగంగానే తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. అయితే ఈ సీజన్ లోని తొలి రేసులో మాత్రం అలా జరగలేదు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి ల్యాప్ మలుపులోనే రెండో స్థానంలో ఉన్న బొటాస్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత బొటాస్ వెనుదిరిగి చూడలేదు. 2017లో అబుదాబిలో టైటిల్ గెలిచిన తర్వాత బొటాస్‌కు మళ్లీ టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. గత సంవత్సరం బొటాస్‌కు ఏదీ కలిసి రాలేదు. క్వాలిఫయింగ్‌లో రాణించినా, ప్రధాన రేసులో విఫలమవ్వడం... కారులో సాంకేతిక సమస్యలు తలెత్తడం... ఇతరత్రా కారణాలతో అతను ఒక్క రేసులో కూడా గెలవలేకపోయాడు. కానీ ఈ సీజన్లో తొలి రేసులోనే అతను విజేతగా నిలిచి మరిన్ని టైటిల్స్‌పై దృష్టి పెట్టాడు. ఓవరాల్‌గా 119 రేసుల్లో పాల్గొన్న బొటాస్ కిది నాలుగో టైటిల్. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. వెటెల్ (ఫెరారీ), 5. లెక్లెర్క్ (ఫెరారీ), 6. మాగ్నుసెన్ (హాస్), 7. హుల్కెన్ బర్గ్ (రెనౌ), 8. రైకోనెన్ (అల్ఫా రోమియో రేసింగ్), 9. స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 10. క్వియాట్ (ఎస్టీఆర్). -
హామిల్టన్... ఆగాగు!
ఆస్టిన్ (అమెరికా): ఈ సీజన్లో ఎవరికీ అందనంత వేగంతో దూసుకెళ్తున్న లూయిస్ హామిల్టన్‌కు అమెరికాలో అనూహ్యంగా నిరాశ ఎదురైంది. ఇప్పటికే తొమ్మిది రేసుల్లో విజేతగా నిలిచిన ఈ మెర్సిడెస్ డ్రైవర్ ఇక్కడ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టు కున్నాడు. దీంతో ఐదో ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం అతనికి నిరీక్షణ తప్పడం లేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యూఎస్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ విజేతగా నిలిచాడు. ఐదేళ్ల తర్వాత అతనికి ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా అతను 2013లో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో గెలిచాడు. అమెరికన్ సర్క్యూట్లో 56 ల్యాప్‌ల రేసును అందరికంటే వేగంగా రైకోనెన్ 1 గంటా 34 నిమిషాల 18.643 సెకన్లలో పూర్తి చేశాడు. 2.342 సెకన్లు వెనుకబడిన హామిల్టన్ 1:34:16.301 సె. టైమింగ్‌తో మూడో స్థానంతో తృప్తిపడ్డాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ (1:34:17.362 సె.) రెండో స్థానంలో నిలువగా, హామిల్టన్ ప్రత్యర్థి వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానం పొందాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్బెన్ ఒకాన్ డిస్క్వాలిఫై కాగా, సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానం పొందాడు. తదుపరి రేసు మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో ఒకవేళ వెటెల్ గెలిచినా కూడా... హామిల్టన్ టాప్–7లో నిలిస్తే చాలు ఇతనే ఐదోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడు. వెటెల్ గెలవకపోతే హామిల్టన్ స్థానాలతో సంబంధం లేకుండా విజేతగా నిలుస్తాడు. ప్రస్తుతం హామిల్టన్ (346 పాయింట్లు), వెటెల్ (276 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
హామిల్టన్ హవా
సోచి: సహచరుడు బొటాస్ సహకారం ఇవ్వడంతో ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్ వరకు వెటెల్ (ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్ రెండో స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్ జట్టు టీమ్ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది. జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని కెరీర్లో 70వ విజయాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. 21 రేసుల ఈ సీజన్లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 7న జరుగుతుంది. -
హామిల్టన్ హవా
సింగపూర్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఏడో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ 61 ల్యాప్‌ల రేసును గంటా 51 నిమిషాల 11.611 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు రెండో స్థానం, వెటెల్ (ఫెరారీ)కు మూడో స్థానం లభించాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఒకాన్ తొలి ల్యాప్‌లోనే వైదొలగగా... పెరెజ్ 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో 15 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 281 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. -
హామిల్టన్‌కు పోల్
సింగపూర్: ఈ సీజన్లో ఏడో విజయంపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దృష్టి పెట్టాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ దుమ్ము రేపాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ముగించి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఆరు రేసుల్లో గెలిచిన హామిల్టన్ క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 36.015 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 7, 9 స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. సీజన్లో 14 రేసులు పూర్తయ్యాక ప్రస్తుతం హామిల్టన్ 256 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... 226 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సాయంత్రం గం. 5.35 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ఇటలీ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
మోంజా: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఆరో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఆరో విజయంకాగా, కెరీర్లో 68వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రైకోనెన్ 45వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే అదే ల్యాప్‌లో రైకోనెన్ను వెనక్కినెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానంలో... ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
వారెవ్వా... హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్ సెషన్లో నిరాశపరిచినప్పటికీ ప్రధాన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేశాడు. 14వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏకంగా విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ 67 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 29.845 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్‌కు మూడో స్థానం లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ జట్టు మరో డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ 51వ ల్యాప్‌లో వైదొలిగాడు. కారుపై నియంత్రణ కోల్పోయిన వెటెల్ ట్రాక్ గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. రేసు ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 53వ ల్యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై దూసుకొచ్చినందుకు విచారణకు హాజరు కావాలని హామిల్టన్‌కు స్టీవార్డ్స్ నోటీసులు జారీ చేశారు. అయితే హామిల్టన్ ఉద్దేశపూర్వకంగా తాను అలా చేయలేదని ఇచ్చిన వివరణపట్ల సంతృప్తి చెందిన స్టీవార్డ్స్ అతడిని హెచ్చరికతో వదిలిపెట్టారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోయుంటే హామిల్టన్ టైటిల్ కోల్పోయేవాడు. -
హామిల్టన్ 2020
లండన్: ఫార్ములావన్ చాంపియన్ రేసర్ లూయిస్ హామిల్టన్ మరో రెండేళ్లు మెర్సిడెజ్ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇరు వర్గాల మధ్య ఏడాదికి రూ. 359 కోట్ల భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. దీంతో అత్యధిక మొత్తం తీసుకునే ఎఫ్1 డ్రైవర్‌గా అతను రికార్డుల్లోకెక్కనున్నాడు. మొత్తానికి బ్రిటీష్ డ్రైవర్ 2020 ఏడాది వరకు ఈ కాంట్రాక్టు పొడిగించుకున్నాడు. ఇటీవల జట్టు మారనున్నాడనే ఊహాగానాలకు కొత్త డీల్‌తో తెరదించాడు హామిల్టన్. ఈ బ్రిటన్ డ్రైవర్‌ది మెర్సిడెజ్‌తో విజయవంతమైన భాగస్వామ్యం. ఎఫ్1 దిగ్గజం షుమాకర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హామిల్టన్ అత్యధిక పోల్ పొజిషన్స్ (76) సాధించిన డ్రైవర్‌గా ఘనత వహించాడు. 33 ఏళ్ల ఈ స్టార్ రేసర్ నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్ సాధించాడు. ‘ మెర్సిడెజ్ కుటుంబంతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఇప్పుడది మళ్లీ బలపడింది. మరో రెండేళ్లు కాంట్రాక్టు పొడిగించుకోవడం ఆనందంగా ఉంది’ అని తెలిపిన హామిల్టన్ కొత్త డీల్‌పై సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తమ సంస్థతో కొనసాగనుండటం పట్ల మెర్సిడెజ్ చీఫ్ టొటొ వోల్ఫ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న ఫెరారీ డ్రైవర్ వెటెల్ (171) కంటే హామిల్టన్ (163) 8 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు. -
ఎదురులేని హామిల్టన్
బార్సిలోనా: క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో టైటిల్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో రేసు ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 29.972 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది రెండో టైటిల్ కాగా కెరీర్లో 64వ విజయం. నాటకీయ పద్ధతిలో మొదలైన ఈ రేసులో తొలి ల్యాప్‌లోనే హాస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్ మరో కారును ఢీకొట్టి వైదొలిగాడు. ఆ తర్వాత రేసు పూర్తయ్యేలోపు మరో ఐదుగురు డ్రైవర్లు తప్పుకున్నారు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోగా...మరో డ్రైవర్ ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయాడు. సీజన్లో ఐదు రేసులు ముగిశాక హామిల్టన్ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. -
హామిల్టన్‌కే టైటిల్
సుజుకా: జపాన్ గ్రాండ్ ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ హవా కొనసాగింది. ‘పోల్’ పొజిషన్‌తో ప్రధాన రేసును ఆరంభించిన అతను విజేతగా నిలిచాడు. జపాన్‌లో హామిల్టన్‌కు ఇది నాలుగో టైటిల్. ఓవరాల్‌గా కెరీర్లో 61వ టైటిల్ కావడం విశేషం. ఆదివారం సుజుకా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై ఈ మెర్సిడెస్ డ్రైవర్ దూసుకెళ్లాడు. అందరికంటే వేగంగా హామిల్టన్ 53 ల్యాపులను 1 గంటా 27ని.31.194 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్లో అతనికిది ఎనిమిదో టైటిల్ కాగా డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (306)... వెటెల్ (247) కంటే 59 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. ఆదివారం జరిగిన రేసులో వెటెల్ ఆరంభంలోనే తప్పుకున్నాడు. ఇంజిన్ మొరాయించడంతో అతను నాలుగో ల్యాపులోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెడ్‌బుల్ డ్రైవర్లు మ్యాక్స్ వెర్స్టాపెన్, డానియెల్ రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఈస్టెబన్ ఒకాన్ ఆరు... పెరెజ్ ఏడో స్థానం పొందారు. ‘రేసు చివర్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ వణికించాడు. అసాధారణ వేగంతో అతడు నన్ను చేరుకున్నాడు. ఏదేమైనా మొత్తానికి గెలిచి ఊపిరి పీల్చుకున్నాను. ఈ సీజన్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇంకా చాలా రేసులు మిగిలున్నాయి’ అని హామిల్టన్ అన్నాడు. ఈ సీజన్లో తదుపరి యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రి రేసు ఈ నెల 22న ఆస్టిన్‌లో జరుగుతుంది. -
విజేత వెర్స్టాపెన్
సెపాంగ్: ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి... చివరిదాకా దానిని కాపాడుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన కెరీర్లో రెండోసారి ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో 20 ఏళ్ల ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ నిర్ణీత 56 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 30 నిమిషాల 01.290 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగో ల్యాప్‌లో తన ఆధిక్యాన్ని వెర్‌స్టాపెన్‌కు కోల్పోయాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ ఏ దశలోనూ హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వలేదు. దాంతో తుదకు హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఫెరారి డ్రైవర్ కిమీ రైకోనెన్ ఇంజిన్‌లో సమస్య తలత్తెడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. మరోవైపు భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని సంపాదించగా... ఒకాన్ పదో స్థానాన్ని పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి 8న జరుగుతుంది. -
హామిల్టన్ ‘పోల్’ రికార్డు
ఎఫ్1 చరిత్రలో అత్యధికంగా 69 సార్లు పోల్ పొజిషన్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు మోంజా (ఇటలీ): ఫార్ములావన్ క్రీడలో శనివారం కొత్త రికార్డు నమోదైంది. మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ క్రీడా చరిత్రలో అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.554 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తాజా ప్రదర్శనతో హామిల్టన్ జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ (68 సార్లు) పేరిట ఐదేళ్లుగా ఉన్న ‘పోల్ పొజిషన్’ రికార్డును బద్దలు కొట్టాడు. తన కెరీర్లో హామిల్టన్ పోల్ పొజిషన్‌తో మొదలుపెట్టిన రేసుల్లో 37 సార్లు విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ ఐదో స్థానం నుంచి, పెరెజ్ 11వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. రికియార్డో (రెడ్‌బుల్), 4. లాన్స్ స్ట్రాల్ (విలియమ్స్), 5. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 6. బొటాస్ (మెర్సిడెస్), 7. రైకోనెన్ (ఫెరారీ), 8. వెటెల్ (ఫెరారీ), 9. మసా (విలియమ్స్), 10. వాన్డూర్నీ (మెక్లారెన్), 11. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 12. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 13. అలోన్సో (మెక్లారెన్), 14. క్వియాట్ (ఎస్టీఆర్), 15. సెయింజ్ (ఎస్టీఆర్), 16. మాగ్నుసెన్ (హాస్), 17. పాల్మెర్ (రెనౌ), 18. ఎరిక్సన్ (సాబెర్), 19. వెర్లీన్ (సాబెర్), 20. గ్రోస్యెన్ (హాస్).