మోంజా: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో ఆరో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 16 నిమిషాల 54.484 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఆరో విజయంకాగా, కెరీర్‌లో 68వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రైకోనెన్ 45వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే అదే ల్యాప్‌లో రైకోనెన్‌ను వెనక్కినెట్టి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ మూడో స్థానంలో... ఫెరారీ మరో డ్రైవర్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment