షుమాకర్‌ సరసన లూయిస్‌ హామిల్టన్‌ | Lewis Hamilton equals Michael Schumacher 91 race wins at Eifel F1 Grand Prix | Sakshi
Sakshi News home page

షుమాకర్‌ సరసన లూయిస్‌ హామిల్టన్‌

Published Mon, Oct 12 2020 5:56 AM | Last Updated on Mon, Oct 12 2020 5:56 AM

Lewis Hamilton equals Michael Schumacher 91 race wins at Eifel F1 Grand Prix - Sakshi

నుర్‌బర్‌గ్రింగ్‌ (జర్మనీ): ఈసారి అందివచ్చిన అవకాశాన్ని మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ వదులుకోలేదు. ఫార్ములావన్‌ (ఎఫ్‌1)లో అత్యధిక విజయాలు సాధించిన దిగ్గజ రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును హామిల్టన్‌ సమం చేశాడు. ఆదివారం జరిగిన జర్మనీ ఐఫెల్‌ గ్రాండ్‌ప్రి రేసులో 35 ఏళ్ల హామిల్టన్‌ చాంపియన్‌గా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్‌ నిర్ణీత 60 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఎఫ్‌1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్‌గా 2006 నుంచి మైకేల్‌ షుమాకర్‌ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్‌ సమం చేశాడు.

షుమాకర్‌ కెరీర్‌లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా... హామిల్టన్‌ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధిం చాడు.  ఈ సీజన్‌లో మరో ఆరు రేసులు మిగిలి ఉన్న నేపథ్యంలో షుమాకర్‌ రికార్డును హామిల్టన్‌ బద్దలు కొట్టడం ఖాయం. సీజన్‌ లోని తదుపరి రేసు పోర్చుగల్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 25న జరుగుతుంది.  ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్‌ జట్టుకే చెందిన మరో డ్రైవర్‌ బొటాస్‌ 13వ ల్యాప్‌ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్‌ 13వ ల్యాప్‌లో బొటాస్‌ను ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. బొటాస్‌ 18వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకోగా... అటునుంచి ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ వెనుదిరిగి చూడలేదు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. 
 
తన తండ్రి రికార్డును సమం చేసిన హామిల్టన్‌కు షుమాకర్‌ తనయుడు మిక్‌ ఓ జ్ఞాపిక ఇచ్చాడు. షుమాకర్‌ తన కెరీర్‌ చివరి సీజన్‌ (2012)లో ఉపయోగించిన హెల్మెట్‌ను హామిల్టన్‌కు మిక్‌ బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు ఈ రేసులో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ మాజీ చాంపియన్‌ కిమీ రైకోనెన్‌ (ఆల్ఫా రోమియో) అత్యధికంగా 323 ఎఫ్‌1 రేసుల్లో పాల్గొన్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. 322 రేసులతో బారికెల్లో (బ్రెజిల్‌) పేరిట ఉన్న రికార్డును రైకోనెన్‌ బద్దలు కొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement