మొనాకో: క్వాలిఫయింగ్‌లో దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదరగొట్టాడు. ఫలితంగా ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు.
ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది నాలుగో టైటిల్ కాగా... మెర్సిడెస్ జట్టుకు ఆరో విజయం కావడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లే విజేతగా నిలిచారు. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ బొటాస్ రెండు రేసుల్లో గెలిచాడు. మొనాకో విజయాన్ని ఫార్ములావన్ దిగ్గజం నికీ లాడా (ఆస్ట్రియా)కు హామిల్టన్ అంకితం ఇచ్చాడు. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నికీ లాడా గత సోమవారం మృతి చెందారు. ఈ సీజన్‌లో ఆరు రేసులు ముగిశాక హామిల్టన్ 137 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 9న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment