
సావోపాలో (బ్రెజిల్): ఫార్ములావన్ తాజా సీజన్‌లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేసి చూపించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును పదో స్థానం నుంచి ఆరంభించిన అతడు చివరకు అగ్ర స్థానంతో ముగించాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 101వ విజయం. 10.496 సెకన్లు వెనుకగా రేసును పూర్తి చేసిన వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఆరంభం నుంచే దూకుడు
రేసును పదో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఏకంగా నాలుగు కార్లను ఓవర్‌టేక్ చేసి ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. మరో ఐదు ల్యాప్‌లు పూర్తయ్యాక మూడో స్థానానికి చేరాడు. మరికాసేపటికే రెడ్‌బుల్ మరో డ్రైవర్ పెరెజ్ కారును దాటేసిన అతడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి మరింత వేగం పెంచిన హామిల్టన్ తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌కు తనకు ఉన్న అంతరాన్ని తగ్గించాడు. మరోవైపు వెర్‌స్టాపెన్ కూడా తన డిఫెన్స్ డ్రైవింగ్‌తో హామిల్టన్‌కు పరీక్ష పెట్టాడు. 48వ ల్యాప్‌లో వెర్‌స్టాపెన్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి హామిల్టన్ విఫలమయ్యాడు. ఆ సమయంలో రెండు కార్లు కూడా ఒకదానితో మరొకటి ఢీకొనేవి. అయితే హామిల్టన్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. 59వ ల్యాప్‌లో మరోసారి వెర్‌స్టాపెన్ కారును అధిగమించేందుకు ప్రయత్నించిన హామిల్టన్ ఈసారి మాత్రం సఫలమయ్యాడు. అక్కడి నుంచి మిగిలిన ల్యాప్‌లను ఎటువంటి పొరపాటు చేయకుండా పూర్తి చేసిన అతడు విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment