brazil grand prix open
-
వారెవ్వా... హామిల్టన్
సావోపాలో (బ్రెజిల్): ఫార్ములావన్ తాజా సీజన్లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేసి చూపించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును పదో స్థానం నుంచి ఆరంభించిన అతడు చివరకు అగ్ర స్థానంతో ముగించాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 101వ విజయం. 10.496 సెకన్లు వెనుకగా రేసును పూర్తి చేసిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడు రేసును పదో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఏకంగా నాలుగు కార్లను ఓవర్టేక్ చేసి ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. మరో ఐదు ల్యాప్‌లు పూర్తయ్యాక మూడో స్థానానికి చేరాడు. మరికాసేపటికే రెడ్‌బుల్ మరో డ్రైవర్ పెరెజ్ కారును దాటేసిన అతడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి మరింత వేగం పెంచిన హామిల్టన్ తొలి స్థానంలో ఉన్న వెర్‌స్టాపెన్‌కు తనకు ఉన్న అంతరాన్ని తగ్గించాడు. మరోవైపు వెర్స్టాపెన్ కూడా తన డిఫెన్స్ డ్రైవింగ్‌తో హామిల్టన్‌కు పరీక్ష పెట్టాడు. 48వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి హామిల్టన్ విఫలమయ్యాడు. ఆ సమయంలో రెండు కార్లు కూడా ఒకదానితో మరొకటి ఢీకొనేవి. అయితే హామిల్టన్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. 59వ ల్యాప్‌లో మరోసారి వెర్స్టాపెన్ కారును అధిగమించేందుకు ప్రయత్నించిన హామిల్టన్ ఈసారి మాత్రం సఫలమయ్యాడు. అక్కడి నుంచి మిగిలిన ల్యాప్‌లను ఎటువంటి పొరపాటు చేయకుండా పూర్తి చేసిన అతడు విజేతగా నిలిచాడు. -
వెల్డన్ వెర్స్టాపెన్
సావోపాలో: ఐదేళ్ల క్రితం ఫార్ములావన్‌లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాక మెర్సిడెస్ ఆధిపత్యాన్ని చూసి చూసి బోర్‌గా ఫీలవుతున్న ఫార్ములావన్ అభిమానులకు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసు అసలైన మజా ఇచ్చింది. రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచినా... ఊహకందని విధంగా టొరో రోసో (ఎస్టీఆర్) డ్రైవర్ పియర్ గ్యాస్లీ, మెక్లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్లను పోడియంపై నిలిపి అభిమానులకు కోరుకున్న వినోదాన్ని పంచింది. ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ప్రధాన రేసులో పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 14.678 సెకన్లలో రేసును ముగించి సీజన్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఆరు సెకన్ల తేడాతో రేసును ముగించిన గ్యాస్లీ రెండో స్థానంలో నిలువగా... చివరి నుంచి మొదలు పెట్టిన సెయింజ్‌కు మెర్సిడెస్ డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ పెనాల్టీతో పాటు అదృష్టం కలిసిరావడంతో మూడో స్థానంలో నిలిచాడు. గ్యాస్లీ, కార్లోస్ సెయింజ్లకు ఫార్ములావన్‌లో ఇదే తొలి పోడియం కావడం విశేషం. 2014 ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో పోడియం సాధించిన మెక్‌లారెన్‌కు మళ్లీ ఆ భాగ్యం ఇప్పుడు దక్కింది. 70వ ల్యాప్‌లో ఆల్బన్ (రెడ్‌బుల్)ను ఢీకొట్టిన హామిల్టన్‌కు రేసు స్టీవర్డ్స్ 5 సెకన్ల పెనాల్టీని విధించారు. దీంతో అతడు రేసును మూడో స్థానంలో ముగించినా... పెనాల్టీ కారణంగా ఏడో స్థానానికి పడిపోయాడు. అల్ఫా రొమెయో డ్రైవర్లు రైకోనెన్, అంటోనియో జివనాంజీలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 66వ ల్యాప్‌లో ఫెరారీ కార్లు ఒకదానితో మరొకటి ఢీకొని రేసు నుంచి వైదొలిగాయి. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ కూడా ఇంజిన్ సమస్యతో రేసు మధ్యలోనే నిష్క్రమించాడు. ఇప్పటికే 387 పాయింట్లతో హామిల్టన్ ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం చేసుకోగా... సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1న జరుగుతుంది. -
శభాష్ పవార్..
ఫోజ్ డో ఇగుకు(బ్రెజిల్): బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆద్యంత ఆద్భుత ప్రతిభ కనబరిచిన భారత ఆటగాడు ఆనంద్ పవార్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాల్గో సీడ్ పవార్ 21-8, 21-10 తేడాతో అన్ సీడెడ్ బీఆర్ సంకీర్త్(కెనడా)పై గెలిచి సెమీస్ కు చేరాడు. 2015లో స్విస్ అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్ కు చేరిన తరువాత ఆనంద్ పవార్ కు ఇదే తొలి సెమీ ఫైనల్. తొలి రౌండ్లో 21-6, 21-7 తేడాతో బ్రెజిల్ ఆటగాడు మాథ్యూస్ వైగ్ట్ను మట్టికరిపించిన పవార్.. రెండో రౌండ్లో 21-8, 21-8 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు విల్సన్‌పై విజయం సాధించాడు. ఈ ఏడాది సెమీస్ కు చేరడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన పవార్.. తన తదుపరి పోరులో రెండో సీడ్, ఇజ్రాయిల్ ఆటగాడు మిషా జిల్బర్ మెన్‌తో తలపడతాడు. ఇదిలా ఉండగా, మిక్స్డ్ డబుల్స్ లో సిక్కి రెడ్డి- చోప్రా జంట కూడా సెమీస్ కు చేరింది. ఈ జోడి 21-18, 21-11 తేడాతో ఆతిథ్య బ్రెజిల్ జంట మాథ్యూస్ వైగ్ట్- బియానికా ఓలివిరియా లిమాపై గెలిచి సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ జంట తమ ఫైనల్ బెర్తు కోసం జర్మనీ ద్వయం ఫబియన్ హోల్జర్-బార్బరా బెల్లింగ్ బర్గ్లతో తలపడనుంది.