సావోపాలో: ఐదేళ్ల క్రితం ఫార్ములావన్‌లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టాక మెర్సిడెస్ ఆధిపత్యాన్ని చూసి చూసి బోర్‌గా ఫీలవుతున్న ఫార్ములావన్ అభిమానులకు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసు అసలైన మజా ఇచ్చింది. రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచినా... ఊహకందని విధంగా టొరో రోసో (ఎస్టీఆర్) డ్రైవర్ పియర్ గ్యాస్లీ, మెక్‌లారెన్ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్‌లను పోడియంపై నిలిపి అభిమానులకు కోరుకున్న వినోదాన్ని పంచింది. ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ప్రధాన రేసులో పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్ అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 14.678 సెకన్లలో రేసును ముగించి సీజన్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఆరు సెకన్ల తేడాతో రేసును ముగించిన గ్యాస్లీ రెండో స్థానంలో నిలువగా... చివరి నుంచి మొదలు పెట్టిన సెయింజ్‌కు మెర్సిడెస్ డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ పెనాల్టీతో పాటు అదృష్టం కలిసిరావడంతో మూడో స్థానంలో నిలిచాడు.
గ్యాస్లీ, కార్లోస్ సెయింజ్‌లకు ఫార్ములావన్‌లో ఇదే తొలి పోడియం కావడం విశేషం. 2014 ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో పోడియం సాధించిన మెక్‌లారెన్‌కు మళ్లీ ఆ భాగ్యం ఇప్పుడు దక్కింది. 70వ ల్యాప్‌లో ఆల్బన్ (రెడ్‌బుల్)ను ఢీకొట్టిన హామిల్టన్‌కు రేసు స్టీవర్డ్స్ 5 సెకన్ల పెనాల్టీని విధించారు. దీంతో అతడు రేసును మూడో స్థానంలో ముగించినా... పెనాల్టీ కారణంగా ఏడో స్థానానికి పడిపోయాడు. అల్ఫా రొమెయో డ్రైవర్లు రైకోనెన్, అంటోనియో జివనాంజీలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 66వ ల్యాప్‌లో ఫెరారీ కార్లు ఒకదానితో మరొకటి ఢీకొని రేసు నుంచి వైదొలిగాయి. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ కూడా ఇంజిన్ సమస్యతో రేసు మధ్యలోనే నిష్క్రమించాడు. ఇప్పటికే 387 పాయింట్లతో హామిల్టన్ ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం చేసుకోగా... సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి డిసెంబర్ 1న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment