సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో విజయాలు దక్కించుకున్న మెర్సిడెస్ జట్టుకు రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ షాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్) విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో జరిగిన ఈ రేసులో నిర్ణీత 52 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ గంటా 19 నిమిషాల 41.993 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో... వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన 22 ఏళ్ల వెర్‌స్టాపెన్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లాడు.
ఆ తర్వాత బొటాస్, హామిల్టన్, వెర్‌స్టాపెన్‌ల మధ్య ఆధిక్యం దోబూచులాడినా... రేసు ముగియడానికి 11 ల్యాప్‌లు ఉన్నాయనగా వెర్‌స్టాపెన్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. చివరిదాకా దీనిని కాపాడుకొని ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా వెర్‌స్టాపెన్ కెరీర్‌లో ఇది తొమ్మిదో ఎఫ్1 టైటిల్. తొలి రేసులో బొటాస్ నెగ్గగా... తర్వాతి మూడు రేసుల్లో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. తాజా రేసులో రెండో స్థానంలో నిలువడం ద్వారా హామిల్టన్ కెరీర్‌లో 155వ సారి పోడియం (టాప్–3) ఫినిష్ సాధించాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఈ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి ఈనెల 14న బార్సిలోనాలో జరుగుతుంది. సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో హామిల్టన్ (107 పాయింట్లు), వెర్‌స్టాపెన్ (77 పాయింట్లు), బొటాస్ (73 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఫార్ములావన్ 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసు ఫలితాలు (టాప్–10): 1. మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 2. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 3. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), 4. చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 7. హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 8. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 9. లాండో నోరిస్ (మెక్‌లారెన్), 10. క్వియాట్ (అల్ఫా టౌరి).
Comments
Please login to add a commentAdd a comment