Grand prix title
-
Max Verstappen: ఎఫ్1లో సంచలనం.. తొలిసారి చాంపియన్‌గా..
Max Verstappen wins Abu Dhabi Grand Prix, beats Lewis Hamilton: గత నాలుగు సీజన్లలో ఎదురులేని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆధిపత్యానికి గండికొడుతూ ఫార్ములావన్ (ఎఫ్1)లో మాక్స్ వెర్స్టాపెన్ రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ ఆఖరి ల్యాప్‌లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో ఏడు ప్రపంచ టైటిల్స్ తో జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన హామిల్టన్ మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. అబుదాబి: ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నిరూపించాడు. బ్లాక్ బాస్టర్ సినిమాను తలపించిన 2021 ఎఫ్1 సీజన్ వివాదాస్పదంగా ముగిసింది. డ్రైవర్ చాంపియన్‌షిప్‌ను తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రిలో 58 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్స్టాపెన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 57వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్‌లో వెనుకబడిన హామిల్టన్ (బ్రిటన్) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్ కొంపముంచిన సేఫ్టీ కార్... రెండో స్థానం నుంచి రేసును మొదలు పెట్టిన హామిల్టన్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి రేసులో ఆధిక్యంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అద్భుతంగా డ్రైవ్ చేసిన హామిల్టన్ వెర్‌స్టాపెన్‌కు అందకుండా దూసుకెళ్లాడు. ల్యాప్ ల్యాప్నకు రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్తో అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక ఎనిమిదో డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం అనుకున్న తరుణంలో ‘సేఫ్టీ కార్’ ట్విస్ట్ హామిల్టన్ ఆశలపై నీళ్లు చల్లింది. 53వ ల్యాప్‌లో విలియమ్స్ డ్రైవర్ నికోలస్ లతీఫీ కారు ప్రమాదానికి గురికావడంతో రేసు స్టీవర్డ్స్ సేఫ్టీ కారును ట్రాక్ మీదకు పంపారు. ఇదే సమయంలో పిట్లోకి వచ్చిన వెర్స్టాపెన్ టైర్లను మార్చుకొని మళ్లీ ట్రాక్‌పై హామిల్టన్ వెనకగా రెండో స్థానంలో నిలిచాడు. 53వ ల్యాప్ ముందు వరకు హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య 11 ఉన్న సెకన్ల గ్యాప్ .... 57వ ల్యాప్‌లో సెకను కంటే తక్కువకు తగ్గింది. చివరి ల్యాప్‌లో రేసు మరోసారి ఆరంభం కాగా... రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్ తన కారుకు ఉన్న కొత్త టైర్ల సాయంతో ఐదో మలుపు వద్ద హామిల్టన్‌ను అధిగమించి విజేతగా నిలవడంతో పాటు డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ నిరసన... రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్‌కు మెర్సిడెస్ ఫిర్యాదు కూడా చేసింది. 53వ ల్యాప్‌లో సేఫ్టీ కారు ట్రాక్‌పైకి రాగా... ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత ల్యాప్డ్ (ఒక ల్యాప్ తక్కువగా పూర్తి చేసిన కార్లు) కార్లు అన్‌ల్యాప్ కాకూడదంటూ ఆదేశాలు జారీ చేసి... అనంతరం అన్‌ల్యాప్ చేయొచ్చుంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాంతో హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య ఉన్న ఐదు ల్యాప్డ్ కార్లు హామిల్టన్‌ను దాటుకుంటూ వెళ్లాయి. అదే సమయంలో సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లి రేసును మళ్లీ ఆరంభించాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. సేఫ్టీ కారు వచ్చే సమయానికి మొత్తం ఎనిమిది ల్యాప్డ్ కార్లు ట్రాక్‌పై ఉన్నాయి. కేవలం ఐదు కార్లకు మాత్రమే అన్‌ల్యాప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి మిగిలిన మూడు కార్లకు ఎందుకు కల్పించలేదంటూ మెర్సిడెస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్ కార్లు అన్‌ల్యాప్ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్‌ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్ ఫిర్యాదును స్టీవర్డ్స్ తోసిపుచ్చి వెర్స్టాపెన్ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి... ఎఫ్1 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్ 613.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఎఫ్1కు కిమీ రైకొనెన్ గుడ్‌బై అబుదాబి గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌కు ఫిన్లాండ్ డ్రైవర్ కిమీ రైకొనెన్ గుడ్‌బై చెప్పాడు. 2001లో సాబర్ జట్టు ద్వారా ఎఫ్1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్... మెక్లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్‌లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్‌గా 2007లో డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ గెలిచిన రేసుల సంఖ్య. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్ (రెడ్‌బుల్), ఒకాన్ (అల్పైన్ రెనౌ), రికియార్డో (మెక్లారెన్), బొటాస్ (మెర్సిడెస్) ఒక్కో రేసులో గెలిచారు. The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
ఫార్ములా వన్ రేసింగ్‌లో సంచలనం..
Max Verstappen Wins Formula One Title: ఫార్ములా వన్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం నమోదైంది. రెడ్ బుల్స్‌కి చెందిన డ్రైవర్ మ్యాక్స్ వెర్ట్సాపెన్ తన మొట్టమొదటి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సడెజ్కి చెందిన రేసర్, ఏడుసార్లు ఛాంపియన్ అయిన లూయిస్ హామిల్టన్ని ఆఖరి లాప్‌లో ఓడించి, అబుదాబీ గ్రాండ్ ప్రీ 2021 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. MAX VERSTAPPEN. WORLD CHAMPION!!! A stunning season by an extraordinary talent#HistoryMade #F1 @Max33Verstappen pic.twitter.com/FxT9W69xJe — Formula 1 (@F1) December 12, 2021 హోరాహోరీ సాగిన రేస్‌లో ఓ దశలో ఇద్దరు రేసర్లు చెరో 369.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి లాప్‌ను ప్రత్యర్థి కంటే 1.22.09 సెకన్లు ముందుగా ముగించిన 24 ఏళ్ల మ్యాక్స్ వెర్ట్సాపెన్ చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. చదవండి: Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..! -
హై హై హామిల్టన్...
ఇస్తాంబుల్: ఫార్ములావన్ (ఎఫ్1) క్రీడలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్లో మరో మైలురాయి అందుకున్నాడు. ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న మరో రికార్డును ఈ మెర్సిడెస్ డ్రైవర్ సమం చేశాడు. ఆదివారం జరిగిన టర్కీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల ఈ రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన హామిల్టన్ అందరికంటే వేగంగా గంటా 42 నిమిషాల 19.313 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది పదో విజయంకాగా... కెరీర్లో 94వ విజయం. తాజా గెలుపుతో ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే 35 ఏళ్ల హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌నూ సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది ఏడో ప్రపంచ టైటిల్. తద్వారా ఏడు ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. 2013లో మెర్సిడెస్ జట్టులో షుమాకర్ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్ అదే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆరుసార్లు ప్రపంచ టైటిల్‌ను దక్కించుకోగా... 2008లో మెక్లారెన్ తరఫున పోటీపడి హామిల్టన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్నాడు. ఇటీవలే అత్యధికసార్లు ఎఫ్1 రేసుల్లో విజేతగా నిలిచిన షుమాకర్ (91 సార్లు) రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మెర్సిడెస్‌కే చెందిన తన సహచరుడు వాల్తెరి బొటాస్ కంటే ముందుగా నిలిస్తే ప్రపంచ టైటిల్‌ను ఖాయం చేసుకునే పరిస్థితిలో ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ఇతర డ్రైవర్ల వ్యూహాత్మక తప్పిదాలు కలిసొచ్చాయి. ఆరంభంలో దూకుడు కనబర్చని హామిల్టన్ సగం ల్యాప్‌లు పూర్తయ్యాక జోరు పెంచాడు. 35వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు కాపాడుకొని ఏకంగా 31 సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్) రెండో స్థానంలో... సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ‘పోల్పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ సహచరుడు బొటాస్ 14వ స్థానంలో నిలిచాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో ముగ్గురు రేసును ముగించలేకపోయారు. మొత్తం 17 రేసుల ఈ సీజన్లో 14 రేసులు పూర్తయ్యాక... హామిల్టన్ 307 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. 197 పాయింట్లతో బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... 170 పాయింట్లతో వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. అత్యధిక ఎఫ్1 ప్రపంచ టైటిల్స్ నెగ్గిన డ్రైవర్లు హామిల్టన్ (బ్రిటన్–7): 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020 షుమాకర్ (జర్మనీ–7) : 1994, 1995, 2000, 2001, 2002, 2003, 2004 ఫాంగియో (అర్జెంటీనా–5): 1951, 1954, 1955, 1956, 1957 అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్–4) : 1985, 1986, 1989, 1993 సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ–4): 2010, 2011, 2012, 2013 ఏదీ అసాధ్యం కాదు. మీ కలలను సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తూ ఉండాలి. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ కాగలనని నేను అన్నప్పుడు అందరూ అసాధ్యమని అన్నారు. కానీ నేను సాధించి చూపించాను. రంగం ఏదైనా ఓటమి ఎదురైతే బాధపడకూడదు. అనుక్షణం పోరాడుతూనే ఉండాలి. చివరికి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. మైకేల్ షుమాకర్ ప్రపంచ రికార్డును సమం చేయడంతో అందరి దృష్టి నాపై పడింది. అయితే ఎల్లప్పుడూ నేను ఈ క్రీడలో ఉండనని గమనించాలి. ఈ క్షణంలో అందరితో నేను కోరేది ఒక్కటే... ప్రపంచంలో సమానత్వం కోసం మీ వంతుగా కృషి చేయండి. వర్ణం, హోదా, నేపథ్యం చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించండి. –హామిల్టన్ -
వెల్డన్... వెర్స్టాపెన్
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో విజయాలు దక్కించుకున్న మెర్సిడెస్ జట్టుకు రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ షాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన ఫార్ములావన్ (ఎఫ్1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరిగిన ఈ రేసులో నిర్ణీత 52 ల్యాప్‌లను వెర్స్టాపెన్ గంటా 19 నిమిషాల 41.993 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో... వాల్తెరి బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానం నుంచి రేసును ప్రారంభించిన 22 ఏళ్ల వెర్స్టాపెన్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత బొటాస్, హామిల్టన్, వెర్‌స్టాపెన్‌ల మధ్య ఆధిక్యం దోబూచులాడినా... రేసు ముగియడానికి 11 ల్యాప్‌లు ఉన్నాయనగా వెర్స్టాపెన్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. చివరిదాకా దీనిని కాపాడుకొని ఈ సీజన్లో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది తొమ్మిదో ఎఫ్1 టైటిల్. తొలి రేసులో బొటాస్ నెగ్గగా... తర్వాతి మూడు రేసుల్లో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. తాజా రేసులో రెండో స్థానంలో నిలువడం ద్వారా హామిల్టన్ కెరీర్లో 155వ సారి పోడియం (టాప్–3) ఫినిష్ సాధించాడు. ఈ క్రమంలో మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఈ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి ఈనెల 14న బార్సిలోనాలో జరుగుతుంది. సీజన్లో ఐదు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో హామిల్టన్ (107 పాయింట్లు), వెర్స్టాపెన్ (77 పాయింట్లు), బొటాస్ (73 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఫార్ములావన్ 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసు ఫలితాలు (టాప్–10): 1. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 2. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 3. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), 4. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 7. హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 8. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 9. లాండో నోరిస్ (మెక్లారెన్), 10. క్వియాట్ (అల్ఫా టౌరి). -
బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి రేసును ముగించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. -
హామిల్టన్ హవా
సింగపూర్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సింగపూర్: క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సీజన్లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 60 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టి 2 గంటల 4.795 సెకన్లలో పూర్తి చేశాడు. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ కారులో సాంకేతిక సమస్యల కారణంగా 14వ ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ ప్రపంచ మాజీ చాంపియన్‌కు రేసులో ఎదురులేకుండాపోయింది. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్) 2 గంటల 18.329 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. గత ఐదేళ్లుగా సింగపూర్ గ్రాండ్‌ప్రిలో వెటెల్ టాప్-3లో ఉంటున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు కలిసొచ్చింది. ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానంలో రేసును ముగించారు. తాజా విజయంతో హామిల్టన్ ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రస్తుతం హామిల్టన్ 241 పాయింట్లతో తొలి స్థానంలో... నికో రోస్‌బర్గ్ 238 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. రికియార్డో (రెడ్‌బుల్-181 పాయింట్లు), అలోన్సో (ఫెరారీ-133 పాయింట్లు), వెటెల్ (124 పాయింట్లు) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. సీజన్లో మరో ఐదు రేసులు మిగిలి ఉన్నాయి. ఈ రేసుల ద్వారా గరిష్టంగా 150 పాయింట్లు సంపాదించే అవకాశం ఉంది. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో మెర్సిడెస్ (479 పాయింట్లు), రెడ్‌బుల్ (305 పాయింట్లు), విలియమ్స్ (187 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి అక్టోబరు 5న జరుగుతుంది. -
హామిల్టన్ దూకుడు
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం తొలి రెండు స్థానాలు మెర్సిడెస్వే ‘ఫోర్స్’కు మిశ్రమ ఫలితాలు మోంజా (ఇటలీ): ఆరంభంలో చేసిన పొరపాటును అవకాశం వచ్చినపుడు సరిదిద్దుకోవడంతో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్న ఫలితం సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 19 నిమిషాల 10.236 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్ ప్రారంభంలో కాస్త నెమ్మదించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన రోస్‌బర్గ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే తన తప్పిదాన్ని తెలుసుకున్న హామిల్టన్ వెంటనే దూకుడు పెంచి రోస్బర్గ్ను వెంబడించాడు. హామిల్టన్ మళ్లీ ఆధిక్యంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన రోస్‌బర్గ్ 29వ ల్యాప్‌లో ఒత్తిడికి లోనయ్యాడు. నేరుగా ట్రాక్‌పై నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గంగుండా ముందుకు వెళ్లాలని చూశాడు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. హామిల్టన్ వేగాన్ని పెంచి నేరుగా ట్రాక్ మీదుగా దూసుకెళ్లి రోస్బర్గ్ను దాటుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి హామిల్టన్ వెనుదిరిగి చూడలేదు. రోస్‌బర్గ్ ఎంతగా ప్రయత్నించినా మళ్లీ ఆధిక్యంలోకి రాలేకపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సెర్గియో పెరెజ్ ఏడో స్థానాన్ని సంపాదించగా... హుల్కెన్‌బర్గ్ 12వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
రికియార్డో హవా
హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో విజయం ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ బుడాపెస్ట్: ఈ సీజన్లో జోరుమీదున్న రోస్‌బర్గ్, హామిల్టన్‌ల దూకుడుకు కళ్లెం వేస్తూ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ రికియార్డో ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో రికియార్డో విజేతగా అవతరించాడు. 70 ల్యాప్‌ల రేసును రికియార్డో గంటా 53 నిమిషాల 05.058 సెకన్లలో ముగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలోన్సో రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్‌కు మూడో స్థానం దక్కింది. హోరాహోరీగా సాగిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశనే మిగిల్చింది. ‘ఫోర్స్’ ఇద్దరు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ ప్రమాదాల కారణంగా వరుసగా 14వ, 22వ ల్యాప్‌ల్లో రేసు నుంచి తప్పుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 24న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (202 పాయింట్లు) ఆధిక్యంలో కొనసాగుతుండగా... హామిల్టన్ (191 పాయింట్లు) రెండో స్థానంలో, రికియార్డో (131 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ (393 పాయింట్లు), రెడ్‌బుల్ (219 పాయింట్లు), ఫెరారీ (142 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
ఆరేళ్ల తర్వాత... అదే తేదీన
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్ సీజన్లో ఐదో విజయం సిల్వర్‌స్టోన్: సొంతగడ్డపై లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జూలై 6న తొలిసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన ఈ బ్రిటన్ డ్రైవర్... అదే ఫలితాన్ని, అదే తేదీన 2014లో పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి 52 ల్యాప్‌లను 2 గంటల 26 నిమిషాల 52.094 సెకన్లలో పూర్తి చేశాడు. ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ 29వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ దూసుకుపోయాడు. చివరికి 30 సెకన్ల తేడాతో విజయాన్ని దక్కించుకొని సీజన్లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 28 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే హఠాత్తుగా అతని గేర్‌బాక్స్‌లో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ 28వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. రేసు ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే ఫెలిప్ మసా (విలియమ్స్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) నియంత్రణ కోల్పోయి ట్రాక్‌పై పరస్పరం ఢీకొట్టుకోవడంతో గంటపాటు రేసును నిలిపివేశారు. రేసు పునః ప్రారంభమయ్యాక హామిల్టన్, రోస్‌బర్గ్ హోరాహోరీగా పోటీపడినా తుదకు హామిల్టన్ పైచేయి సాధించాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది.