హామిల్టన్ హవా | Hamilton Hawa | Sakshi
Sakshi News home page

హామిల్టన్ హవా

Published Mon, Sep 22 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

హామిల్టన్ హవా

సింగపూర్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
 
 సింగపూర్: క్వాలిఫయింగ్ సెషన్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సీజన్‌లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 60 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో మొదలుపెట్టి 2 గంటల 4.795 సెకన్లలో పూర్తి చేశాడు. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ కారులో సాంకేతిక సమస్యల కారణంగా 14వ ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ ప్రపంచ మాజీ చాంపియన్‌కు రేసులో ఎదురులేకుండాపోయింది. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్) 2 గంటల 18.329 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. గత ఐదేళ్లుగా సింగపూర్ గ్రాండ్‌ప్రిలో వెటెల్ టాప్-3లో ఉంటున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు కలిసొచ్చింది. ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానంలో రేసును ముగించారు.
 తాజా విజయంతో హామిల్టన్ ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రస్తుతం హామిల్టన్ 241 పాయింట్లతో తొలి స్థానంలో... నికో రోస్‌బర్గ్ 238 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. రికియార్డో (రెడ్‌బుల్-181 పాయింట్లు), అలోన్సో (ఫెరారీ-133 పాయింట్లు), వెటెల్ (124 పాయింట్లు) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లో మరో ఐదు రేసులు మిగిలి ఉన్నాయి. ఈ రేసుల ద్వారా గరిష్టంగా 150 పాయింట్లు సంపాదించే అవకాశం ఉంది. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో మెర్సిడెస్ (479 పాయింట్లు), రెడ్‌బుల్ (305 పాయింట్లు), విలియమ్స్ (187 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి అక్టోబరు 5న జరుగుతుంది.
 



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement