హామిల్టన్ దూకుడు
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
తొలి రెండు స్థానాలు మెర్సిడెస్‌వే
‘ఫోర్స్’కు మిశ్రమ ఫలితాలు
మోంజా (ఇటలీ): ఆరంభంలో చేసిన పొరపాటును అవకాశం వచ్చినపుడు సరిదిద్దుకోవడంతో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్న ఫలితం సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 19 నిమిషాల 10.236 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
‘పోల్ పొజిషన్’ నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్ ప్రారంభంలో కాస్త నెమ్మదించడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన రోస్‌బర్గ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే తన తప్పిదాన్ని తెలుసుకున్న హామిల్టన్ వెంటనే దూకుడు పెంచి రోస్‌బర్గ్‌ను వెంబడించాడు. హామిల్టన్ మళ్లీ ఆధిక్యంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన రోస్‌బర్గ్ 29వ ల్యాప్‌లో ఒత్తిడికి లోనయ్యాడు. నేరుగా ట్రాక్‌పై నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గంగుండా ముందుకు వెళ్లాలని చూశాడు.
అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. హామిల్టన్ వేగాన్ని పెంచి నేరుగా ట్రాక్ మీదుగా దూసుకెళ్లి రోస్‌బర్గ్‌ను దాటుకొని ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి హామిల్టన్ వెనుదిరిగి చూడలేదు. రోస్‌బర్గ్ ఎంతగా ప్రయత్నించినా మళ్లీ ఆధిక్యంలోకి రాలేకపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సెర్గియో పెరెజ్ ఏడో స్థానాన్ని సంపాదించగా... హుల్కెన్‌బర్గ్ 12వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది.