రికియార్డో హవా
హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సీజన్‌లో రెండో విజయం
‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ
బుడాపెస్ట్: ఈ సీజన్‌లో జోరుమీదున్న రోస్‌బర్గ్, హామిల్టన్‌ల దూకుడుకు కళ్లెం వేస్తూ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ రికియార్డో ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో రికియార్డో విజేతగా అవతరించాడు. 70 ల్యాప్‌ల రేసును రికియార్డో గంటా 53 నిమిషాల 05.058 సెకన్లలో ముగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలోన్సో రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్‌కు మూడో స్థానం దక్కింది. హోరాహోరీగా సాగిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు.
‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశనే మిగిల్చింది. ‘ఫోర్స్’ ఇద్దరు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ ప్రమాదాల కారణంగా వరుసగా 14వ, 22వ ల్యాప్‌ల్లో రేసు నుంచి తప్పుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 24న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (202 పాయింట్లు) ఆధిక్యంలో కొనసాగుతుండగా... హామిల్టన్ (191 పాయింట్లు) రెండో స్థానంలో, రికియార్డో (131 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ (393 పాయింట్లు), రెడ్‌బుల్ (219 పాయింట్లు), ఫెరారీ (142 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.