Nico rosberg
-
హామిల్టన్‌పైనే అందరి దృష్టి
నేటి నుంచి ఫార్ములావన్–2017 సీజన్ మెల్బోర్న్: గత ఏడాది సహచరుడు నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్)కు టైటిల్ సమర్పించుకున్న లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2017 ఫార్ములావన్ సీజన్‌కు శనివారం జరిగే తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌తో తెర లేవనుంది. ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. 2008, 2014, 2015లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌కు గత ఏడాది నికో రోస్‌బర్గ్ షాక్ ఇచ్చాడు. ఓవరాల్‌గా రోస్‌బర్గ్ 385 పాయింట్లు సాధించి విజేతగా నిలువగా... హామిల్టన్ 380 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే రోస్‌బర్గ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సంవత్సరం హామిల్టన్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. మాజీ చాంపియన్స్ సెబాస్టియన్ వెటెల్, కిమీ రైకోనెన్ (ఫెరారీ) నుంచి హామిల్టన్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు తరఫున సెర్గియో పెరెజ్, ఎస్టెబెన్ ఒకాన్ బరిలోకి దిగనున్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో గత ఏడాది ఫోర్స్ ఇండియా 178 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కార్లు, వాటి టైర్ల వెడల్పును పెంచడం, ఇంధనం పరిమితిని పెంచడం... ఇతరత్రా మార్పులతో కొత్త సీజన్ మరింత ఆసక్తి రేకెత్తించనుంది. మొత్తం 20 రేసులు ఉన్న 2017 ఎఫ్1 సీజన్ ఈనెల 26న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో మొదలై నవంబరు 26న అబుదాబి గ్రాండ్‌ప్రితో ముగుస్తుంది. 2017 ఎఫ్1 షెడ్యూల్ మార్చి 26: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి; ఏప్రిల్ 9: చైనా గ్రాండ్‌ప్రి; ఏప్రిల్ 16: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి; ఏప్రిల్ 30: రష్యా గ్రాండ్‌ప్రి; మే 14: స్పెయిన్ గ్రాండ్‌ప్రి; మే 28: మొనాకో గ్రాండ్‌ప్రి; జూన్ 11: కెనడా గ్రాండ్‌ప్రి; జూన్ 25: అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి; జూలై 9: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి; జూలై 16: బ్రిటిష్ గ్రాండ్‌ప్రి; జూలై 30: హంగేరి గ్రాండ్‌ప్రి; ఆగస్టు 27: బెల్జియం గ్రాండ్‌ప్రి; సెప్టెంబరు 3: ఇటలీ గ్రాండ్‌ప్రి; సెప్టెంబరు 17: సింగపూర్ గ్రాండ్‌ప్రి; అక్టోబరు 1: మలేసియా గ్రాండ్‌ప్రి; అక్టోబరు 8: జపాన్ గ్రాండ్‌ప్రి; అక్టోబరు 22: అమెరికా గ్రాండ్‌ప్రి; అక్టోబరు 29: మెక్సికో గ్రాండ్‌ప్రి; నవంబరు 12: బ్రెజిల్ గ్రాండ్‌ప్రి; నవంబరు 26: అబుదాబి గ్రాండ్‌ప్రి. -
'ఆ నిర్ణయం ఆశ్చర్యపరచలేదు'
వియన్నా:సహచర ఫార్ములావన్ డ్రైవర్, ఎఫ్1 విశ్వవిజేత నికో రోస్ బర్గ్ వీడ్కోలు నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ తనను పెద్దగా ఆశ్చర్యపరచలేదని బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ స్పష్టం చేశాడు. సుదీర్ఘ కాలం నుంచి అతను ఫార్ములావన్ రేసులో ఉన్న విషయం తనకు తెలుసని, అందుచేత ఆ ఆకస్మిక నిర్ణయం తనను ఆశ్చర్యపరచకపోవడానికి కారణం కావొచ్చన్నాడు. అయితే వచ్చే ఏడాది తమతో పాటు రోస్ బర్గ్ రేసులో పాల్గొనడం లేదనే ఒక్క విషయం మాత్రం బాధిస్తుందన్నాడు.కచ్చితంగా రోస్ బర్గ్ ను మిస్ అవుతున్నామన్న హామిల్టన్.. అతను భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే ఫార్ములావన్‌కు గుడ్ బై చెప్పుంటాడని అనుకుంటున్నట్లు హామిల్టన్ అన్నాడు. ఫార్ములావన్‌లో ఉండాలంటే ఎక్కువ సమయం ఆ క్రీడకే కేటాయించక తప్పదనే విషయం అంగీకరించక తప్పదన్నాడు. -
నికో రోస్ బర్గ్ సంచలన నిర్ణయం
ఎలా సాధించామన్నది కాదు.. సాధించామా? లేదా? అన్నది ముఖ్యం. ఫార్ములావన్ డ్రైవర్ నికో రోస్ బర్గ్‌కు సరిపోయే డైలాగ్ ఇది. ప్రత్యర్థి నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా చివరి వరకూ పోరాటం సాగించటమనేది ఈ జర్మన్ డ్రైవర్ రోస్ బర్గ్ తెలిసిన విద్య. అదే అతన్ని ప్రపంచ చాంపియన్ చేసింది. ఈ ఏడాది ఫార్ములావన్ చాంపియన్‌లో కడవరకూ పోరాటం సాగించిన రోస్ బర్గ్.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచాడు. మెర్సిడెస్ జట్టుకు ప్రాతినిథ్య వహించిన రోస్ బర్గ్.. సహచర డ్రైవర్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌ను సైతం పక్కకు నెట్టి చాంపియన్ గా అవతరించాడు. సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు ఫార్ములా వన్ టైటిల్స్ గెలిచి మంచి జోరు కనబరిచిన రోస్ బర్గ్.. చివరి నాలుగు రేసుల్లో రెండో స్థానంలో నిలిచి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్ వరల్డ్ చాంపియన్ గా నిలవడమే తన కల అన్న రోస్ బర్గ్.. ఇక చాలంటూ ఆ గేమ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఐదు రోజుల క్రితం విశ్వవిజేతగా నిలిచిన రోస్ బర్గ్ ..ఇక ఆ గేమ్‌లో తాను సాధించాల్సింది ఏమీ లేదంటూ పేర్కొంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. తాను చిన్నతనం నుంచి రేస్‌లోనే ఉన్నానని, ఒకటి మాత్రం తనను చాంపియన్‌ను చేసిందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. తాను ప్రపంచ చాంపియన్ గా నిలవడం వెనుక ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు ఉన్నాయన్నాడు. ఇక తన పర్వతాన్ని ఎక్కేసిన తరువాత సాధించడానికి ఏమీ మిగలని కారణంగానే వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించినట్లు రోస్ బర్గ్ తెలిపాడు. గత నెల 27వ తేదీన జరిగిన సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్ మొత్తం 385 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినా... రోస్‌బర్గ్ టాప్-3లో నిలువడంతో ఈ బ్రిటన్ డ్రైవర్ ఓవరాల్‌గా 380 పాయిట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నిరంతర కృషి 2006లో బెహ్రయిన్ గ్రాండ్ ప్రి ద్వారా అంతర్జాతీయ ఫార్ములావన్లోకి అడుగుపెట్టిన రోస్ బర్గ్ ప్రపంచ చాంపియన్ గా నిలవడానికి విపరీతంగా కష్టించాడనే చెప్పొచ్చు. తొలి గ్రాండ్ ప్రి టైటిల్ ను అందుకోవడానికి రోస్ బర్గ్ కు ఆరు సంవత్సారాలు పట్టింది. 2012లో చైనీస్ గ్రాండ్ ప్రిను అందుకోవడం ద్వారా తొలి టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్న రోస్ బర్గ్ తన జైత్రయాత్రకు పునాది వేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన జపానీస్ గ్రాండ్ ప్రి టైటిల్ అతని కెరీర్లో చివరి విజయం కాగా, అబుదాబి గ్రాండ్ ప్రి అతని ఆఖరి ఎంట్రీ. తన సుదీర్ఘ పోరాటంలో 23 టైటిల్స్ ను రోస్ బర్గ్ సొంతం చేసుకున్నాడు.ఇందులో పోల్ పొజిషన్ సాధించనవి 30 ఉండగా, ఫాస్టెస్ట్ ల్యాప్స్ 20 ఉన్నాయి. ఇదిలా ఉండగా, పోడియం పొజిషన్ సాధించినవి 57. -
రోస్‌బర్గ్ కు హామిల్టన్ వార్నింగ్!
సావో పాలో:ఈ ఏడాది ఫార్ములావన్‌లో విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తికర పోరు సాగుతోంది. ఒకవైపు పాయింట్ల పరంగా మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ అగ్రస్థానంలో ఉంటే, మరొకవైపు సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుస విజయాలతో దుమ్ములేపుతున్నాడు. దాంతో ఈనెల 27న అబుదాబిలో జరిగే సీజన్ చివరి రేసు వరకూ ప్రపంచ చాంపియన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆదివారం జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచిన హామిల్టన్ కు ఇది వరుసగా హ్యాట్రిక్ విజయం కావడంతో విశ్వవిజేత పోరు రసవత్తరంగా మారింది. ఈ తరుణంలో రోస్ బర్గ్..కాచుకో అంటూ హామిల్టన్ వార్నింగ్ ఇచ్చాడు. 'నేను టైటిల్ వేటలోకి వచ్చేశా. ప్రపంచ చాంపియన్ సాధించడం కోసం నాశాయ శక్తులా ప్రయత్నిస్తా. ఐదు అంతకంటే ఎక్కువ సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవాలనేది నా కల. ఈ పరిస్థితుల్లో ఎటువంటి తప్పిదాలు చేయదలుచుకోలేదు. విజయంపైనే గురి. నా జట్టు నాకు ఇచ్చిన కారు చాలా బాగుంది. అది ఒక నమ్మదగిన కారు ' అని హామిల్టన్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ 20 రేసులో జరగ్గా, అందులో రోస్ బర్గ్ 9 గెలిచాడు. అటు హామిల్టన్ కూడా తొమ్మిది విజయాల్నే సొంతం చేసుకున్నాడు. అయితే పాయింట్ల పరంగా రోస్ బర్గ్ కంటే హామిల్టన్ 12 పాయింట్లు వెనుకబడ్డాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 367 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, హామిల్టన్ 355 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.ఇక ఈ సీజన్ లో మిగిలింది అబుదాబి గ్రాండ్ ప్రి మాత్రమే. నవంబర్ 27వ తేదీన ఈ రేసు జరుగనుంది. ఇందులో హామిల్టన్ గెలిస్తే 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 18 పాయింట్లు, మూడో స్థానంలో నిలిస్తే 15పాయింట్లు, నాల్గో స్థానంలో నిలిస్తే 12 పాయింట్లు వస్తాయి. అంటే రోస్ బర్గ్ మూడో స్థానంలో నిలిచినా చాంపియన్ గా అవతరిస్తాడు. -
రయ్ రయ్... రోస్‌బర్గ్
జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ఈ సీజన్లో తొమ్మిదో విజయం మెర్సిడెస్ జట్టుకు కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ సుజుకా: గత రెండేళ్లలో జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. అయితే రెండుసార్లూ అతను లూయిస్ హామిల్టన్ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఈసారి అలా జరగలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ చివరి ల్యాప్ వరకు తన ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. తొలిసారి జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 26 నిమిషాల 43.333 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా... గత ఏడాది విజేత హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్లో తొమ్మిదో విజయాన్ని సాధించిన రోస్‌బర్గ్ కెరీర్లో ఇది 23వ టైటిల్. రోస్‌బర్గ్, హామిల్టన్ ఫలితాలతో... మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ వరుసగా మూడో ఏడాదీ మెర్సిడెస్ జట్టుకు (593 పాయింట్లు) ఖాయమైంది. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (313 పాయింట్లు), హామిల్టన్ (280 పాయింట్లు), రికియార్డో (212 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తదుపరి రేసు యూఎస్ గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. ‘హామిల్టన్, నాకు మధ్య 33 పాయింట్ల తేడా ఉంది. అయితే ఈ ఆధిక్యంపై నేను దృష్టి పెట్టలేదు. మిగిలిన మరో నాలుగు రేసుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాను. హామిల్టన్‌ను తక్కువ అంచనా వేయడంలేదు’ అని రోస్‌బర్గ్ వ్యాఖ్యానించాడు. గమ్యం చేరారిలా (టాప్-10): 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1:26:43.333 సెకన్లు), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్-1:26:48.311 సె), 3. హామిల్టన్ (మెర్సిడెస్-1:26:49.109 సె), 4. వెటెల్ (ఫెరారీ-1:27:03.602 సె), 5. రైకోనెన్ (ఫెరారీ-1:27:11.703 సె), 6. రికియార్డో (రెడ్‌బుల్-1:27:17.274 సె), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1:27:40.828 సె), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా-1:27:42.510 సె), 9. మసా (విలియమ్స్-1:28:20.409 సె), 10. బొటాస్ (విలియమ్స్-1:28:21.656 సెకన్లు). -
వరల్డ్ టైటిల్ దిశగా..
సుజుకా(జపాన్): ఇప్పటికే ఈ సీజన్ ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో అత్యధిక విజయాలతో దూసుకుపోతున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వరల్డ్ టైటిల్ దిశగా సాగుతున్నాడు. జపాన్ గ్రాండ్ ప్రి ప్రధాన రేసులో రోస్ బర్గ్ విజేతగా నిలవడంతో తన పాయింట్ల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన రోస్ బర్గ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ 53 ల్యాప్ లను రేసును రోస్ బర్గ్ అందరి కంటే వేగంగా పూర్తి చేయగా, మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానంతో మెరిశాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ తన పాయింట్లను మరింత పెంచుకుని హామిల్టన్ ను వెనక్కునెట్టాడు. గత ఐదు రేసుల్లో రోస్ బర్గ్ నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం రోస్ బర్గ్ 313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, హామిల్టన్ 280 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ జరిగిన 17 ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి రేసులో రోస్ బర్గ్ తొమ్మిందిటిలో విజయం సాధించగా, హామిల్టన్ ఆరింటిలో గెలిచాడు. ఇంకా నాలుగు రేసులో మిగిలి ఉండటంతో రోస్ బర్గ్ తొలి వరల్డ్ టైటిల్ ను సాధించేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ఇక మిగిలిన నాలుగు రేసుల్లో ఒకదాంట్లో గెలిచినా రోస్ బర్గ్ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకుంటాడు. -
రోస్‌బర్గ్ దూకుడు...
సీజన్లో ఎనిమిదోసారి పోల్ పొజిషన్ నేడు జపాన్ గ్రాండ్‌ప్రి సుజుకా (జపాన్): ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఎనిమిదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఒక నిమిషం 30.647 సెకన్లలో ల్యాప్‌ను ముగించిన రోస్‌బర్గ్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో ప్రస్తుతం రోస్‌బర్గ్ (288 పాయింట్లు), హామిల్టన్ (265 పాయింట్లు) మధ్య 23 పాయింట్ల తేడా ఉంది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్‌స: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. రైకోనెన్ (ఫెరారీ), 4. వెటెల్ (ఫెరారీ), 5. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండి యా), 8. గ్రోస్యెన్ (హాస్), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. గుటిరెజ్ (హాస్), 11. బొటాస్ (విలియమ్స్), 12. మసా (విలియమ్స్), 13. క్వియాట్ (ఎస్టీఆర్), 14. సెయింజ్ (ఎస్టీఆర్), 15. అలోన్సో (మెక్లారెన్), 16. పాల్మెర్ (రెనౌ), 17. బటన్ (మెక్లారెన్), 18. మాగ్నుసెన్ (రెనౌ), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. నాసర్ (సాబెర్), 21. ఒకాన్ (మనోర్), 22. వెర్లీన్ (మనోర్). నేటి ప్రధాన రేసు ఉదయం గం. 10.25 నుంచి స్టార్ స్పోర్ట్స-2లో ప్రత్యక్ష ప్రసారం -
రోస్ బర్గ్ రెండో హ్యాట్రిక్
సింగపూర్: సీజన్ ఆరంభంలో జోరు కనబరిచి... ఆ తర్వాత తడబడి... మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ తన ఖాతాలో ఎనిమిదో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 55 నిమిషాల 48.950 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. రికియార్డో రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజా విజయంతో ఈ సీజన్లో రోస్‌బర్గ్ వరుసగా మూడు టైటిల్స్‌ను రెండోసారి సాధించనట్టయింది. సీజన్ ఆరంభంలో జరిగిన నాలుగు రేసుల్లోనూ రోస్‌బర్గ్ గెలుపొందగా... గత రెండు రేసులు ఇటలీ, బెల్జియం గ్రాండ్ప్రిల్లోనూ అతనికే టైటిల్ లభించింది. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో రోస్‌బర్గ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. ప్రస్తుతం రోస్‌బర్గ్ ఖాతాలో 273 పాయింట్లు, హామిల్టన్ ఖాతాలో 265 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు సింగపూర్ రేసులో భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలను అందించింది. సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే కారుపై నియంత్రణ కోల్పోయి గోడకు ఢీకొట్టి రేసు నుంచి నిష్కమ్రించాడు. సీజన్‌లోని తదుపరి రేసు మలేసియా గ్రాండ్‌ప్రి అక్టోబరు 2న జరుగుతుంది. గమ్యం చేరారిలా (టాప్-10): 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్-1:55:48.950 సెకన్లు), 2. రికియార్డో (రెడ్‌బుల్-1:55:49.438 సె), 3. హామిల్టన్ (మెర్సిడెస్-1:55:56.988 సె), 4. రైకోనెన్ (ఫెరారీ-1:55:59.169 సె), 5. వెటెల్ (ఫెరారీ-1:56:16.644 సె), 6. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్-1:57:00.147 సె), 7. అలోన్సో (మెక్లారెన్-1:57:18.148 సె), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1:57:40.012 సె), 9. క్వియాట్ (ఎస్టీఆర్-1:57:40.507 సె), 10. మాగ్నుసెన్ (రెనౌ-1:57:48.902 సె). -
రోస్బర్గ్కు ఆరో ‘పోల్’
నేడు బెల్జియం గ్రాండ్‌ప్రి రేసు స్పా-ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): మరోసారి క్వాలిఫరుుంగ్‌లో రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫరుుంగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 48.744 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
మళ్లీ రోస్బర్గ్కే ‘పోల్’
హాకెన్‌హీమ్ (జర్మనీ) : సొంతగడ్డపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రాణించాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 14.363 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది ఐదో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
రోస్బర్గ్కే పోల్ పొజిషన్
హాకెన్‌హీమ్:ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సొంతగడ్డపై శనివారం జరిగిన జర్మన్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ పోల్ పొజిషన్ సాధించాడు. తద్వారా ఈ సీజన్ లో ఐదోసారి పోల్ పొజిషన్ ను నమోదు చేశాడు. రోస్ బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 14. 363 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్ బర్గ్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. అయితే అతని సహచర జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 0.107 సెకన్ల వెనుకబడి రెండో స్థానానికి పరిమితం కాగా, రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో మూడో స్థానంలో నిలిచాడు. గత హంగేరీ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ కు ఇది వరుసగా రెండో పోల్ పొజిషన్. -
హామిల్టన్ సరికొత్త రికార్డు
హంగారోరింగ్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గత బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచి ఆ టైటిల్ ను వరుసగా మూడు సార్లు సాధించిన తొలి ఇంగ్లిష్ డ్రైవర్ గా ఘనత సాధించిన హామిల్టన్.. తాజాగా జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ ను అత్యధికంగా ఐదుసార్లు గెలిచిన డ్రైవర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలవడంతో ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు 2007, 09,12,13 సంవత్సరాల్లో హంగేరి గ్రాండ్ ప్రి ఫార్ములావన్ టైటిల్ ను హామిల్టన్ సాధించాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో హామిల్టన్ ఖాతాలోఐదో విజయం చేరడం మరో విశేషం. అంతకుముందు మొనాకో, కెనడా, ఆస్ట్రియన్, బ్రిటీష్ గ్రాండ్ ప్రిలను హామిల్టన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగిన హామిల్టన్ అదే ఊపును చివరి వరకూ కొనసాగించాడు. 70 ల్యాప్‌లో రేసును అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అయితే పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మరోవైపు రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికాయార్డో మూడో స్థానం సాధించాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్ బర్గ్‌ను హామిల్టన్ వెనుక్కునెట్టాడు. ఈ సీజన్లో తొలిసారి హామిల్టన్(181పాయింట్లు) ప్రథమ స్థానంలోకి రాగా, రోస్ బర్గ్(178పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’
* వరుసగా మూడోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ఈ సీజన్ ఆరంభంలో నిరాశపరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సొంతగడ్డపై జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములవన్ రేసులో హామిల్టన్ వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ నిర్ణీత 52 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 55.831 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఐదు రేసుల్లో నాలుగింట హామిల్టనే విజయం సాధించడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్‌కిది నాలుగో బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్. 2008లో తొలిసారి అతను ఈ టైటిల్‌ను నెగ్గాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్‌బర్గ్ (171 పాయింట్లు), హామిల్టన్ (167 పాయింట్లు) మధ్య తేడా నాలుగు పాయింట్లకు చేరింది. ఈ సీజన్లో మరో 11 రేసులు మిగిలి ఉన్నాయి. తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. హామిల్టన్ సహచరుడు రోస్బర్గ్కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్‌కు ఆరో స్థానం, హుల్కెన్‌బర్గ్‌కు ఏడో స్థానం లభించింది. -
హామిల్టన్ సరికొత్త చరిత్ర
సిల్వర్‌స్టోన్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో హామిల్టన్ విజయం సాధించి వరుసగా మూడు సార్లు బ్రిటీష్ గ్రాండ్ ప్రి గెలిచిన తొలి డ్రైవర్ గా రికార్డు సాధించాడు. 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్ అందరి కంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఈ సీజన్లో నాల్గో విజయాన్ని హామిల్టన్ తన ఖాతాలో వేసుకోగా, వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. మరోవైపు బ్రిటీష్ గ్రాండ్ ప్రిని హామిల్టన్ ఓవరాల్‌గా నాలుగుసార్లు గెలిచి మాజీ ఫార్ములావన్ డ్రైవర్ నిజిల్ మేన్ సిల్ సరసన నిలిచాడు. సొంతగడ్డపై జరిగిన ఈ రేసులో హామిల్టన్ దుమ్మురేపగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ పాయింట్లకు హామిల్టన్ మరింత దగ్గరగా వచ్చాడు. కేవలం రోస్ బర్గ్ కంటే నాలుగు పాయింట్లు మాత్రమే హామిల్టన్ వెనకబడ్డాడు. ఇదిలా ఉండగా, మ్యాక్స్ వెర్స్టాపెన్(రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన డేనియల్ రికార్డియో నాల్గో స్థానానికి పరిమితమై పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమయ్యాడు. -
హామిల్టన్‌కే పోల్
సిల్వర్‌స్టోన్:ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్, మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ ఈ సీజన్లో ఆరో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బ్రిటీష్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ 1:29:287 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి పోల్ పొజిషన్ సాధించాడు.ఓవరాల్ గా ఇది హామిల్టన్ కెరీర్లో 55వ పోల్ పొజిషన్. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. ఇదిలా ఉండగా, హామిల్టన్ కంటే 0:319 సెకన్లు వెనుకబడ్డ అతని సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ తొమ్మిది ఫార్ములావన్ రేసులో జరగ్గా అందులో రోస్ బర్గ్ ఐదింటిని, హామిల్టన్ మూడింటిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 153 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, హామిల్టన్ 142 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు స్పెయిన్ గ్రాండ్ ప్రి విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, డానియల్ రికార్డో(రెడ్ బుల్) నాల్గో స్థానంలో సాధించారు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుల్కెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ పదకొండో స్థానాలకు పరిమితమయ్యారు. -
హామిల్టన్ హవా
* కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో రెండో విజయం మాంట్రియల్ (కెనడా): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్‌లోని తొలి ఐదు రేసుల్లో విఫలమైన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తాజాగా వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. రెండు వారాల క్రితం మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ఈ బ్రిటన్ డ్రైవర్... భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలోనూ టైటిల్ సాధించాడు. 70 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 31 నిమిషాల 05.296 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి గమ్యానికి చేరుకున్నాడు. మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... బొటాస్ (విలియమ్స్)కు మూడో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ (8వ స్థానం), పెరెజ్ (పదో స్థానం) టాప్-10లో నిలువడం విశేషం. సీజన్లో ఏడు రేసులు ముగిశాక రోస్‌బర్గ్ (మెర్సిడెస్-116 పాయింట్లు), హామిల్టన్ (మెర్సిడెస్-107 పాయింట్లు), వెటెల్ (ఫెరారీ-78 పాయింట్లు) టాప్-3లో ఉన్నారు. సీజన్లో తదుపరి రేసు యూరోప్ గ్రాండ్‌ప్రి అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో ఈనెల 19న జరుగుతుంది. అలీకి అంకితం కెనడా గ్రాండ్‌ప్రి విజయాన్ని దివంగత మేటి బాక్సర్ మొహమ్మద్ అలీకి అంకితం ఇస్తున్నట్లు హామిల్టన్ ప్రకటించాడు. ‘సాధారణంగా నా విజయాన్ని నేనెవరికీ అంకితం ఇవ్వను. కానీ బాక్సర్ అలీ నన్నెంతగానో ప్రభావితం చేశారు. ఆయన జీవితం నాకు ప్రేరణగా నిలిచింది. ఈ రేసులో నేను డ్రైవ్ చేస్తున్న సమయంలోనూ ఆయన గురించి ఆలోచించాను’ అని హామిల్టన్ వ్యాఖ్యానించాడు. -
కెనడా గ్రాండ్ ప్రి విజేత హామిల్టన్
మోంట్రీల్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన కెనాడియన్ గ్రాండ్ ప్రిలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల రేసును ఒక గంటా 31 నిమిషాల 05.296 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించాడు. పోల్ పొజిషన్ తో ప్రధాన రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆకట్టుకుని విజయం సాధించాడు. ఇది హామిల్టన్ కెరీర్ లో 45వ విజయం. కాగా, అంతకుముందు ఈ ఏడాది జరిగిన మొనాకో గ్రాండ్ టైటిల్ ను గెలిచి వరుసగా రెండో విజయాన్ని హామిల్టన్ దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ ఐదో స్థానానికి పరిమితం కాగా, ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ రెండో స్థానాన్ని సాధించాడు. మరోవైపు భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుకెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలవగా, సెర్గియో పెరెజ్ 11వ స్థానానికి పరిమితమయ్యాడు.ఈ విజయాన్ని ఇటీవల కన్నుమూసిన బాక్సింగ్ దిగ్గజం మొహ్మద్ అలీకి అంకితం ఇస్తున్నట్లు హామిల్టన్ ప్రకటించాడు. -
రోస్‌బర్గ్ 'హ్యాట్రిక్'
* చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో వరుసగా మూడో విజయం షాంఘై (చైనా): క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ వరుసగా మూడో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ 56 ల్యాప్‌లను గంటా 38 నిమిషాల 53.891 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. ఓవరాల్‌గా వరుసగా అతనికిది ఆరో టైటిల్. గతేడాది చివరి మూడు రేసుల్లో (మెక్సికో, బ్రెజిల్, అబుదాబి గ్రాం డ్‌ప్రి) నెగ్గిన రోస్‌బర్గ్ ఈ ఏడాది జరిగిన తొలి మూడు రేసుల్లోనూ (ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా) టైటిల్ సాధించడం విశేషం. చివరి స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానాన్ని సంపాదించాడు. వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... క్వియాట్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు నిరాశన మిగిల్చింది. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ టాప్-10 నిలువడంలో విఫలమయ్యారు. పెరెజ్ 11వ స్థానంలో, హుల్కెన్‌బర్గ్ 15వ స్థానంతో సరిపెట్టుకున్నారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రోస్‌బర్గ్ 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హామిల్టన్ 39 పాయింట్లతో రెండో స్థానంలో, రికియార్డో 36 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి మే 1వ తేదీన జరుగుతుంది. -
రోస్బర్గ్కు తొలి ‘పోల్’
♦ చివరి స్థానం నుంచి హామిల్టన్ ♦ నేడు చైనా గ్రాండ్‌ప్రి షాంఘై (చైనా): ఫార్ములావన్ సీజన్‌లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మూడో విజయంపై దృష్టి పెట్టాడు. శనివారం జరి గిన చైనా గ్రాండ్‌ప్రి రేసు క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.402 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. గత రెండు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్‌కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్వాలిఫయింగ్ తొలి సెషన్లో ల్యాప్ కూడా పూర్తి చేయకుండానే వైదొలిగాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ చివరి స్థానం నుంచి మొదలుపెడతాడు. 2014లో హంగేరి గ్రాండ్‌ప్రి తర్వాత హామిల్టన్ ఒక రేసును చివరి స్థానం నుంచి ప్రారంభిస్తుండటం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఏడు, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. రికియార్డో (రెడ్‌బుల్), 3. రైకోనెన్ (ఫెరారీ), 4. వెటెల్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. క్వియాట్ (రెడ్‌బుల్), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 8. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 10. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 11. మసా (విలియమ్స్), 12. అలోన్సో (మెక్లారెన్), 13. బటన్ (మెక్లారెన్), 14. గ్రోస్యెన్ (హాస్), 15. ఎరిక్సన్ (సాబెర్), 16. నాసర్ (సాబెర్), 17. మాగ్నుసన్ (రెనౌ), 18. గుటిరెజ్ (హాస్), 19. పాల్మెర్ (రెనౌ), 20. హర్యాంతో (మనోర్), 21. వెర్లీన్ (మనోర్), 22. హామిల్టన్ (మెర్సిడెస్). -
రోస్బర్గ్కే పోల్ పొజిషన్
షాంఘై:ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే దూకుడును చైనీస్ గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.402 సెకెండ్లలో ల్యాప్ ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్ బర్గ్ తొలిస్థానం నుంచి ప్రారంభిస్తాడు. అయితే రెడ్ బుల్ కు చెందిన డానియల్ రికార్డో రెండో స్థానం సాధించడం విశేషం. మరోవైపు ఫోర్స్ ఇండియాకు చెందిన సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలిచాడు. -
విజయంతో ముగింపు
అబుదాబి గ్రాండ్‌ప్రి విజేత రోస్‌బర్గ్ అబుదాబి: ఫార్ములావన్ 2015 సీజన్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ రోస్‌బర్గ్ విజయంతో ముగించాడు. సీజన్‌లోని చివరిదైన అబుదాబి గ్రాండ్‌ప్రిలో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 55 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన రోస్‌బర్గ్ గంటా 38 నిమిషాల 30.175 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్‌కు రెండో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఐదో స్థానాన్ని, హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని పొందారు. 19 రేసుల ఈ ఏడాది సీజన్లో హామిల్టన్ 381 పాయింట్లతో చాంపియన్‌గా నిలువగా... 322 పాయిం ట్లతో రోస్‌బర్గ్ రెండో స్థానంలో, 278 పాయింట్లతో వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా ఈ సీజన్లో హామిల్టన్ పది రేసుల్లో, రోస్‌బర్గ్ ఆరు రేసుల్లో, వెటెల్ మూడు రేసుల్లో టైటిల్ సాధించారు. -
రోస్‌బర్గ్‌దే విజయం
* బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * హామిల్టన్‌కు రెండో స్థానం సావోపాలో: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 31 నిమిషాల 09.090 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రోస్బర్గ్ను మొదటి ల్యాప్‌లో సహచరుడు లూయిస్ హామిల్టన్ ఓవర్టేక్ చేయబోయినా... రోస్‌బర్గ్ చాకచక్యంగా డ్రైవ్ చేసి ముందుకు దూసుకెళ్లాడు. ఆ తర్వాత చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఐదో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇప్పటికే ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను ఖరారు చేసుకున్న హామిల్టన్ రెండో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మాజీ చాంపియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 12వ స్థానంలో నిలిచాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ప్రస్తుతం హామిల్టన్ (363 పాయింట్లు), రోస్‌బర్గ్ (297), వెటెల్ (266) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్లో చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. బ్రెజిల్ గ్రాండ్‌ప్రి ఫలితాలు: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. బొటాస్ (విలియమ్స్), 6. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. గ్రోస్యెన్ (లోటస్), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 10. మల్డొనాడో (లోటస్), 11. రికియార్డో (రెడ్‌బుల్), 12. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 13. నాసర్ (సాబెర్), 14. బటన్ (మెక్లారెన్), 15. అలోన్సో (మెక్లారెన్), 16. ఎరిక్సన్ (సాబెర్), 17. స్టీవెన్స్ (మనోర్), 18. రోసీ (మనోర్). -
మరోసారి అదరగొట్టిన రోస్‌బర్గ్
సావో పౌలో(బ్రెజిల్): ఈ సీజన్ లో మరోసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ అదరగొట్టాడు. ఆదివారం రాత్రి జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన రోస్ బర్గ్ విజేతగా అవతరించాడు. 71 ల్యాప్‌ల రేసును గంటా 31 నిమిషాల 09.090 సెకన్లలో పూర్తి చేసి రోస్ బర్గ్ అగ్రస్థానంలో నిలిచాడు. తన సహచరుడు, ప్రపంచ చాంపియన్ లూయిస్ హమిల్టన్ కంటే 7 నిమిషాల, 756 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరుకున్న రోస్ బర్గ్ వరుసగా రెండో టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. అంతకుముందు రెండు వారాల క్రితం మెక్సికన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్నరోస్ బర్గ్.. అదే ఊపును బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది తన టైటిల్ సంఖ్యను ఐదుకు పెంచుకున్నరోస్ బర్గ్.. మొత్తంగా 13 వ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో హమిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు నికో హుకెన్ బర్గ్ ఆరోస్థానంలో , సెర్గియా పెరిజ్ 12వ స్థానంలో నిలిచారు. -
దుమ్మురేపిన రోస్ బర్గ్
మెక్సికో: గత 23 ఏళ్ల అనంతరం తొలిసారి మెక్సికోలో జరిగిన మెక్సికన్ గ్రాండ్ ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ దుమ్మురేపాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 42 నిమిషాల 35.038 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, సహచరుడు లూయిస్ హమిల్టన్(మెర్సిడెస్) ను బోల్తా కొట్టించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. రోస్ బర్గ్ కంటే ఒక నిమిషం 954 సెకన్ల వెనుకబడ్డ హమిల్టన్ రెండో స్థానంలో నిలవగా.. విలియమ్స్ జట్టు డ్రైవర్ బోటాస్ మూడో స్థానం సాధించాడు. కాగా, భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ ఆకట్టుకుంది. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో నిలువగా, మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో పోల్ పొజిషన్ సాధించిన రోస్ బర్గ్ ప్రధాన రేసును మొదటి స్థానం నుంచి ఆరంభించగా.. హమిల్టన్ రెండో స్థానం నుంచి ప్రధాన రేసును ప్రారంభించాడు. ఆదివారం రాత్రి జరిగిన ప్రధాన రేసులో రోస్ బర్గ్ -హమిల్టన్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. కాగా, 51వ ల్యాప్ వద్ద హమిల్టన్ ను దాటుకుని ముందుకు దూసుకుపోయిన రోస్ బర్గ్ అదే పరంపరను చివరి వరకూ కొనసాగించి మెక్సికన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్ లో రోస్ బర్గ్ సాధించిన టైటిల్ సంఖ్య నాలుగుకు చేరగా, ఓవరాల్ గా అతని కెరీయర్ లో 12 వ టైటిల్ వచ్చి చేరింది. ఈ సీజన్ లో గత జూన్ 21 వ తేదీన జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి సాధించిన తరువాత రోస్ బర్గ్ కు ఇదే తొలి టైటిల్. ఈ సీజన్ లో స్పానిష్ గ్రాండ్ ప్రి, మొనాకో గ్రాండ్ ప్రి, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి, మెక్సికన్ గ్రాండ్ ప్రి టైటిళ్లను రోస్ బర్గ్ తన ఖాతాలో వేసుకున్నాడు. క్వాలిఫయింగ్ రేసులో రోస్ బర్గ్ ఒక నిమిషం 19.480 సెకన్లలో ల్యాప్ ను పూర్తి చేసుకుని పోల్ పొజిషన్ సాధించాడు. దీంతో రోస్ బర్గ్ ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించాడు. రోస్ బర్గ్ కంటే 0.188 సెకన్ల వెనుకబడ్డ హమిల్టన్ రెండో స్ధానంతో రేసును మొదలు పెట్టాడు. అంతకుముందు సెప్టెంబర్ లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రి తరువాత హమిల్టన్ పోల్ పొజిషన్ సాధించలేదు. గడిచిన మూడు రేసుల్లో రోస్ బర్గ్ పోల్ పొజిషన్ సాధించినా.. ప్రధాన రేసుకు వచ్చేసరికి హమిల్టన్ చేతిలో భంగపడ్డాడు. -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
సుజుకా (జపాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 41వ ఫార్ములావన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. పోల్ పొజిషన్ సాధించిన మెర్సిడెస్ జట్టు మరో డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన వీరిద్దరూ ప్రధాన రేసును తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించి చివరివరకు తమ ఆధిక్యం కొనసాగించారు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు చెందిన 'ఫోర్స్ ఇండియా' జట్టు డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలిచాడు.