రికియార్డో హవా
స్పా (బెల్జియం): క్వాలిఫయింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ప్రధాన రేసులో మాత్రం రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో సత్తా చాటాడు. రోస్‌బర్గ్. బొటాస్, రైకోనెన్‌ల దూకుడుకు కళ్లెం వేస్తూ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును గంటా 24 నిమిషాల 36.556 సెకన్లలో ముగించాడు. ఎఫ్1లో రెడ్‌బుల్ జట్టుకు ఇది 50వ విజయం. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సంతృప్తిపడ్డాడు.
బొటాస్, రైకోనెన్, వెటెల్ వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. ఆరంభంలో ఆధిక్యంలో ఉన్న హామిల్టన్.. రెండో ల్యాప్‌లో రోస్‌బర్గ్ కారును ఢీకొట్టాడు. ఫలితంగా టైర్ పంక్చర్ కావడంతో పుంజుకోలేకపోయాడు. 38 ల్యాప్‌ల తర్వాత హామిల్టన్ రేసు నుంచి వైదొలిగాడు. మరో ముగ్గురు కూడా మధ్యలోనే రిటైరయ్యారు. రేసు ఆద్యంతం రోస్‌బర్గ్, రికియార్డోల మధ్య గట్టి పోటీ జరిగింది. కేవలం 3.3 సెకన్ల తేడాతో రోస్‌బర్గ్ వెనుకబడిపోయాడు.
పెరెజ్‌కు పాయింట్లు
ఈ రేసులో ఫోర్స్ జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్ ఆకట్టుకున్నారు. 13వ గ్రిడ్ నుంచి రేసును ప్రారంభించిన పెరెజ్ 9వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు సాధించాడు. మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ 18వ గ్రిడ్ నుంచి రేసును ప్రారంభించి 10వ స్థానంతో 1 పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. మొదట మ్యాగ్నుసెన్ ఆరో స్థానంలో నిలిచినా 20 సెకన్ల పెనాల్టీ విధించడంతో అతను 12వ స్థానానికి పడిపోయాడు. దీంతో హుల్కెన్‌బర్గ్ ముందుకొచ్చి 10వ స్థానంలో నిలిచాడు.