Daniel Ricciardo
-
Italian Grand Prix: తొమ్మిదేళ్ల తర్వాత...
మోంజా (ఇటలీ): దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు విజేతగా నిలిచింది. 2012లో జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా విజేతగా నిలిచిన ఆ జట్టు ఇన్నేళ్లకు ఇటలీ గ్రాండ్‌ప్రిలో మెరిసింది. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో మెక్లారెన్ డ్రైవర్ డానియెల్ రికియార్డో చాంపియన్‌గా నిలిచాడు. 53 ల్యాప్‌ల రేసును అతడు అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన రికియార్డో... ట్రాక్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం తన లీడ్‌ను నిలబెట్టుకున్న అతడు విజేతగా నిలిచాడు. 1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్ (మెర్సిడెస్) నిలిచాడు. హోమ్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్లు లెక్లెర్క్ నాలుగో స్థానంలో... సెయింజ్ ఆరో స్థానంలో నిలిచారు. -
ఫెరారీ డ్రైవర్‌గా సెయింజ్
పారిస్: ఫెరారీ జట్టులో స్టార్ రేసర్‌గా వెలుగొందిన సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ) స్థానాన్ని కార్లోస్ సెయింజ్ (జూనియర్)తో భర్తీ చేశారు. ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నట్లు ఫార్ములావన్ టీమ్ ఫెరారీ వెల్లడించింది. నాలుగు సార్లు ఫార్ములావన్ చాంపియన్ అయిన జర్మనీ డ్రైవర్ వెటెల్ ఫెరారీని వీడనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో పలువురి పేర్లు వినిపించినా... చివరకు సెయింజ్‌కు ఆ చాన్స్ దక్కింది. 2021, 2022 ఫార్ములావన్ రెండు సీజన్లలో సెయింజ్ ఫెరారీ స్టీరింగ్ చేపట్టనున్నాడు. ప్రస్తుతం మెక్‌లారెన్‌తో ఉన్న సెయింజ్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితో ముగియనుంది. 2015లో టోరో రోసోతో తన ఫార్ములా కెరీర్‌ను ఆరంభించిన సెయింజ్... అనంతరం రీనాల్ట్, మెక్లారెన్ జట్లకు డ్రైవర్‌గా వ్యవహరించాడు. ‘సెయింజ్ ప్రతిభ గల డ్రైవర్... గత ఐదు సీజన్లలో అతడు తనను తాను నిరూపించుకున్నాడు. అతడికి ఫెరారీ స్వాగతం పలుకుతోంది’ అని ఫెరారీ జట్టు చీఫ్ మాటియో బినోటో తెలిపారు. ఫెరారీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని.. అయితే ప్రస్తుతం ఈ సీజన్లో మెక్లారెన్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చి వారికి ఘనమైన వీడ్కోలు పలకడమే తన ముందున్న లక్ష్యం అని సెయింజ్ పేర్కొన్నాడు. సెయింజ్ వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని రికియార్డో (ఆస్ట్రేలియా)తో భర్తీచేసుకున్నట్లు మెక్లారెన్ జట్టు వెల్లడించింది. కరోనాతో నిలిచిపోయిన 2020 సీజన్ ఈ జూలైలో ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
రికియార్డోకు పోల్
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో మొనాకో ట్రాక్‌పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్ రేసులో అందరికంటే వేగంగా 1ని.10.810 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (1:11.039 సె.), మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1:11.232 సె.) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆదివారం జరిగే ప్రధాన రేసును రికియార్డో తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. అతను ఇక్కడ పోల్ పొజిషన్ సాధించడం ఇది రెండో సారి. రెండేళ్ల క్రితం (2016) పోల్ సాధించినప్పటికీ తుది రేసులో మాత్రం రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ (1:12.061 సె.) ఆరో స్థానంలో, సెర్గియో పెరెజ్ (1:12.154 సె.) 9వ స్థానంలో నిలిచారు. -
నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది?
సెపంగ్: 'మెర్సిడెస్ కు ఇదే నా ప్రశ్న. డ్రైవర్ల కోసం చాలా ఇంజన్లు తయారు చేశాం. కానీ ఈ సంవత్సరం నా ఇంజినే ఎందుకు ఫెయిలైంది. నేను డ్రైవర్స్ చాంపియన్ షిష్ రేసులో ఉన్నాను. ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటన ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు. కేవలం నా ఇంజిన్లు మాత్రమే ఎందుకు చెడిపోతున్నాయి. ఈ ప్రశ్నకు నాకు సమాధానం దొరకాలి. అప్పటివరకూ నాకు నిద్రపట్టదు' అని ప్రపంచచాంపియన్ హామిల్టన్ అసహనం వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగిన మలేషియా గ్రాండ్ ప్రి ప్రధాన రేసులో మెర్సిడెస్ కు చెందిన హామిల్టన్ కారు ఇంజన్లో మంటలు వ్యాపించాయి. దాంతో అప్పటివరకూ ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ పోరును అర్ధాంతరంగా ముగించాడు. 56 ల్యాప్‌ల రేసులో భాగంగా హామిల్టన్ 40 వ ల్యాప్ లో ఉండగా కారు ఇంజన్ లో ఆకస్మికంగా పొగ వ్యాపించింది. ఆ తరువాత ఒక ల్యాప్ ను కొనసాగించిన తరువాత మంటలు రావడంతో హామిల్టన్ పోరు నుంచి రిటైర్డ్ అయ్యాడు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న రెడ్ బుల్ డ్రైవర్ డేనియల్ రికియార్డో విజేతగా నిలిచి మలేషియా గ్రాండ్ ప్రిని సాధించాడు. మరో రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. గత సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ కు మూడో స్థానం దక్కింది. -
రికియార్డో హవా
స్పా (బెల్జియం): క్వాలిఫయింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ప్రధాన రేసులో మాత్రం రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో సత్తా చాటాడు. రోస్‌బర్గ్. బొటాస్, రైకోనెన్ల దూకుడుకు కళ్లెం వేస్తూ ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల రేసును గంటా 24 నిమిషాల 36.556 సెకన్లలో ముగించాడు. ఎఫ్1లో రెడ్‌బుల్ జట్టుకు ఇది 50వ విజయం. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సంతృప్తిపడ్డాడు. బొటాస్, రైకోనెన్, వెటెల్ వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. ఆరంభంలో ఆధిక్యంలో ఉన్న హామిల్టన్.. రెండో ల్యాప్‌లో రోస్‌బర్గ్ కారును ఢీకొట్టాడు. ఫలితంగా టైర్ పంక్చర్ కావడంతో పుంజుకోలేకపోయాడు. 38 ల్యాప్‌ల తర్వాత హామిల్టన్ రేసు నుంచి వైదొలిగాడు. మరో ముగ్గురు కూడా మధ్యలోనే రిటైరయ్యారు. రేసు ఆద్యంతం రోస్‌బర్గ్, రికియార్డోల మధ్య గట్టి పోటీ జరిగింది. కేవలం 3.3 సెకన్ల తేడాతో రోస్‌బర్గ్ వెనుకబడిపోయాడు. పెరెజ్‌కు పాయింట్లు ఈ రేసులో ఫోర్స్ జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్‌బర్గ్ ఆకట్టుకున్నారు. 13వ గ్రిడ్ నుంచి రేసును ప్రారంభించిన పెరెజ్ 9వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు సాధించాడు. మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ 18వ గ్రిడ్ నుంచి రేసును ప్రారంభించి 10వ స్థానంతో 1 పాయింట్‌తో సరిపెట్టుకున్నాడు. మొదట మ్యాగ్నుసెన్ ఆరో స్థానంలో నిలిచినా 20 సెకన్ల పెనాల్టీ విధించడంతో అతను 12వ స్థానానికి పడిపోయాడు. దీంతో హుల్కెన్‌బర్గ్ ముందుకొచ్చి 10వ స్థానంలో నిలిచాడు. -
రికియార్డో హవా
హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో విజయం ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ బుడాపెస్ట్: ఈ సీజన్లో జోరుమీదున్న రోస్‌బర్గ్, హామిల్టన్‌ల దూకుడుకు కళ్లెం వేస్తూ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ రికియార్డో ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో రికియార్డో విజేతగా అవతరించాడు. 70 ల్యాప్‌ల రేసును రికియార్డో గంటా 53 నిమిషాల 05.058 సెకన్లలో ముగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలోన్సో రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్‌కు మూడో స్థానం దక్కింది. హోరాహోరీగా సాగిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశనే మిగిల్చింది. ‘ఫోర్స్’ ఇద్దరు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ ప్రమాదాల కారణంగా వరుసగా 14వ, 22వ ల్యాప్‌ల్లో రేసు నుంచి తప్పుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 24న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (202 పాయింట్లు) ఆధిక్యంలో కొనసాగుతుండగా... హామిల్టన్ (191 పాయింట్లు) రెండో స్థానంలో, రికియార్డో (131 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ (393 పాయింట్లు), రెడ్‌బుల్ (219 పాయింట్లు), ఫెరారీ (142 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.