మరోసారి అదరగొట్టిన రోస్‌బర్గ్
సావో పౌలో(బ్రెజిల్): ఈ సీజన్ లో మరోసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ అదరగొట్టాడు. ఆదివారం రాత్రి జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన రోస్ బర్గ్ విజేతగా అవతరించాడు. 71 ల్యాప్‌ల రేసును గంటా 31 నిమిషాల 09.090 సెకన్లలో పూర్తి చేసి రోస్ బర్గ్ అగ్రస్థానంలో నిలిచాడు. తన సహచరుడు, ప్రపంచ చాంపియన్ లూయిస్ హమిల్టన్ కంటే 7 నిమిషాల, 756 సెకన్లు ముందుగా లక్ష్యాన్ని చేరుకున్న రోస్ బర్గ్ వరుసగా రెండో టైటిల్ ను చేజిక్కించుకున్నాడు.
అంతకుముందు రెండు వారాల క్రితం మెక్సికన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్నరోస్ బర్గ్.. అదే ఊపును బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది తన టైటిల్ సంఖ్యను ఐదుకు పెంచుకున్నరోస్ బర్గ్.. మొత్తంగా 13 వ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో హమిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు నికో హుకెన్ బర్గ్ ఆరోస్థానంలో , సెర్గియా పెరిజ్ 12వ స్థానంలో నిలిచారు.